ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు

by Disha edit |
ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు
X

బలమైన కవిత పుట్టాలంటే కవికి తీవ్రస్థాయిలో కోపం రావాలి. లేదంటే పట్టలేని సంతోషం కలగాలి. ఏ భావోద్వేగమైనా సరే.. ఉచ్ఛస్థాయిలో ఉండాలి. అప్పుడే ఓ మంచి కవిత పుడుతుంది. మనసును ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తుంది. తెలుగునాట ప్రభావం చూపిన కవిత్వమంతా అటువంటిదే. మనం ఈ నేల మీద పుట్టాము కాబట్టి.. మన మాతృభాష తెలుగు కాబట్టి.. మనకు తెలుగులో రాసిన కవిత్వం మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో గొప్ప కవిత్వం పుడుతుంది. బహు భాషాపండితులు ఆ కవిత్వాన్ని చదివి ఆస్వాదించగలుగుతారు. కానీ సామాన్యులకు సాధ్యం కాదు. అందుకోసం పుట్టుకొచ్చిన ప్రక్రియే అనువాదం.. ప్రపంచ సాహిత్యంలో, లేదంటే మనదేశంలోని ఇతర భాషల్లో ఆలోచింపజేసే సాహిత్యాన్ని ఎందరో అనువాదకులు తెలుగుకు పరిచయం చేశారు.

కానీ దురదృష్టవశాత్తు అనువాద సాహిత్యం చాలా సార్లు కృతకంగా ఉంటుంది. మూలం చెడకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా అనువాదకులు కాస్త కఠినమైన భాషలో రాస్తుంటారు. కథా రచన, నవలా రచన అనువదించినప్పుడే ఆ భాష సామాన్యులకు ఓ పట్టాన అంతుచిక్కదు. అటువంటిది కవిత్వమైతే ఇంకా కష్టం. తెలుగులో గొప్ప అనువాద రచనలు లేవని కాదు.. మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసం కూడా అనువాద ప్రక్రియలో వచ్చిందే. అప్పటి కవులు స్వేచ్ఛను కూడా తీసుకొని.. తమదైన శైలిలో మూలం చెడకుండా భారతాన్ని రాశారు.

అయితే ప్రపంచ సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనలను తెలుగులో ఎందరో కవులు మనకందించారు. ఆ చిట్టా ఇప్పుడు అనవసరం కానీ.. గుల్జార్ రాసిన 'గ్రీన్ పోయెమ్స్' ను 'ఆకుపచ్చ కవితలు' పేరిట ప్రముఖ కవి, చిత్ర సమీక్షకులు వారాల ఆనంద్ తెలుగులో అనువదించారు. ఈ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆకుపచ్చ కవితలు పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకంలో ఉన్న కవితలు చదువుతుంటే మనకు అచ్చం తెలుగు కవిత్వం చదువుతున్న ఫీల్ కలుగుతుంది. ఎక్కడా అనువాదం అనే భావం కలగదు. హిందీ కవితను కూడా పక్కనే చేర్చారు కాబట్టి.. హిందీ తెలిసిన వారు మూల కవితను పోల్చి చూసుకొనే అవకాశం ఉంది.

మొదటి కవిత నది..

తనలో తాను గుసగుసలాడుతూ

నది ప్రవహిస్తున్నది

చిన్న చిన్న కోరికలు తన హృదయంలో

కదలాడుతున్నాయి

జీవితాంతం ఇసుక తీరాలపై జారుతూ కదిలిన నది

వంతెన మీద నుంచి ప్రవహించాలనుకుంటోంది.

ఇది మొదటి కవిత.. రచయితకు ప్రకృతి మీద ఎంత ప్రేముందో ఈ కవితతో మనకు అర్థమవుతుంది. ఓ నది పడే ఆవేదనను అద్భుతంగా అక్షరీకరించింది ఈ కవిత. ఇందులోని పంక్తులు చదువుతుంటే అచ్చం ఓ తెలుగు కవితను చదువుతున్నట్టే ఉంటుంది తప్ప.. అనువాదమనిపించదు.

గుల్జార్ ప్రకృతి కవి.. నది మీద, మబ్బుల మీద, శిశిరంలో రాలే ఆకుల మీదే ఆయన దృష్టంతా ఉంది. ఆ ఆకుపచ్చ కవితలన్నీ నిజంగానే నదికి మనసుంటే.. మబ్బులకు గొంతు ఉంటే అవి ఇలాగే పలవరిస్తాయేమో అనిపిస్తుంది. శిశిరంలో రాలే ఆకులు .. కొమ్మలకు ఏం చెబుతాయన్నది అచ్చంగా మానవ సంబంధాలను తలపిస్తాయి. చెట్టు మీద కొమ్మ మీద రాలే ఆకు మీద కవికి ఉన్న దృష్టికి నిజంగా అబ్బురపడతాం..

వీధి మలుపులో వృక్షం అన్న కవిత నిజంగా గుండెలను బరువెక్కిస్తుంది. చెట్టుకు మనిషికి విడదీయలేని సంబంధం ఉంటుంది. తనకు ఎంతో అనుబంధం ఉన్న ఓ భారీ వృక్షాన్ని మున్సిపల్ అధికారులు తన కండ్ల ముందే కూలదోస్తుంటే.. ఏ మనిషికైనా హృదయం బరువెక్కకుండా ఉంటుందా ఇక కవి అయితే ఆ బాధను అక్షరీకరించకుండా ఉంటాడా.. అలా పుట్టిందే ఈ కవిత..

సూర్యుడితో ఓ చెట్టు చెప్పుకునే వేదనే సూర్యుడి వేళ్లు కవిత. మనుషులు ఎంత కఠినంగా ఉంటారో.. చెట్ల మీద తమ పేర్లను ఎలా చెక్కుతారో ఓ చెట్టు పడే ఆవేదన ఈ కవిత.. ‘మూసేస్తున్న బావి’ ఈ కవిత పల్లెల్లో జరుగుతోన్న విధ్వంసానికి అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా పల్లెటూర్లలో చేదుడు బావులు, ఊట బావులు ప్రజల దాహార్తి తీర్చాయి. అవసరాలు కూడా. కానీ నేటి వాటి ఉనికి లేదు. బావుల జాడ కనిపించడం లేదు. కొన్ని ధ్వంసమయ్యాయి. మరెన్నో కనిపించకుండా పోయాయి. ఆ మూతపడ్డ బావులపై కవి వేదన ఎంతో అర్థవంతంగా ఉంది. ఆలోచనాత్మకంగా కూడా..

మొత్తంగా అన్ని కవితలు కదిలించేవే. చెట్టు, పుట్ట, నది, మబ్బు, వర్షం, ఆకాశం ఇలా పుస్తకమంతా ప్రకృతి పలవరింతే.. ప్రకృతి మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తుంటే.. మనిషి మాత్రం దాన్ని మరిచిపోయి పగబట్టినట్టు ప్రకృతిని చెరబడుతున్నాడు. చెట్లను ధ్వంసం చేస్తున్నాడు. నదులను చెరబడుతున్నాడు. వాటి ఉనికి ధ్వంసం చేస్తున్నాడు. రచయిత ఇదే ఆవేదనను వ్యక్తం చేశాడు. రచయిత భావాలను అనువాదకులు వారాల ఆనంద్ అద్భుతంగా అక్షరీకరించారు. 155 పేజీలున్న ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే.

ప్రతులకు సంప్రదించండి

వారాల ఆనంద్

94401501281

సమీక్షకులు

అరవింద్ రెడ్డి మర్యాద,

81793 89805


Next Story

Most Viewed