మౌమిత ఆలం.. ఓ ఝంఝానిల షడ్జధ్వానం

by Disha edit |
మౌమిత ఆలం.. ఓ ఝంఝానిల షడ్జధ్వానం
X

కవిత్వం అనేది పాలకుల నెదిరించే శక్తివంతమైన సాధనమని ఒక రచయిత్రిగా నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. కవిత్వం ఒక నిరంతర కాంతి. అది మన చరిత్రను, వర్తమానాన్ని రాజ్యం మరుగున పడేయకుండా వెలుతురును ఫోకస్ చేస్తుంది. అందుకే కవులపై పాలకుల నిరంతర నిఘా ఉంటుంది. వాళ్లకు కవులంటే భయం. పీడితుల చర్మం కాలిన వాసన, సగం తెగిన నాలుకల ఆక్రందన, రచయిత్రిగా నన్ను వెంటాడుతూనే ఉంటాయి. నేను రాజ్యపు కుట్రల్ని నిరసిస్తాను. నన్ను నిశ్శబ్దపు చీకటి అగాధాల్లోకి విసిరేసే అమానుషత్వాన్ని ఖండిస్తాను.'

కవిత్వాకాశంలో ఒక సంచలనం

గత నెల మధ్యలో హైదరాబాద్ సందర్శించి, 'రాయకూడని పద్యం' అనే తన పుస్తకం అనువాదం ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎంతో మంది సాహిత్య కవిత్వ అభిమానులపై చెరగని ముద్రవేసిన బెంగాల్ యువ కవయిత్రి మౌమితా ఆలం తెలుగు అనువాద పుస్తకం ముందుమాటలో రాసుకున్న మాటలివి. కలకత్తాకు 700 కిలోమీటర్ల దూరంలోని సిలిగురి అనే ఒకప్పటి ఉద్యమ కేంద్రంలోని ఒక గ్రామంలో పుట్టిన ఈ ముస్లిం ప్రగతిశీల కవయిత్రి సమకాలీన కవిత్వాకాశంలో ఒక సంచలనం.

నమ్మకం పెంచిన కవితలు

కోవిడ్ మహమ్మారి కాలం నుంచి తెలుగు పాఠకులను మాతృక తదితర పత్రికల్లో అనువాదాల రూపంలో పలకరించిన మౌమిత... అత్యంత సరళమైన ఇంగ్లీషులో, పుంఖానుపుంఖాలుగా రాసిన వైవిధ్య పూరితమైన కవితలలో కొన్నింటిని పేర్చి పుస్తకంగా తీసుకొచ్చిన మిత్రులు ఉదయమిత్ర. ఎలాంటి దాపరికం లేకుండా తన కవిత్వ అనువాదాలు స్వేచ్ఛానువాదాలే కానీ యధాతథ అనువాదాలు కావని ముందే చెప్పుకున్న రచయిత, మౌమిత కవితలు అనువాదం చేయడం మొదలెట్టాకే నేను కూడా అనువాదాలు చేయగలను అనే ఆత్మవిశ్వాసం కలిగిందంటారు.

అనువాదమా.. సొంత కవిత్వమా

అయితే ఒక విషయం ప్రత్యేకంగా గమనించాలి. మౌమిత, ఉదయమిత్ర మధ్య భావైక్యత ఎంత స్పష్టంగా కుదురుకుందంటే ఇది మౌమిత కవితకు అనువాదమా లేక రచయిత సొంత కవితా అనిపించేంత సహజంగా ఉంటుంది. మూల రచయిత్రి భావాలతో మమేకత్వం ఏర్పడిన తర్వాతే ఆ సిలిగురి ప్రాంత వాసికి, ఈ పాలమూరులోని జడ్చర్ల వాసికి అరుదైన ఐక్యత ఏర్పడింది. ఆమె ఎవరో తెలియకముందు, తెలిసిన తర్వాత ఈయన చేసిన కవితల అనువాదాలను మనం వేరు చేసి చూడలేనంత భావ సంబంధం ఏర్పడి గట్టిపడిపోయింది.

ప్రాణం పోసిన తెలంగాణ పలుకుబళ్లు

ఎక్కడెక్కడివో మట్టి వాసనలు మోసుకొస్తూ మనల్ని డిస్టర్బ్ చేసే కవితలివి, పలవరించండి అంటూ ఉదయమిత్ర మౌమిత రచనల అనువాద పుస్తకాన్ని తెలుగునేలపై వదిలారు. మౌమిత కవితాత్మ ఉదయమిత్రను పూనిందా అన్న చందాన అనువాద కవితలు సజీవంగా కుదరడమే కాదు. అనునాదం మొత్తంగా ఆయన వాడిన తెలంగాణ పలుకుబళ్లు మౌమిత కవిత్వానికి ప్రాణం పోశాయనే చెప్పాలి. అనువాదకులకు మూల భాషా కవులతో ఉండాల్సిన హృదయంగమ సంబంధాన్ని తన స్వేచ్ఛానువాదంతో పుస్తకం పొడవునా పండించి చూపారు. ఈ పుస్తకాన్ని తిరగేస్తే ఇటీవలి కాలంలో ఇంత బహుముఖీనంగా రాజ్యాన్ని, వ్యవస్థను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ వచ్చిన కవితలు అరుదుగానే కనిపిస్తాయని అనిపించకమానదు.

ఉదయమిత్ర అనువాద సౌరభంలో మచ్చుకు కొన్ని చూద్దాం..

రెండు వేల కిలోమీటర్ల ప్రయాణంలో/ ఎన్నిసార్లు సోషిల్లి పడ్డాడో గాని/ అన్నం, అల్లం, చట్నీ కల మాత్రం వదల్లేదు (కోవిడ్ వలస బాధలపై)

అదేమిటో/ పీడకులు ఎన్నిసార్లు చంపినా/ గాజాలో ఎవ్వడూ చావడం లేదు

నీవు జైల్లోనూ/ కలల్ని భద్రంగా కాపాడుకుంటున్నావు/ నేను స్వేచ్ఛలోనూ కలల్ని ప్రకటించలేకపోతున్నాను.

నా కంటి కాంతులతో/ లోకాల వెలిగించే ముస్లిం మహిళను నేను/ పిరికి సన్నాసుల్లారా రాసుకోండి/ ఎస్, నేను ముస్లిం మహిళను/ అమ్మకానికి అంగడి సరుకును కాను

నీ కన్నుతో నిన్నే చిదిమేసే/ అతిగొప్ప స్వాతంత్ర్యమొచ్చింది తెలుసా

చావడానికి మనకు/ కారణాలు ఉంటాయోమో గానీ/ చంపడానికి వాళ్లకు/ ఏ కారణమూ ఉండనక్కరలేదు

చరిత్ర సాక్షిగా/ బాబ్రీ మసీదునెవరూ కూల్చలేదు/ యుగపురుషుడి కొనగోటికి/ రక్తపు మంటలంటనే లేదు

ఎవరైనా ఎగ్ కర్రీని కూడా/ గొడ్డుమాంసం అని పొరపడితే/ మా అమ్మకు నోటమాట రాదు మా తమ్ముడు చేసే రైలు ప్రయాణంలో/ పాలకూర వంటకాన్ని కూడా/ గొడ్డు మాంసంగా పొరపడ్తారని/ మా అమ్మకు తెలీదు.

“చుట్టూ సమాజం రగిలి పోతూంటే చందమామ అందం మీద కవిత్వం రాయలేను” అని మౌమితా ఆలం ఇటీవల ఓ మాట అన్నారు. ఈ మాటకి బలమైన ఉదాహరణ ఈమె కవిత్వం. రాజ్యవ్యవస్థ అనే ఉగ్రవాదం చేసిన, చేస్తున్న సకల దుర్మార్గాలకు, దౌష్ట్యాలకు ప్రత్యక్ష సాక్షి ఈ పుస్తకం.

"రాబందుల రెక్కల చప్పుడు/పయోధర ప్రచండ ఘోషం/ఝంఝానిల షడ్జధ్వానం"

విని తట్టుకోగల చావ వుంటే ఈ పుస్తకం తెరవండి అంటూ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’కి ఇచ్చిన యోగ్యతా పత్రంలో జాతిమరవని సిఫార్సు చేశారు చలం

అంతటి చేవకలిగిన పుస్తకం మీ చేతుల్లో ఉంది. కవిత్వం అంటే గౌరవం కలిగిస్తున్న ఈ అరుదైన కవిత్వాన్ని తప్పక చదువుదాం. ఉదయమిత్ర చేసిన స్వేచ్ఛానువాద సునామీలో మునిగి తేలుదాం.

ప్రతులకు

రాయగూడని పద్యం

మూలం మౌమితా ఆలం

అనువాదం ఉదయమిత్ర

ప్రతులకు: మాతృక ప్రచురణలు 96762 06230

పాలమూరు అధ్యయన వేదిక : 89196 50545

పుటలు 140 – వెల రూ. 125


కె.రాజశేఖరరాజు

73964 94557



Next Story

Most Viewed