నా కైతే సిగ్గుగా ఉంది

by Disha edit |
నా కైతే సిగ్గుగా ఉంది
X

పొద్దుట్నుంచీ వాట్సాప్పుల్లో...

హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షల

వెల్లువ చూస్తుంటే..

నాకైతే చదవడానికే కాదు..

పంపడానికి కూడా అవమానంగా ఉంది.

కోపంగా ఉంది.. అసహనంగా ..అసహ్యంగా ఉంది.

ఆమె ఎవరో..ఒంటి నిండా ..

కర్ర విరిగేదాకా భర్త మృగం...

ఖైమా లాగా విరగ్గొట్టిన దేహపు నొప్పిని

పంటికొసన భరిస్తూ.. బట్టలుతుకుతున్నది.

మరొకామే..నెలసరి నొప్పిని మెఫ్తాల్ స్పాస్

టాబ్లెట్ తో గుటుక్కున మింగేసి...

భర్తగారి లంచ్ బాక్స్ లోకి తన రక్తం లోని

శ్రమని అన్నంగా వండుతున్నది.

ఇదిగో ఈమె...

కొంచెం ఆ తలుపు రెక్క తప్పించి చూడండి...

రాత్రి భర్త శృంగారం పేరుతో...

సరసంగా రేప్ చేసేస్తే..

గాయాన్ని రెండు కాళ్ళ మధ్య దాచేసి...

కన్నీళ్ళని కళ్ళ లోపలికి తోసేసి..

పరదా చాటునుంచి

చిరునవ్వు మొఖం తొడుక్కుని..

వంటింటి వైపు నడుస్తున్నది.

ఇక్కడ ఈ గుడిసెలో చూసారా...

పని కావాలంటే మేస్త్రీకి కొంగు పరవాల్సిందేనట...

వాడి మొఖం మీద తుపుక్కున ఉమ్మిన

ఆమె ఆత్మగౌరవపు ఆకలి పేగులు

శ్రామిక స్త్రీల విముక్తి గీతాన్నీ పాడుతుంటే...

ఇన్ని మంచినీళ్లు తాగి

ముడుక్కుని పడుకుంటున్నది...!

ఇక్కడ హాస్పిటళ్లల్లో.. స్కానింగ్ సెంటర్‌లలో

ఒకసారి తొంగి చూడండి...

యోనులు ఛిద్రమై చచ్చి పోయిన

ఆరేళ్ళ ఆసిఫాలు చెప్పారేమో...

గర్భాల్లో ఆడపిండాలు.. యోనుల స్థానాల్లో

ఖడ్గాలు మొలిపించుకుని పుట్టకముందే..

యుద్దానికి సిద్ధమవుతున్నాయి...

మరి దీన్నేమంటావు ..?

నీ గృహ బానిసల ఫ్యాక్టరీల్లో..

అదిగదిగో..అమ్మలు

ఇరవై చేతులతో..ఆరేసి కాళ్లతో

వింత జీవుల్లా గాజు కళ్లతో..

వంటిళ్ళకి.. ప్రసవపు గదులకి ..బెడ్ రూంలకి మధ్య..

వేల కిలోమీటర్లు యుగాలుగా తిరుగుతూనే ఉన్నారు.

పోరా...పో...

"One Woman Countless Roles "....

లాంటి నీ కీర్తి కిరీటాలు మాకు వద్దు...

నువ్వు చేసిన ఈ గాయాల చుట్టూ..

ఒక జరీ అంచు పట్టుచీర చుట్టేసుకుని..

వచ్చేస్తామనుకున్నావా?

నీ కోరలు నోట్లో దాచేసుకుని..

నీకు కావలసిన ఆదర్శ అమ్మల..

భార్యల..కూతుళ్ళ నమూనాల్లో

పేనుబెత్తంతో మమ్మల్ని కుదించేసి...

తృప్తిగా త్రేన్చేసి..

మాకు... నీ గృహ బానిసలకు ..

కపటపు ప్రేమతో ఇచ్చే పూల బొకేలు..

నీ మొసలి కన్నీళ్ల కవిత్వాలు...

బంగారు పూతల ఆదర్శ స్త్రీల మెమెంటోలు ...

తీసేసుకుంటామనుకున్నావా?

వద్దు..వద్దు గాక వద్దు !

మాకు కప్పే షాలువాల కింద

నీ నైచ్యం కప్పెయ్యడానికి

నీకు సిగ్గు లేదేమో కానీ..

మాకైతే సిగ్గుగా ఉంది.

పోరా... ఫో...!

- గీతాంజలి



Next Story

Most Viewed