బీఎస్పీ‌తో పొత్తు ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుడ్ బై!

by Disha Web Desk 2 |
బీఎస్పీ‌తో పొత్తు ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుడ్ బై!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఎస్పీతో పొత్తు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పొత్తు నచ్చని వారంతా వరుసగా అధిష్టానానికి షాకిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పరిణామంతో కన్‌ఫ్యూజన్‌లో ఉన్న బీఆర్ఎస్‌కు మరో షాకివ్వడానికి ఇద్దరు కీలక నేతలు సిద్ధమైనట్లు వార్తలు విస్తృతమయ్యాయి. బీఎస్పీతో పొత్తు కారణంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే అసెంబ్లీలో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, హైదరాబాద్‌ నందినగర్‌లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ భేటీలో వీరిద్దరూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు.. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇరు పార్టీల పొత్తు ఖరారైంది. కాగా.. త్వరలోనే ఇరు పార్టీల విధి విధానాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ను వీడటానికి కీలక నేతలు క్యూ కట్టడం క్షేత్రస్థాయి కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed