దీపావళికి ఈ ఆర్భాటాలు ఏల?

by Disha edit |
దీపావళికి ఈ ఆర్భాటాలు ఏల?
X

దీపావళి పండుగను దీపధూపాలతో చేద్దామా? లేదా చప్పుళ్ళు పేలుళ్లతో కాలుష్యం పెంచుదామా? నీ పిల్లలకు నువ్విచేది ఏంటి? పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనకు లేదా.. దీపావళి అంటే మంచి అనే దీపాలను వెలిగించి, చీకటి అనే అధర్మం, అన్యాయం, చెడునీ తొలగించడం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటారు. ఈ పండగ ఎందుకు జరుపుకుంటాము అంటే ఎన్నో కథలు, కారణాలు చెపుతారు. మన చరిత్ర ప్రకారం - నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో, ప్రజలు దీపావళి చేసుకుంటారని, అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు, పద్నాలుగేళ్ల అరణ్యవాసం ముగించుకుని తమ రాజ్యానికి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచి వాళ్ళ సంతోషాన్ని తెలియచేశారు. బాణసంచా కాల్చటానికి మరొక కారణం ఏంటంటే.. ఐదు వందల సంవత్సరాలకు పూర్వం వర్షాకాలంలో నీటి గుంటల్లో నీరు నిల్వ గుంటలలో దోమలు, ఈగలు, క్రిమి కీటకాలు పెరిగిపోతాయి. కనుక వాటిని తరిమి కొట్టడానికి ఆవు పేడ, పేలుడు పొడి, పసుపు, ఇలా కొన్ని కలిపి సహజసిద్ధమైన టపాసులు తయారు చేసి కాల్చేవారు. దాని వల్ల దోమలు కీటకాలు చనిపోయేవి. దానికి తోడు విపరీతమైన చలి వాతావరణంలో వేడినీ పెంచుతుంది.

కానీ కాలం మారింది. కాలంతో పాటు మనుషులు వాళ్ళ పద్ధతులు మారాయి. ఇప్పటి రోజుల్లో దీపాలకు బదులు కరెంటు దీపాలు పెడుతూ, హానికరమైన రసాయనాలతో పేలుడు పదార్థాలను కలిపి భీకరమైన చప్పుళ్లతో టపాసులు, బాంబులు కాల్చుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. భావితరానికి స్వచ్చమైన గాలి, నీరు లేకుండా చేస్తున్నారు. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు రాబోయే రోజుల్లో ఎన్నో జబ్బులు రావడానికి మనమే కారణం. ఎంత చప్పుళ్లతో భారీగా పటాసులు కాల్చితే అంత ధనవంతులు అన్నట్టు ఈ రోజుల్లో టపాసులు కలుస్తున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, అవే కాకుండా టపాసులు ఇళ్ల మధ్యలో కాల్చడం వలన ఏమైనా అగ్ని ప్రమాదం జరిగి చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేటి యువతలో ఎటువంటి మార్పు రావడంలేదు. ఇప్పటికైనా యువతరం మారాలి. సహజసిద్ధమైన బాణసంచా కాల్చటం వలన పర్యావరణ కాలుష్యం అరికట్టవచ్చు. దీపావళి అంటే సంతోషం పంచి పెట్టడం అని, లేని వాడి ఇంట్లో పూట బోజనమైన పెట్టడం అనే బావనతో సమాజ ఉపయోగకరమైన పనులు చేసి వచ్చే తరానికి ఆదర్శంగా ఉండాలి.

పి. కరుణ బిందు

ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్

95339 89114



Next Story

Most Viewed