అడ్డదారి వద్దు.. రహదారే ముద్దు..

by Disha edit |
అడ్డదారి వద్దు.. రహదారే ముద్దు..
X

వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే డబ్బులు కడితే చేతిలోకి పట్టా వచ్చేస్తాది.. చేస్తున్న జాబ్ వదిలేసి మంచి జాబ్ చూసుకోవచ్చు.. పెరిగే జీతంతో ఎన్నో ప్లాన్స్ చేసుకోవచ్చు.. అని ఊహల్లో తేలిపోతూ.. ఆ అడ్రస్‌కు వెళ్లిపోయాను.. కొన్ని క్షణాలు అంతే.. నేను ఎలాంటి ఊబిలోకి కూరుకుపోయేదాన్నో.. ఎక్కడ తేలేదాన్నో...!!!

ప్రజాశక్తిలో సబ్ ఎడిటర్‌గా రెండేళ్ల సర్వీస్ పీరియడ్ పూర్తి చేసుకున్న సంవత్సరం 2009.. అబ్బా ముగించేశాను.. ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి.. అది కూడా ఉద్యోగం చేసుకుంటూనే చేయాలి.. ఎందుకంటే ఏదో పొడిచేస్తాం అని ఇంట్లో వాళ్లను వద్దనుకుని వచ్చేశాను కదా.. కాబట్టి సంపాదించాలి.. అలాగే చదువుకోవాలి..

పొద్దున లేస్తే పేపర్లే జీవితం.. ఆ పేపర్లో ఏది వస్తే అదే నిజమని నమ్మే అమాయకత్వం.. అదే నమ్మకంతో డిగ్రీ వన్ సిట్టింగ్ అని ఓ ప్రకటన చూసి కాయిన్ బాక్స్ నుండి వాళ్లకు ఫోన్ చేసి.. నా వీక్ ఆఫ్ మంగళవారం (మంచి పనికి మంగళవారం అని నేను అనుకుని) రోజున కూకట్ పల్లి జేఎన్‌టీయు బస్టాప్ దగ్గర దిగి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తున్నాను.. అక్కడ ఒక పాత బిల్డింగ్ గుమ్మటాలు ఉన్నట్లు భలే ఆకర్షించింది.. దానికి వేసిన రంగులు అది చూసి బీజేపీ ఆఫీసు అయ్యిఉండొచ్చు అనుకుంటూ అలానే వెళ్తున్నాను.. కొద్ది దూరం నడిచి వెళ్లి మళ్లీ కాయిన్ బాక్స్‌లో రూపాయి వేసి కాల్ చేసి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్లాను..

నేను వెళ్లిన అడ్రస్ కూడా కాస్త పాత బిల్డింగే.. రెండో అంతస్థు.. చిన్నమెట్లు ఎక్కి పైకి వెళ్తే స్టార్టింగ్‌లో రెండో గది అన్నారు.. వెళ్లగానే ఆఫీస్ బాయ్ లాగా ఉన్నాడు ఇందాక కాల్ చేశాను అనగానే రండి సార్ వాళ్లు వస్తారు.. అన్నాడు.. చుట్టూ కాస్త బూజు కొట్టుకుపోయిన గోడలు.. తేడాగా అనిపించినా డిగ్రీ సర్టిఫికెట్ కదా మనకు కావాల్సింది.. కాబట్టి పట్టించుకోలేదు.. నా తర్వాత ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు.. నాలాగే వచ్చారు అనుకున్నాను పక్కన కుర్చీలు ఉన్నాయి వాటిల్లో కూర్చోడానికి వస్తున్నట్లు వచ్చారు.. కానీ.. కళ్లుమూసి తెరిచేలోపే ఆ దున్నపోతుల్లాంటి శరీరాలు నా మీద దాడికే వచ్చినట్లు వచ్చి పడ్డాయి..

ఏదో చెడు జరుగుతోంది.. నా మైండ్ అంత స్పీడ్‌గా పనిచేస్తుంది అని నాకు తెలిసిన క్షణాలు.. నా బాడీ కూడా వెంటనే అలర్ట్ అయిపోయింది.. వాళ్లిద్దరినీ పక్కకు తోసిపడేసి పరిగెత్తాను... చేతిలో చిన్న పర్సు(అందులో ఉన్నది 70 రూపాయలు) కూడా జారిపోయింది.. ఓ చెప్పు.. పరిగెత్తుకుంటూ రోడ్డున పడ్డాను.. పిచ్చిదానిలా కొద్దిసేపు అలాగే ఉరికాను.. అదే పాత బిల్డింగ్.. దాని గుమ్మటం దగ్గర కూలబడ్డాను.. కాళ్లు.. చేతులు వణికిపోతున్నాయి.. మొహం మొద్దుబారిపోయింది.. నా వెనక పడ్డ వాళ్ళు కనిపించలేదు.. కొద్ది నిమిషాలు అలా కూర్చున్నాను.. మళ్లీ లేచి పరుగులాంటి నడకతో.. అశోక్ నగర్‌‌లో నేను ఉంటోన్న హాస్టల్ వేపుగా అడుగులు వేస్తున్నాను.. నా మైండ్‌ బ్లాంక్ స్టేజ్ లోనే ఉంది.. మధ్యాహ్నం 3 గంటల వరకు అలా నడుస్తూనే వెళ్తున్నాను..

గమ్యాన్ని త్వరగా చేసుకోవాలనుకోవడం తప్పుకాదు కానీ.. వెళ్తున్న దారి మాత్రం సురక్షితమా కాదా అని తెలుసుకోవాలన్న అవసరం ఎంత ఉందో నాకు ఆ రోజుతో బోధపడింది. మూడేళ్లు కష్టపడితే వచ్చే సర్టిఫికెట్.. ఏడాదికే సునాయాసంగా వచ్చే దానికి ఎప్పటికీ సమానం కాదని ఆలస్యంగా తెలిసింది. దాంతో ఆ క్షణానే ఒక స్థిర నిశ్చయానికి వచ్చాను. నా ప్రణాళిక మార్చుకున్నాను. పగలు కాలేజీకి వెళ్తూ సాయంత్రం ఉద్యోగం చేసుకునేలా నా టైమింగ్స్ సెట్ చేసుకున్నాను. డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేశాను. చేరవలసిన గమ్యం కన్నా చేరుకునే దారి ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను.

హైమ సింగతల

జర్నలిస్టు

86868 00298



Next Story

Most Viewed