ప్రతి ఉద్యమాన్ని ముందుండి నడిపించింది పాటే : సుద్దాల అశోక్ తేజ

by Disha Web Desk 11 |
ప్రతి ఉద్యమాన్ని ముందుండి నడిపించింది పాటే : సుద్దాల అశోక్ తేజ
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రతి ఉద్యమంలోనూ పాట మనిషిని ముందుండి నడిపించిందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. మానవ చరిత్రలో ఆదిమ కావ్యం పాటేనని, అది శ్రమనుంచే పుట్టిందని ఉత్పత్తి ప్రక్రియలోనూ, కాయకష్టంలోనూ పనితో పాటే పాట వర్ధిల్లిందని ఆయన వివరించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాలవీయ మిషన్ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని డిగ్రీ కళాశాలల తెలుగు అధ్యాపకులకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం (సామర్ధ్యాల నిర్మాణ కార్యక్రమం)ను మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మానవ మహాప్రస్థానంలో పాట అత్యంత కీలకమైనదని, మానవ నాగరికత ప్రతి మలుపులోనూ మానవ ప్రస్థానాన్ని ముందుకు నడిపించిన ప్రతి ఉద్యమంలోనూ పాట మనిషిని ముందుండి నడిపించిందని తెలిపారు. కారణాంతరాల వల్ల పాటకు ద్వితీయ స్థానాన్ని సాహిత్య చరిత్ర ఇచ్చిందని ఇది బాధాకరమైన విషయమని తెలియజేశారు. మనిషి ప్రతి భావోద్వేగానికి పాట వేదికైందని, మనిషి కష్ట సుఖాల్లో మానవుడికి తోడుగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాట పరిణామక్రమాన్ని నదితో పోలుస్తూ బొట్లు బొట్లుగా ప్రవాహంతో ప్రయాణమైన పాట ఈరోజు ప్రతి మానవుడి జీవితంలో భాగమైందని వివరించారు.

అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, సుద్దాల హనుమంతు అందెశ్రీ, గద్దర్ వంటి భక్తి ప్రజావాగ్గేయకారులను ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య పి. ప్రకాష్ బాబు మాట్లాడుతూ కేంద్రీయ విశ్వ విద్యాలయంలోని మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నత ప్రమాణాలతో విద్యా శాఖలోని అధ్యాపకులకు సహాయ చార్యులకు, ఆచార్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడంలో, పరిశోధన పద్ధతులను, ప్రమాణాలను రూపకల్పన చేయడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవీయ విభాగాల డీన్ ఆచార్య వి. కృష్ణ, తెలుగు విభాగాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వివిధ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకులు, విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Next Story