చక్రం తిప్పిన జగ్గారెడ్డి.. సంగారెడ్డిలో బీజేపీకి BIG షాక్

by Disha Web Desk 2 |
చక్రం తిప్పిన జగ్గారెడ్డి.. సంగారెడ్డిలో బీజేపీకి BIG షాక్
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి గట్టి షాకిచ్చారు. వ్యూహాత్మకంగా చక్రం తిప్పి బీజేపీ నియోకజవర్గ ఇన్‌చార్జిని కాంగ్రెస్‌లోకి రప్పించారు. జగ్గారెడ్డి సూచనలతో బీజేపీ ఇన్చార్జి పులిమామిడి రాజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజలు పులిమామిడి రాజును వెంట తీసుకుని సీఎం వద్దకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి రాజుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిలో బరిలో నిలిచి రాజు ఆ పార్టీకి రాజీనామా చేయడం బీజేపీకి తీవ్ర నష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ నాయకుడు చెబుతుండటంతో ఏ పార్టీ నుంచి ఎవరెవరు చెరనున్నారనే అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నది.


జగ్గారెడ్డి పిలుపుతో కాంగ్రెస్‌లోకి...

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎంపీ ఎన్నికల వేళ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ సత్తా చాటేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లోకి చేరికలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన సతీమణి అయిన కార్పొరేషన్ చైర్ పర్సన్ నిర్మల సెగ్మెంట్‌లోనే ఉంటూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే. ఓ వైపు జగ్గారెడ్డి, మరో వైపు నిర్మలలు పార్టీ బలోపేతంపై నజర్ పెట్టారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పులి మామిడి రాజును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఆయన పిలుపుతో రాజు కాంగ్రెస్‌లో చేరడానికి ఓకే చెప్పారు.

సీఎం రేవంత్ సమక్షంలో...

జిల్లా ఇన్ చార్జి మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌లతో కలిసి వెళ్లిన రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మంత్రితో పాటు జగ్గారెడ్డి, నీలం మధు, ఇతర పార్టీ నేతలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మెదక్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ జెండా ఎగురేయాలని ఆయన సూచించారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించాలని కోరారు. ఆ తరువాత నీలం మధు ముదిరాజ్, పులిమామిడి రాజులు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీని కలిశారు. ఆమె కూడా రాజుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ...

పులిమామిడి రాజు కాంగ్రెస్‌లో చేరడంతో సంగారెడ్డి సెగ్మెంట్‌తో పాటు జిల్లాలో కూడా బీజేపీపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ప్రధానంగా సంగారెడ్డిలో బీజేపీకి ముఖ్య నాయకుడైన రాజు ఆ పార్టీని వీడడం నష్టంగా చెప్పుకోవచ్చు. ఇదెలా ఉండగా కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాంగ్రెస్‌లో చేరనున్నారనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది.



Next Story

Most Viewed