కవిమాట: ఆ రోజులలో

by Disha edit |
కవిమాట: ఆ రోజులలో
X

ఉక్కపోతల పర్వంలో

ఉర్వి ఉక్కిరిబిక్కిరియై

చల్లని సమీరాలకై

పరితపించే క్షణాలైనా

పుస్తకాల తలపులు వీడి

సెలవుల గొడుగు నీడన

పిల్లలు ఆటలాడే కాలమది

చెరువులో ఈతలు

చిన్నా, పెద్దా కూడి

పగటిపూట నిద్రలు

పెళ్లి బాజాల మోతలు

ఊరేగింపుల నృత్యాలు

జానపద కళారూపాలు

సరదాలు, సంతోషాలు

తాటిముంజల తలపులు

మామిడిపండ్ల వాసనలు

తీయని చెరకు రసాలు

అమ్మచేతి ఆవకాయ

మరువలేని మధుర రుచులు

ఎండాకాలపు సంపదలే.

పగలు భానుడు

రుసరుసల సెగలు కక్కినా

సంధ్యాసమయంలో

చల్లని మలయమారుతాలు

మల్లెపూల పరిమళాలు సోకగా

రాత్రివేళల్లో

ఆరుబయట పడకలు

ఆకాశాన చుక్కలు లెక్కిస్తూ

బంధు మిత్రులతో ముచ్చట్లు

మనసు ఊహాలోకాల్లో

మురిసే సమయమది.

మధురములే ఆ రోజులే

ఎండలు ఎంతగా మండినా!


వేమూరి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం

99121 28967



Next Story

Most Viewed