సమీక్ష: పల్లె జీవన చిత్రణ

by Disha edit |
సమీక్ష: పల్లె జీవన చిత్రణ
X

ప్రకృతిని చూసి పరవశించని కవి ఉండకపోవచ్చు. ప్రకృతితో మమేకమై తన భావాలను పాఠకుల మనోఫలకాలపై దృశ్యమానం అయ్యేటట్లుగా చిత్రించిన కవిత్వం కలకాలం నిలుస్తుంది. అనుభూతులను అనుభవాలను చక్కగా కవిత్వీకరిస్తున్న నేటి తరం కవులలో తుల శ్రీనివాస్ ముందంజలో ఉంటారు. కరోనా కాలం ముందు వరకు అజ్ఞాతంలో ఉన్న ఈ కవి అతి కొద్ది కాలంలోనే సోషల్ మీడియా ద్వారా సంచలనాత్మక కవిత్వాన్ని వెలువరించారు. తదనంతరం ఈ కవిత్వమంతా 'చింతల తొవ్వ' సంపుటిగా వెలువడింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామం నుంచి ఎదిగిన ఈ కవి కవిత్వం నిండా పల్లె పరిమళం గుబాళిస్తుంది. పల్లెలలో నివసించే వృత్తిదారులు, రైతులు వీరి కవిత్వంలో సాహిత్య గౌరవాన్ని అందుకున్నారు.

గ్రామీణ జీవితం

'బాయిలగుండు బైటవడ్డదాక పయిలంగుండాలని / తుమ్మ కింది మష్షెమ్మకు ముడుపు దీసిగట్న / గాలివానకు కరావ్ గాదాయె, రేటుగూడ నయంగనే వుండె / పోరి లగ్గానికి సావ్కారి కాడ దెచ్చిన అప్పు కాయితం గీసారి ఎట్లైన కతమయిద్దనుకున్న / పదినెలలు మోసి కన్నంక బాలింత రోగమచ్చినట్టు / ఆర్నెల్ల సెమట కష్టం అమ్ముకునేలోపె/ 'దాని కడుపుల మన్నువొయ్య, మాయదారి రోగవంట / గొర్లమంద మీద తోడేల్లెక్క దున్కింది. బూతంలెక్కనె బయపెట్టవట్టింది. అందరి బత్కులు ఆగంజేసింది.' కరోనాకాలంలో రైతుల జీవితాలను చిత్రించిన కవిత ఇది. 'రైతు కష్టం' అనే ఈ కవితలో గ్రామీణ సాంస్కృతిక జీవనం చక్కగా ప్రతిఫలించింది. ప్రసవానికి బిడ్డ పుట్టింటికి రావడం, మైసమ్మకు ముడుపు కట్టడం, నల్ల పోచమ్మకు బోనం పెట్టడం, దయ్యం కంటపడకుండా దిష్టి తీయడం మొదలైన గ్రామీణ సాంస్కృతిక ఆచారాలు శ్రీనివాస్ చక్కగా కవిత్వీకరించారు.

రైతుకు కడగండ్లు సర్వసాధారణం. గాలివానకు పంటలు నష్టపోవడం, పంట కల్లాలలో ఉన్నప్పుడు కప్పడానికి టార్పెన్లు లేక పంట తడిచిపోవడం, సమయానికి గోనె సంచులు దొరకకపోవడం, లారీలు రాకపోవడం, కాంట సమయానికి కాకపోవడం, తాలు, తరుగు అని దళారులు దోచుకోవడం,రైతునే చివరికి దొంగలాగా నిలబెట్టడం, అప్పులోళ్ల దేవులాట, రేఖలు బారంగ లేసి మోటలు కట్టి పుట్లకు పుట్లు పండించిన రైతులు ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టి చూపించారు. రైతుల శ్రామిక సౌందర్యాన్ని రూపు కట్టిన కవిత 'యాసంగి నాటు' విజయదశమి రోజు సాగుబాటు చేస్తే పంట దిగుబడి బాగుంటుందని రైతుల నమ్మకం. ఆనాటి మొదలు నాటు వడ్డదాకా రైతుల శ్రమను ఈ కవితలో చక్కగా చిత్రించారు.

మానవతా విలువలు

'గటికి బుక్కెడు నీళ్లు తాపి / పసి పోరగాని దూపార్పినట్టు / ఒక్కొక్క బిళ్లకు నీళ్లు మలుపుకుంట / కోండ్ర కోండ్ర సాలిరువాలు కొట్టేది' దిగుబాటు పొలంలో పశువుల బాధలు, సంసారం లాగలేక నాన్న బాధలతో పోల్చడం గొప్ప అభివ్యక్తి. తుకం మడి రోకు చేయడం, మండె కట్టడం, ఒడ్డొరం చెక్కడం, ఒంపు మిర్రలు సైచేయడం, మొదలైన వ్యవసాయ పనులను కవిత్వంగా మలిచారు.

పలుగురాళ్లకు పసుపు కుంకుమ రాసి అల్కుడు బోనం పెట్టి నీళ్లారబోయడం, నాటు వేస్తూ పల్లెతల్లులు పాడే పాటలు, జొన్న గుగ్గిళ్ళు వండి గోవింద కొట్టడం, నిండుకుండ కల్లు మైసమ్మకు ఒంపి తాగడం వంటి వ్యావసాయిక సాంస్కృతికాంశాలు ఈ కవితలో కనిపిస్తాయి. పల్లెలలో మమతాను రాగాలకు కొదవుండదు. 'ఓ మనిషి కావాలిప్పుడు' అనే కవితలో 'జొన్న గట్కల సల్ల బోసి / పిసికి పిప్పి దీసి తాగినట్టు / జీవిత సారమంతా జుర్రుకుంటూ/ బతుకు గట్లు తెంపుకుని / కాలువలై పారేటోళ్లు' అని పల్లెలలో ఉన్న మానవతా విలువలను చక్కగా ఆవిష్కరించారు.

యాదిల మైమరిచి

పల్లె జ్ఞాపకాలను అందంగా ఆవిష్కరించారు. ముంజ గిర్రల బండి, గోటీలాట, ముక్కాల పీటెక్కి ఉట్టిమీద పెరుగు ముంతను కింద పడవేసిన యాది, శర్ల తుమ్మ బంక తెచ్చి భద్రయ్య తాత కొట్లో బెల్లం కొనుక్కున్న గుర్తులు, ఈత కొట్టేటప్పుడు మోటమీది నుంచి దూకిన జ్ఞాపకం, సాట నిలబెట్టి ఉరవిష్కలు పట్టడం, తోకకు దారం కట్టి తుమ్మిష్కలు వదలడం, మొదలైన మధుర జ్ఞాపకాలను తడిమి పాఠకుడిని బాల్యంలోకి లాక్కెళ్తాడు. ఊరంటే రంగురంగుల బొమ్మలు ఉన్న కథల వొయ్యి అంటాడు. ఊరుకు దూరమైనందుకు చింతిస్తాడు.

సౌడు మిద్దె సంసారంలోని బాధలను కవిత్వీకరిస్తాడు. బయటకు పొక్కేవి అంటూ తాళ్లలో స్నేహితులు మాట్లాడిన ఇంగ్లిషు మాటలు,పాడిన యక్షగానపు పాటలు, చెప్పుకున్న గోడు, అల్లిన కవిత్వం, ఆనందాలు అనుభూతులన్నీ అందమైన కవిత్వంగా రూపు కట్టాయి. తన ఊరి మమతానురాగాలను హృదయంగమంగా ఆవిష్కరించిన తుల శ్రీనివాస్ కవిత్వం తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది. మంచి కవిత్వాన్ని అందిస్తున్న మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు.

ప్రతులకు:

తుల శ్రీనివాస్

99485 25853

పేజీలు 150 : వెల రూ.150


సమీక్షకులు:

సాగర్ల సత్తయ్య

79891 17415


Also Read...

కథా-సంవేదన: హత్య


Next Story

Most Viewed