మనసును హత్తుకునే కవితా ఝరి ...

by Ravi |
మనసును హత్తుకునే కవితా ఝరి ...
X

కవి తన చుట్టూరా వున్న వస్తు సంచయంలో, అనునిత్యం, అనుక్షణం జరిగే సంఘటనల్లో ఏది? ఎలా? తన కంటిని ఆకర్షిస్తుందో? మనసును అలరింపజేస్తుందో? హృదయాన్ని రాయిడిపెడ్తూ స్పందింపచేస్తుందో? దేనితో ఏ అనుభూతిని పొందుతాడో ఆ ప్రభావంతో ఆ కవిత చిత్తరువు ఆవిష్కరింపబడుతుంది. తండ హరీష్ గౌడ్ తన మూడవ సంపుటి “గాలి లేని చోట” పుస్తకం ద్వారా పాఠకుల ముందుకు వచ్చాడు.

తండా హరీష్ గౌడ్ తన కవిత్వాన్ని చాలా బాధ్యతగా రాసే కవి. తన కవిత్వంలో మొదటి కవితా సంకలనం “నీటి దీపం”, రెండవ కవితా సంకలనం “ఇన్ బాక్స్” సంపుటాల్లో కంటే మరెక్కువ వైవిధ్యాన్ని కనబరిచాడు. కొంత తాత్వికతను కూడా జోడిస్తూ కవితా ధనస్సును ఎత్తినట్లు ఆలోచన ధనస్సును ఎక్కుపెట్టి రాశాడు. భావన శక్తి ఉండాలే తప్ప కవితకు వస్తు కానిది అంటూ ఏదీ ఉండదు. మనసు పెట్టి రాసాడేమో మన మనసుల్ని ఆలోచింపచేస్తాయి. తన కవిత్వంలోకి వెళితే..

“ప్రశాంతనది ఒడ్డున

తల దాచుకోవడానికి

తీరం ఒకటి కావాలిప్పుడు

తెలియని వైపుగా ఎగురుతున్న

ఈ గాలిపటపు జీవితానికి

దారం ఒకటి సహాయంగా రావాలి

మూలమూలన బరువెక్కుతున్న

జీవితాన్ని మోయడానికి

భుజాలు కావాలి”.

ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడులు ఉన్న ప్రశాంతగానే జీవించేవారు, తన వెనకాల ఉమ్మడి కుటుంబం, సన్నిహితులు ఉన్నారనే భరోసా వల్ల. కానీ ఈ రోజు ఆ భరోసా లేకపోవడం వాళ్ళ మనిషి ప్రతి దానికి ఒత్తిడికి గురిఅవుతూ ఒంటరిగా మిగిలిపోయాడు , అందుకే జీవితాన్ని మోయడానికి భరోసానిచ్చే మనషులు కావాలని కవి తన ఆవేదనను వక్తం చేస్తున్నాడు . మరొక కవితలో..

అమ్మ , నాయన

అప్పుల చిక్కుముళ్లు విప్పడానికి

పట్నం బంగ్లాల ముందు

గేట్లుతీసే మరబొమ్మలయి నిలబడుతున్నారు .

..... ...... ..... .....

కూలికో నాలికో పోయి

కాలాన్ని గంపకింద కమ్ముదామనుకున్న

వంటనూనె మందం కూడా దొరుకక

ఖాళీ కడుపును

ఎన్నో రాత్రులకు నైవేద్యంగా పెట్టిన

రోజులున్నాయి.

కవి ఆవేదన అంతా, నేటి మనిషి మనుగడ కొరకు సాగిస్తున్న పోరాటం గూర్చి , సమాజశ్రేయస్సు గురించి పడే తపన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సస్యశామలంగా వెలుగొందిన ఊర్లు నేడు కరువు కాటకాల్లో మునిగిపోయినప్పుడు, ఉపాధికోసం పట్నం బాట పడుతున్నారు. అక్కడ వారి పరిస్థితి చాల దయనీయమైన స్థితి చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. తన పిల్లాడి టీసీ ఇవ్వండి, కడుపునిండా బువ్వ దొరికే తావుకు బోతన్నా అని పలికే మాటలు చదువుతున్నపుడు మనిషిని ఎంతో ఆలోచింపజేస్తాయి.

అనాథపాక్షిగా అవతారమెత్తకముందే / అయ్యో! నాలుగురాళ్లయినా / దాచుకోవాల్సి ఉండే అని / నలుగురి మాటలు / కళ్ళను తడిచేయక ముందే / నీకోసం నువ్వు కొంత దాచుకోవాలి / చివరియాత్రలోనైనా / నీ కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండాలంటే / చితిలోనైనా / ప్రశాంతంగా నిద్రపోవాలంటే / వాళ్లలాగే నువ్వు / నటించడం నేర్చుకోవాలి.

నేటి జగత్తులో అన్నింటికీ ధనమే మూలాధారం. ధనం చుట్టే లోకం తిరుగుతుంది. పుట్టుక మొదలు చావు వరకు అన్ని ధనం తోనే ముడివడిఉన్నాయి. చివరికి పాడే మీద కెక్కిన శవాన్ని దహనసంస్కారాలు చేయాలన్న ధనమే కావాలి. ధనం మన దగ్గర ఉన్నంత కాలం ఇంటి నిండా బంధువులు, స్నేహితులు, ఎంతో కావాల్సిన వారిలా ప్రేమను కనబరుస్తూ తెగనటిస్తూ ఎక్కడ లేని మమకారాన్ని ఒలకబోస్తారు. నేటి సమాజ పరిస్థితికి మనిషి ముందు చూపు అవసరమే అని కవి తన మనసులోని ఆవేదనను పంచుకుంటున్నాడు.

"నదితో మాట్లాడాలి" అనే కవితలో, ఎలా నడవాలో, భాదలనెలా నమిలి మింగాలో, అవమానాలు, అపనిందల మీదుగా ఆగకుండా ఎలా ప్రయాణించాలో కాస్త నేర్పించమనాలి అని నదితో మాట్లాడి జీవన రస్యాలేమిటో తెలుసుకోవాలంటాడు . "తిరోగమనం" కవితలో బాల్యం గూర్చి చెప్పుతూ , మళ్ళీ బాల్యం నన్ను తన ఒడిలోకి రమ్మంటే వెళ్తాను, మళ్ళీ బాల్యం నుండి తిరిగి రాను అని చెపుతూ బాల్య మాధుర్యాన్ని నిష్కల్మషమైన ఏమి తెలియని పాలబుగ్గల పసితనాన్ని కోరుకుంటున్నానని , వాడిపోతున్న పూలను చూసి , కాలిపోతున్న మనుషుల మానవతను చూస్తే నామీద నాకే అసహ్యమేస్తుంది అని కవి ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు .

'కవిత్వం అనేది మనుషులు తమ అసలు మనసులోని మాటను చెప్పగల ప్రదేశం. వ్యక్తిగతంగా తెలిసిన వాటిని బహిరంగంగా చెప్పడానికి ప్రజలకు ఇది ఔట్‌లెట్'. అలెన్ గిన్స్‌బర్గ్ చెప్పినట్టు తండా హరీష్ గౌడ్ తన కవితల్ని మనసులోని మాటలను భిన్నమైన రూపంలో కవిత్వకరిస్తాడు. తండా హరీష్ గౌడ్ నుండి ఇంకా మరెన్నో అద్భుతమైన సాహితి సంకలనాలు వెలువరించాలని అభినందనలు తెలియజేస్తూ...

“గాలి లేని చోట”

కవి: తండ హరీష్ గౌడ్

పుటలు : 165

వెల: రూ.175

ప్రతులకు ఛాయ బుక్ స్టోర్


సమీక్షకులు:

గాజోజి శ్రీనివాస్

99484 83560

Next Story

Most Viewed