లాక్‌డౌన్ పరిష్కారం కాదు.. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలంటున్న మంత్రి

by  |
Satyendar Jain
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం స‌ృష్టిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేయడం పాక్షిక లాక్‌డౌన్‌లను విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ వల్ల పెద్దగా ఉపయోగమేమీ లేదంటున్నారు ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్. దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం, వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరించుతుండటంతో ఆయన స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ వల్ల ఉపయోగమేమీ లేదని అన్నారు. ‘లాక్‌డౌన్ అనేది ఈ సమస్యకు పరిష్కారం కాదు. ప్రస్తుతానికైతే ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదు. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి తెలియనప్పుడు అది విధించడంలో లాజిక్ ఉంది. 21 రోజుల పాటు ఆంక్షలు విధిస్తే దాని వ్యాప్తిని అరికట్టవచ్చునని అనుకున్నాం. కానీ అది సాధ్యపడలేదు. అందుకే అది కొనసాగింది. కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ అనేది పరిష్కారం కాదని తద్వారా తెలిసివచ్చింది’ అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ఇప్పట్లో అంతమయ్యే వైరస్ కాదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనాతో కలిసి బతకడమెలాగో మనం నేర్చుకోవాలి. అందుకోసం శానిటైజర్లు వాడటం, మాస్కులు ధరించడం, గుంపులలో కలవకపోవడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా వచ్చిన కొత్తలో రెండు, మూడు నెలల పాటు ప్రజలు ఈ జాగ్రత్తలన్నీ పాటించారు. కానీ ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు’ అని తెలిపారు. కరోనాను అరికట్టడానికి ప్రజలంతా మాస్కులు ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సత్యేందర్ జైన్ ప్రజలను కోరారు.



Next Story

Most Viewed