2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించిన తొలి గ్రామం ఇదే

by Disha Web Desk 2 |
2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించిన తొలి గ్రామం ఇదే
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజక వర్గం పరిధిలోని మూల స్వయంభువరం గ్రామ ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దశాబ్ధాలుగా పరవాడ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కర్మాగారం నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందనీ, సమస్య పరిష్కారం అయ్యేవరకు ఎన్నికల బహిష్కరణ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల బహిష్కరణ చేస్తున్న తొలి గ్రామం ఇదే. పీడిత ప్రాంతాల్ని వారు విలేకరులకు చూపించారు. సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా గ్రామంలోని అనేకమంది రోగాల బారిన పడి విలవిల్లాడుతున్నారు.

ఎవరూ పట్టించుకోలేదు..

దశాబ్దాలుగా గ్రామాన్ని తరలించాలన్న డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవడం లేదు. నీరు లేదు. మనుషులు చనిపోయే ప్రమాదంలో ఉన్నారు. చెట్లు బతకడం లేదు. బుగ్గి అగ్గిలా మారుతోంది. కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎన్నిసార్లు చెబుతున్నా మా గ్రామాల్నే పట్టించుకోవడం లేదంటూ ఊళ్లవారంతా గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల సమయానికే గ్రామాన్ని తరలించాలని చెబుతున్నా నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. మీ చావు మీరు చావండంటూ వదిలేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు 2024 సాధారణ ఎన్నికలను బహిష్కరించడం ద్వారా తమ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గ్రామంలోని రామాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రైటర్స్ అకాడమీ అధ్యక్షడు వీవీ రమణమూర్తి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సింహాద్రి కాలుష్య గ్రామాల్ని తరలించాల్సిన బాధ్యత ఆ ప్రాజెక్ట్ పైనా, ప్రభుత్వం పైనా ఉంటుందన్నారు. కాలుష్యం కారణంగా పరిసర గ్రామాల ప్రజలు ప్రజాస్వామ్యం ప్రసాదించిన జీవించే హక్కును కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి వెలుగులు ప్రసాదిస్తున్న సింహాద్రి కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. కనీసం ఉచిత విద్యుత్‌కు కూడా నోచుకోని పరిసర గ్రామాల ప్రజలు కాలుష్యాన్ని మాత్రం ఏళ్ల తరబడి భరించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇరవై ఏళ్లుగా కాలుష్యమే!

అంతకుముందు గ్రామస్తులు మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాల నుంచి బాధలు పడుతున్నామని, గ్రామాన్ని తరలించి పునరావాసం కల్పిస్తామని నేతలు హామీ ఇచ్చినా ఫలితం లేదన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలంతా కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధులకు గురవుతూ మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సింహాద్రి యాజమాన్యం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎన్నికల్ని బహిష్కరించి తమ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

నీరు కొనుక్కొంటున్నాం..

కాలుష్యం కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, మంచినీళ్లు సైతం బయట ప్రాంతాల నుంచి కొనుక్కోవాల్సి వస్తోందని, సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం అతి సమీపంలో ఉండటంతో ధ్వని కాలుష్యం కారణంగా ప్రజలు వినికిడి సంబంధిత వ్యాధులకు కూడా గురవుతున్నారన్నారు. భవనాలు సైతం బీటలు వారుతున్నాయన్నాయని, తక్షణమే తమ గ్రామాల్ని కాలుష్య రహిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు సాగర తీరంలో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న తమ గ్రామం నేడు కాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని, అయినా పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి ఎన్నికల ప్రచారాలకు వచ్చే పార్టీలు, నేతల్ని బహిష్కరిస్తామన్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా పునరావాసం కోసం పోరాడుతామని చెప్పారు. కార్యక్రమంలో కె. బాబూరావు, మరిస అప్పారావు, పరిణ విష్ణు, కాలపరెడ్డి సత్యనారాయణ, వెంకునాయుడు, ఎం.చంద్రశేఖర్, బొండా అప్పలనాయుడు. కాలపురెడ్డి కొండబాబు, కొత్తపల్లి బాబూరావు, కాలపు రెడ్డి లక్ష్మి, అన్నం నూకాలమ్మ తదితరులు పాల్గొని మాట్లాడారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed