లాక్‌డౌన్‌లో సంతోషంగా ఉన్నది వీళ్లేనట!

by  |
లాక్‌డౌన్‌లో సంతోషంగా ఉన్నది వీళ్లేనట!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్‌డౌన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ఏదో ఒక రకంగా దెబ్బతీసిన మాట వాస్తవమే. కానీ ఈ లాక్‌డౌన్‌లో కూడా సంతోషంగా ఉన్నవాళ్లు కొందరు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. డాన్యూబే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొవిడ్ 19 లాక్‌డౌన్ ప్రారంభమైన నెల రోజుల తర్వాత 1000 మంది ఆస్ట్రియన్‌ల మానసిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ టెన్షన్, ఆర్థిక సమస్యలు కాకుండా మానసికంగా ఎంతో కొంత ఆనందంగా ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అయితే వాళ్లందరూ చెప్పిన సమాధానాలు విశ్లేషించిన తర్వాత వారికి ఆశ్చర్య కలిగించే నిజాలు తెలిశాయి. అవేంటంటే..

ఆర్థిక సమస్యలు, ఇతర టెన్షన్‌లను పక్కన పెడితే లాక్‌డౌన్ సమయంలో తమ భాగస్వామితో ఎక్కువ సమస్యలు వచ్చి, మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోయినట్లు ఎక్కువ మంది తెలిపారు. దీన్ని బట్టి రిలేషన్‌షిప్‌లో ఉన్న వారు మానసికంగా ఎక్కువ ఇబ్బందులు పడగా, సింగిల్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్లు ఎక్కువ సంతోషంగా ఉన్నారని పరిశోధకులు తేల్చిచెప్పారు. అలాగని రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లందరూ కష్టాలు పడ్డారా అంటే, లేదని పరిశోధకులు సమాధానమిచ్చారు. ఆరోగ్యకరమైన రిలేషన్‌షిప్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, పరిస్థితికి తగ్గట్టుగా అణకువగా ఉండటం వంటి మంచి లక్షణాలున్న రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు సింగిల్‌గా ఉన్నవాళ్ల కంటే ఎక్కువ మార్కులు పొందినట్లు పరిశోధకులు సవరణ ఇచ్చుకున్నారు. అయితే సింగిల్‌గా ఉన్న కొంతమంది కూడా తోడు ఎవరూ లేకపోవడం వల్ల అతిగా ఆలోచించి డిప్రెషన్, యాంగ్జైటీకి గురైన పరిస్థితులు కూడా ఉన్నాయని వారు వెల్లడించారు.

Next Story

Most Viewed