రోజూవారీ పాఠం

by Disha edit |
రోజూవారీ పాఠం
X

పొద్దు పొడుస్తున్న

లేలేత కిరణాల లోంచి

అసంకల్పితంగా లేచిన దేహం

కాలినడకన ముచ్చట్ల నుంచి

ఓ కొత్త పాఠాన్ని నేర్చుకుంటుంది

వృత్తిని జీర్ణించుకున్న మనసు

బాల్యం భవితకు

రోజుకో తరగతి గదిని

నిర్మించుకుంటుంది

పిల్లల హృదయ సూత్రాలను

పసిగట్టిన నేత్రాలు

మనో పలకలకు బలపం కట్టుకుంటాయి

నల్లబల్లపై అన్నం మెతుకుల తెల్లదనాన్ని

సుద్దముక్కలు ఇంద్రధనుస్సులా పరుస్తాయి

బ్రతుకొక పాఠమైపోతుంది

పుస్తక పువ్వులు

పురివిప్పిన నెమళ్లవుతాయి

పేజీలు పేజీలుగా పిల్లల మోములు

రెపరెపలాడుతాయి

తనువూ మనసూ కలియతిరిగిన

స్వేచ్ఛా భాషా స్వరాలు

గుండెను జండా చేసుకుని

బడి గుమ్మానికి తోరణాలు కడతాయి

తల్లిపాల తీపి దనాన్నిగ్రోలినట్టు

మాతృభాషా మాండలికాల మాధుర్యం

పసి హృది నిండుతుంది

పట్టపగలే వెన్నెల తుమ్మెదలై

ఒజ్జ చెట్టుపై పిల్లలంతా వాలిపోతారు

రోజువారీ పాఠం

నిజంగానే అమృతం కురిసిన

అద్భుత ఘట్టమై ఆవిష్కృతమౌతుంది..!

డా. కటుకోఝ్వల రమేష్

సెల్:9949083327



Next Story

Most Viewed