లాక్‌డౌన్‌తో లాకవుటేనా !

by  |
లాక్‌డౌన్‌తో లాకవుటేనా !
X

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వైరస్ వ్యాప్తికి దెబ్బకు తెలంగాణలో అదీ ఇదీ అని తేడా లేకుండా ప్రతి రంగం ఎఫెక్టవుతోంది. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 దాకా ప్రకటించిన లాక్‌డౌన్‌తో పారిశ్రామిక(తయారీ) రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. తెలంగాణ‌లో పారిశ్రామిక రంగం ఎక్కువగా రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతమై ఉంది. ఆర్థిక వ్యవస్థలో ద్వితీయ రంగంగా పరిగణించే ఈ రంగం వాటా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20 శాతంగా ఉంది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాటి నుంచి రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పార్టీలు అధికారంలో కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల ప్రభావం రాష్ట్ర పారిశ్రామిక రంగంపైన పడుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2016లో చివర్లో చేసిన నోట్ల రద్దు, 2017లో తెచ్చిన కొత్త పరోక్ష పన్నుల చట్టం జీఎస్టీ రాష్ట్ర పారిశ్రామిక రంగంపై ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఒక సంస్కరణ ప్రభావం నుంచి కోలుకునేలోపు మరో సంస్కరణ రావడం మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ వర్గాలను కొంత కలవరానికి గురి చేసింది. ఈ సంస్కరణల ఎఫెక్ట్ ముగిసింది అనుకునే లోపు చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాకు, తెలంగాణకు చేరడం, దాని వ్యాప్తి నిరోధించడానికి కర్ఫ్యూ, లాక్ డౌన్‌లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

ప్రతీ సందర్భంలోనూ ఎఫెక్టవుతున్న ఎంఎస్ఎంఈలు..

నోట్ల రద్దు, జీఎస్టీ ప్రస్తుత లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని బడా పరిశ్రమల కంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే(ఎంఎస్ఎంఈ) ఎక్కువ ప్రభావితమయ్యాయి. బడా పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్ఎంఈలకు నగదు లభ్యత అంతగా ఉండకపోడమే కారణం. నోట్ల రద్దు, జీఎస్టీలపుడు బిజినెస్ మామూలుగానే కొనసాగినప్పటికీ నగదు లభ్యత లేక డిమాండ్ పడిపోవడం, నిర్వహణ ఖర్చు పెరగడం లాంటి ప్రభావాలకు చిన్న పరిశ్రమలు గురయ్యాయి. ప్రస్తుత కరోనా లాక్‌డౌన్ వల్ల పరిశ్రమల మీద పడిన ప్రభావం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. దీని వల్ల ఉద్యోగులు సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ఎక్కడికక్కడే ఇళ్లలోనే ఉండాల్సి రావడంతో యూనిట్లలో వస్తువుల తయారీ, వాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇండియాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ చిన్న తరహా పరిశ్రమలే తయారీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుంటాయి. తెలంగాణలో మొత్తం 11 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమల యూనిట్లుండగా వీటిలో 25 లక్షల మంది దాకా ఉపాధి పొందుతుంటారు. రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ చిన్న పరిశ్రమలెక్కువగా ప్రభుత్వ రంగంలో ఉన్న భారీ పరిశ్రమలకు అనుబంధ యూనిట్లుగా ఉండి వాటికి వెండార్స్‌గా పలు రకాల రా మెటీరియల్స్ తయారు చేసి సప్లై చేస్తుంటాయి. వీటిలో ఒక్కో యూనిట్‌లో 50 నుంచి 60 మందిదాకా పనిచేస్తుంటారు. కరోనాకు ముందే దేశంలో, రాష్ట్రంలో వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల అప్పటికే భారీ పరిశ్రమల నుంచి ఆర్డర్లు తగ్గిపోయి తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న ఈ యూనిట్లు కరోనా దెబ్బకి భారీగా ఉద్యోగులను తొలగించడం లేదా మొత్తంగా మూతపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే బ్యాంకు లోన్లు కట్టలేక ఎన్‌పీఏలుగా మారిన ఈ యూనిట్లు ప్రస్తుత కరోనా లాక్‌డౌన్ వల్ల మరిన్ని అప్పులు చేయలేక, లాక్ అవుట్ ప్రకటించలేక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.

లాక్ డౌన్ వల్ల ఎంఎస్ఎంఈలపై ప్రభావాలు..

తయారీ ఆగిపోయినప్పటికీ ఉద్యోగుల జీతాలు, రెంట్లు, కరెంటు బిల్లులు వంటివి కట్టాల్సిన పరిస్థితి
బిజినెస్ లేకపోయినప్పటికీ ఫిక్స్‌డ్‌గా ఉండే ఖర్చులు అలాగే ఉండడం వల్ల అధికంగా
అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్
అప్పులు, వడ్డీలపై ఆర్బీఐ మారటోరియం విధించినా ఆయా బ్యాంకులు అనుమతించాలి
ఇప్పటికే ఉన్న అప్పుల వల్ల కొత్త అప్పులు బ్యాంకులివ్వడం పెద్ద డౌటు
లాక్ డౌన్ ముగిసిన తర్వాత బిజినెస్ ఆర్డర్లు ఎలా ఉంటాయన్నది తెలియని పరిస్థితి
జీఎస్టీ ఫైలింగ్, ఇంకమ్ ట్యాక్స్ ఫైలింగ్ వాయిదా పడ్డా ఎప్పుడో ఒకప్పుడు కట్టక తప్పదు
ఇవన్నీ వెరసి ఉద్యోగుల కోత లేదా యూనిట్లు మూసేయాల్సిన పరిస్థితికి దారితీయడం

సరిపోని కేంద్ర, రాష్ట్ర సపోర్టింగ్ చర్యలు…

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లోనూ పరిశ్రమలకిచ్చే పలు రకాల రాయితీలకు నిధులు పెంచుతూ వస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద రూ.2వేల కోట్ల దాకా ప్రభుత్వం కేటాయించింది. వీటిలో ఎక్కువ భాగం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకే ఉపయోగపడుతున్నాయని ఆర్థిక మంత్రి హరీష్‌రావు సభలో ప్రకటించారు. ఈ రాయితీలతో పాటు తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఎస్‌ఐహెచ్‌సీ) పేరిట ఎంఎస్ఎంఈలకు రుణ సాయంతో పాటు వ్యాపార వ్యూహాలు రూపొందించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరపునుంచి సైతం ఎంఎస్ఎంఈలకు పలు రకాల సపోర్టింగ్ స్కీంలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఈ లాక్ డౌన్ బారి నుంచి కాపాడడానికి సరిపోవని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

ప్యాకేజీ ప్రకటించాలి : డిక్కీ(దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ)

లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఓ పక్క బిజినెస్ లేక మరోపక్క ఖర్చులు అలాగే ఉండి మూత పడే పరిస్థితి ఉంది. వీటికి బ్యాంకుల నుంచి అంతగా రుణ సహాయం లేదని అందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పరిశ్రమలను కాపాడి వాటిలో ఉన్న కార్మికుల ఉపాధి పోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటి మీద ఉంది. లాక్ డౌన్ ముగిసేలోపు ఈ రంగానికి ఏదైనా ప్యాకేజీ ప్రకటిస్తేనే బాగుంటుదని అభిప్రాయ పడుతున్నా. … డిక్కీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్.

Next Story

Most Viewed