పుస్తక సమీక్ష: సంగతి తెల్సా?

by Disha edit |
పుస్తక సమీక్ష: సంగతి తెల్సా?
X

అనేకులు రాసిన కొన్ని మేలిమి కథల్ని ఒకచోట కూర్చి పుస్తకంగా వెలువరిస్తే అది కథాసంకలనం. మేలిమి అనేది నిర్వచనానికి అందనిది. అది వ్యక్తుల దృష్టికి చెందినది. సంఘంలో మేలిమి చలామణిలో ఉంది. కనుకనే అనేకుల నుండి సంకలనాలు వెలువడుతున్నవి. అలా వెలువడినదే సంగతి-2 కథా సంకలనం. పదహారు కథలు పోటీలో నిలబడినవి. మెప్పించినవి. సంకలనంగా కుదిరినవి.

ఇందులో ప్రఖ్యాత కథకుల నుండి వర్ధమాన కథకుల వరకు రాసిన కథలు కొలువుదీరినవి. వస్తురీత్యా విస్తృతమైన వైశాల్యాన్ని కలిగి ఉంది సంకలనం. అంతటి వైశాల్యం కలిగిన సంకలనంలో పరిశోధనాత్మక కధనంగా బి నర్సన్ రాసిన 'ఈ శిక్ష మాకొద్దు' కథ కనపడుతుంది. ఇది ఒక తలారి బాధ. ఉరితాడుకుండాల్సిన కొలతలు, ఉరివేసే విధం, ఉరికి సంబంధించిన సమాచారం అంతా కథలో ఉంది. తలారి పని చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, ఉరిశిక్ష రద్దు ప్రస్తావన కథను కొనసాగేలా చేశాయి. ఉరిశిక్షను అమలు చేస్తే వ్యక్తి బాధ, సమాజం అతణ్ని చూసే విధం, ఉరివేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం అన్ని కథలో చర్చకు వచ్చాయి. జడ్జి, లాయరు, జైలరు, ఇస్మాయిల్ నలుగురి మధ్య జరిగిన సన్నివేశం కోర్టులను తలపించింది. మధ్య మధ్య వచ్చిన ఉపకథలు కథ నడకకు దోహదపడ్డాయి.

మేకవన్నె పులి అని సామెత దాన్ని తిరగేసి రాసిన కథ ‘పులి వన్నె మేక’ కథ. హిపోక్రసీలో బతుకుతున్న లోకాన మానవీయ ఆచరణను, శ్రమైక జీవనాన్ని తనలో రంగరించుకుని బతికిన పరోపకారి కథ ఇది. చివరకు అతడు ఏదో సిద్ధాంతానికి సానుభూతి పరుడని అర్థం వచ్చే లా కథను మలుపుతిప్పాడు. అతణ్ణి పట్టించినందుకు క్యాష్ రివార్డ్ రావడం కథ నడకను మార్చింది. మొత్తానికి కథ చదివించేదిగా ఉంది. అబ్బాయి అమ్మాయిగా మారిన క్రమంలో జరిగిన సంఘటన ‘అంగన’ కథగా మారింది. ట్రాన్స్ జెండర్ పట్ల తల్లిదండ్రుల తండ్లాట, సమాజ అభిప్రాయం, ట్రాన్స్ జెండర్ గా మారిన వ్యక్తి ఆలోచనలు, మెడికోలు, డాక్టర్ల శాస్త్రీయ దృక్పథం, కోర్టు తీర్పు ప్రభావం, చట్టపరిధి వీటన్నింటి ప్రభావ ఫలితాల ఆధారంగా కథ సాగింది. పాత్రల పరంగా దేని పరిధిలో అది మానవీయంగా వ్యవహరించడం కథలో ఎన్నదగిన అంశం.

ఒకవైపు కన్నకూతురు కట్నం బాకీ తీర్చలేని బాధ. మరోవైపు భూస్వామి చేసిన మోసం ఈ రెండింటి మధ్య నలిగి చితికిన సామాన్య రైతు గోస 'రుణం'. రాజ్యాధికారం, దశమగ్రహం రెండింటి మధ్య చిక్కుకుని తనువు చాలించిన పేద మనిషి కథను గాజోజు నాగభూషణం చిత్రించాడు. సలీం కథకు చదివించే గుణం ఎక్కువ. కథలోని డ్రామా ఆసక్తిగా సాగుతుంది. ఇందులో నిద్ర కోసం చేసే పోరాటం కధాంశం. చివరలో ఉన్న ఉత్తరం కథాంశాన్ని విషాదం చేస్తుంది. సున్నితమైన కథాంశాన్ని కథాంశంగా విస్తరించడం లోనే మేధకుడి కౌశల్యం దాగి ఉంది. క్షమయా ధరిత్రి అనే భావన పాఠకుడికి తడుముతుంది. ఇతని మరో కథ శిక్షలో గోదావరి గలగలలు, పాపికొండల అందాలు అలరిస్తాయి.ఇలాంటిదే విశ్వాసం అనే కధ. ఇందులోని కథనం బాగుంది. ఢిల్లీ వీధులు, వాటి వివరాలు, రింగ్ టోన్ వినిపించిన సినిమా పాటలు, ఎయిర్ పోర్టు రైల్వే స్టేషన్ సన్నివేశాలు విజ్ఞానదాయకాలుగా ఉన్నాయి.

సీనియర్ రచయిత వసుంధర రాసిన 'బృందావనమది' కథ ఆలోచనాత్మకంగా ఉన్న పెద్ద కథ. వృద్దాశ్రమాల్ని సమర్థించే సిద్ధాంతాలు, అభిప్రాయాలు అనేకం ఉన్నాయి. వాటిని సమర్థించే, ఖండించే వాదనలు అంతే కనపడుతున్నాయి. వృద్దాశ్రామాలకు సంబంధించి ఈ కథలో చెప్పిన అభిప్రాయం ఆసక్తిగా, ఆశ్చర్యంగా, హేతుబద్ధంగా ఉంది. అందులో నడిపిన కథనం కూడా దానికి బలం చేకూర్చేదిగా ఉంది. ప్రతి మనిషి జీవితంలో ప్రైవసీ ఉండాలనీ, అందుకు వృద్ధాశ్రమం అనువుగా ఉంటుందని ప్రధాన పాత్ర అభిప్రాయపడుతుంది. ఆయన తల్లితండ్రుల జీవిత గమనంలోని ఉక్కపోతను, బాధ్యతలను చెప్పడం వల్ల పై అభిప్రాయానికి మద్దతు దొరికినట్లయింది.

వెళ్ళిపోయిన వాళ్ళు మన బాధల్లోనూ, బాధ్యతల్లోనూ తోడుగా ఉన్నారనే భరోసాయే అతి ముఖ్యం. వెళ్లిపోయిన వారిని గుర్తుపెట్టుకోవడం ఒక వేడుక కాదు. ఒక యాగం ఈ రెండింటి సారాంశంగా 'వెయిటింగ్ ఫర్ వీసా' కథ కనపడుతుంది. ఆడవాళ్ళను సతాయించే మగవారి పట్ల స్త్రీలు ఉండాల్సిన తీరును ‘హద్దుకు ఆవల' కథ చెప్పింది. ఆఫీస్‌లోని మేనేజర్, రోడ్డు మీది పోకిరి వీరిద్దరికీ చెప్పిన గుణపాఠం కనువిప్పు కలిగించేదిగా ఉంది. పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు వైఖరిని ప్రదర్శనకు పెట్టిన కథ ‘కొలిమి’ ప్రాంతీయ విశ్వాన్ని పునాదిగా చేసుకొని స్థానికతను పట్టం కట్టిన కథ 'వజ్రం' జీవితాంతం వజ్రాల కోసం వెతికి వట్టి చేతులతో మిగిలిన దేవుడయ్య ప్రజల నోళ్లలో దేవుడిగా మిగలడం కథకు బలాన్నిచ్చింది.

బయటి తిండి కంటే భార్య చేతి వంట ఆరోగ్యకరం అనే విషయాన్ని అద్భుతంగా వండి వార్చిన కథ 'అన్నం చారు' శీర్షికకు తగినట్లుగా ఒక పద్యం తో మొదలై మరో పద్యం తో ముగిసింది. ఈ కథ మిధునం సినిమాను గుర్తుకు తెచ్చేదిగా ఉంది. సంకలనంలోని 'సింగిండి' కథ కొంత జానపద శైలిని కలిగి, గత వర్తమానాల్ని కలుపుతూ సాగింది. ఆత్మలతో మాట్లాడించిన కథ 'ఆత్మసాక్షిగా' చర్చనీయాంశాలైన విషయాలను ఆత్మలతో పలికించిన తీరు ప్రతీకాత్మకంగా ఉంది. ఈ సంకలనం వెలువడడానికి కారకులయిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు.

డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732



Next Story

Most Viewed