తెలంగాణలోనూ వైన్ షాపులు తెరుచుకుంటాయా?

by  |
తెలంగాణలోనూ వైన్ షాపులు తెరుచుకుంటాయా?
X

దిశ, న్యూస్ బ్యూరో: మూడవ విడత లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలను సడలించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుంది? తెలంగాణలోనూ సడలించనుందా? ప్రైవేటు ఆఫీసులు పరిమిత స్థాయిలో పనిచేయనున్నాయా? కొన్నిరకాల పరిశ్రమలు కూడా యథావిధిగా తెరుచుకోనున్నాయా? ప్రజలు పగటిపూట రోడ్ల మీదకు రావొచ్చా? కేంద్రం ప్రకటించిన జాబితాలోని దుకాణాలు రాష్ట్రంలోనూ తెరుచుకుంటాయా? పొరుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వం అదే చేయనుందా? వైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో వ్యాప్తిని అరికట్టడమెలా.. ఇప్పుడు ఏ నలుగురు కలిసినా చర్చించుకుంటున్న అంశాలివే. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ సందేహాలన్నింటికీ సమాధానం దొరకనుంది. గడచిన 45 రోజులుగా ఇళ్ళకే పరిమితమైన సామాన్య ప్రజలు మొదలు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు ఉద్యోగులు తదితర అన్ని సెక్షన్ల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వానికంటే ముందే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయాన్ని తీసుకుంది. రెండవ విడత లాక్‌డౌన్‌ను కూడా కేంద్రంకంటే నాలుగు రోజులు ఎక్కువే పొడిగించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కేంద్రం నుంచి ప్యాకేజీ వస్తుందన్న నమ్మకం లేదు. ఇప్పుడు మూడవ విడత లాక్‌డౌన్‌లో కేంద్రం చెప్పినట్లుగా ఆంక్షల్ని సడలించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ సమకూర్చే వైన్ షాపుల్ని తెరవడం ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని అందుకోవచ్చన్న వాదన వినిపిస్తోన్నది. అటు మంత్రులు, ఇటు అధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వైన్ షాపుల్ని తెరుచుకోవడంతో రాష్ట్రం అందుకు భిన్నంగా ఆలోచించడం ద్వారా ప్రయోజనం ఉండదనేది వీరి అభిప్రాయం. అందువల్ల తెలంగాణలోనూ మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సడలింపుల మధ్య వైరస్ వ్యాప్తిని నియంత్రించడం ఎలా అనేది ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఏక కాలంలో ఆంక్షలను సడలించడం, వైరస్ వ్యాప్తిని అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి వస్తోన్నది. మంత్రివర్గంలో ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.

కంట్రోల్ చేయడమెలా?

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఒక్కసారిగా జనం గుమిగూడడంతో కొన్నిచోట్ల కంట్రోల్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఢిల్లీ లాంటి నగరంలో నిమిషాల వ్యవధిలోనే మద్యం దుకాణాలను మూసేయక తప్పలేదు. తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తే అవకాశం ఉంది. దీన్ని అదుపు చేయడం పోలీసులు కీలకం కానుంది. ఒకవైపు రద్దీని నియంత్రిస్తూనే మరోవైపు ‘సోషల్ డెస్టెన్స్’ నిబంధనను అమలుచేయడం తప్పదు. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులమ్మే దుకాణాల ముందు మీటరు దూరంలో గీసిన గీతలు ఇప్పుడు వైన్ షాపుల ముందు దర్శనమిస్తాయి కాబోలు! ఇంతకాలం లాక్‌డౌన్ కారణంగా పనిలేకున్నా రోడ్లమీదకు వచ్చే యువతను కట్టడి చేయడం పోలీసులకు ప్రధాన టాస్క్‌గా ఉంది. ఇప్పుడు వైన్ షాపుల దగ్గర మందుబాబుల్ని అదుపు చేసే పని పడుతుంది. ఒకవేళ వైన్ షాపుల్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రెడ్ జోన్‌గా ఉన్న హైదరాబాద్ నగరం (జీహెచ్ఎంసీ)లో తెరుచుకుంటాయా? లేకుంటే దగ్గరలోని ఆరెంజ్ లేదా గ్రీన్ జోన్‌లోని వైన్ షాపుల్నే నమ్ముకోవాలా.. ఇలాంటి చర్చలన్నీ జోరుగా సాగుతున్నాయి.

వైరస్ వ్యాప్తి నివారణ ఎలా?

ఒకవైపు ఆంక్షలు సడలించక తప్పదు. మరోవైపు వైరస్ వ్యాప్తిని నివారించకా తప్పదు. ఇప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో రెండంకెల స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున సడలింపులతో కొత్త కేసులు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది, దాన్ని నియంత్రించడం ఎలా, ఊహించని తీరులో ‘స్థానిక వ్యాప్తి’ జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలన్నింటిపై ఇప్పటికే ముఖ్యమంత్రికి రాష్ట్ర వైద్యాధికారులు వివరాలను అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని తాజా పరిస్థితితో పాటు కంటైన్‌మెంట్ క్లస్టర్ల వివరాలను కూడా బేరీజు వేసుకుని దానికి తగిన విధంగా ఆయా శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇరవై జిల్లాల్లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు లేవు. మిగిలిన జిల్లాల్లోనూ చాలా వరకు తగ్గుముఖం పడుతుండగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే కొత్త కేసులు పుడుతున్నాయి. వరంగల్ అర్బన్, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ ఇటీవలి కాలంలో రావడంలేదు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి వారిని నిత్యం పర్యవేక్షించడం ద్వారా కొత్త పాజిటివ్ కేసులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

tags: Telangana, LockDown, Restrictions, Relaxation, Wine Shops, GHMC, Cabinet Meeting


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed