సమీక్ష: కన్నబిడ్డకు కానుక

by Disha edit |
సమీక్ష: కన్నబిడ్డకు కానుక
X

యనో అక్షరపూజారి. నాలుగు పదుల సాహితీయాత్రలో 136 పుస్తకాలను ప్రచురించే భాగ్యం పొందిన అక్షర శ్రీమంతుడు. 'స్నేహం నీడనిచ్చే చెట్టులాంటిది'అనే నమ్మకపు పెట్టుబడితో అక్షరప్రస్థానంచేస్తున్న ఓరుగల్లు సాహితీవేత్త, డా. టి. శ్రీరంగస్వామి. సాహితీ సేవలో భాగంగా తరచూ పుస్తకాల ప్రచురణ పనిలో తలమునకలు అవుతూనే అప్పుడప్పుడూ నేనుసైతం అంటూ స్వంత రచనలు వెలువరించుకోవడం ఆయన నైజం. అందులో భాగంగానే తన స్వీయ భావాలు, ఇంగ్లాండ్ సందర్శన సమయంలో అక్కడ కనిపించిన ఆంగ్ల కవితలను మాతృభాషలోకి అనుసృజన చేసుకున్న కవితలు కలిపి అందించిన కవితా సంపుటి 'డిశంబరు 11'శీర్షిక పాఠకలోకానికి విస్మయం కలిగించినా, కొత్తదనం అనిపించినా అది తన కోడలు పుట్టిన రోజు కావడం ఒక విశేషం. కవితాసంపుటి ముఖచిత్రం స్వామి సతీసమేతంగా ఇంగ్లాండు రాజుధాని లండన్ నగరంలోని ఆ దేశ పార్లమెంటు భవనం వద్ద దిగిన చిత్రం కావడం మరో విశేషం. ఇదేదో అయన స్వంత కవిత్వం బాకా అనుకుంటే పొరపాటే!

సామాజిక స్పృహ

'డిశంబరు11'కవితాసంపుటి అచ్చమైన సామాజిక స్పృహ కలిగిన అక్షర సుమగుచ్ఛం. మానవ జీవితం పడుతున్న వ్యథల ఆవిష్కరణలో భాగంగా 'జీవితం అసంతృప్తి కేతనమై ఎగురుతుంది'అంటూనే 'భావాలు కొత్త చిగుల్లై మోసునెత్తుతూ ఉన్నతత్వం చేరుస్తున్నాయి'అంటూ అక్షర అక్షయపాత్ర విలువను చెప్పకనే చెబుతారు స్వామి. ఆశాజీవి బ్రతుకు సమరం అగరాదనే -కొండంత భరోసా అందిస్తారు 'ముదిమి'కవితలో.

కవి ఎప్పుడూ తన భావాల తోరణాలను చెంత చేరువు గల ద్వారాలకు అలంకరించడమే అసలైన కవిగుణం, అలక్షణాన్ని ఆయన అక్షరాక్షరాన చొప్పించి భళా అనిపించుకున్నారు. ఎంతవయసు పెరిగినా ఎంతటివారికైనా బాల్యం ఒక మధురభావన, దాన్ని అక్షరాల అద్దంలో చూసుకున్న ప్రతిఒక్కరికి ఎవరి బాల్య ప్రతిబింబం వారిని ఎంచక్కా పలకరించి అనాటి కాలానికి తరలించుకెళ్లి అందమైన ఊహలోకంలో విహరింప జేయించి, ఆత్మస్థైర్యం అనే సంజీవనిని అందిస్తుంది. ఆ నేపథ్యంలో రాసిందే 'తిమ్మాపూర్ బాల్యం'

మనసు వేదన

నవ తెలంగాణ ఆవిర్భావ ఆనందంతో, అందులోనే ఏడు మండలాలను పక్క రాష్ట్రానికి అప్పగించడంలో కలిగిన ఆవేదనను ఆవిష్కరించి కవికుండే, సమన్యాయపు ప్రజాపక్షపాత బుద్ధిని చెరువంతగా చూపి స్తారు స్వామి. నిజంగా మనిషి ఎంత కాదన్నా ఆశాజీవి, అత్యాశపరుడు కారాదన్నదే పెద్దల ఉవాచ. నిజమే. ఆశావాదమే మనల్ని బ్రతికిస్తుంది. మునుముందుకు నడిపిస్తుంది కూడా. అది అందించే అక్షరసంజీవిని 'కవనసరోవరం' ఒక్కటే, అని నిజంచేస్తూ రాసిందే 'నేను ఎప్పటికి అశాజీవినే'కవిత.

అలతి అలతి పదాలతో అందంగా విషయాన్ని కవిత్వీకరించడం ఎలాగో, చేయి పట్టి మరి నేర్పిస్తుంది. ఈ 'డిశంబర్ 11'కవితా సంపుటి, అన్ని తరగతుల అక్షర కవన ప్రేమికులంతా తప్పక చూసి చదవాల్సిన కవిత్వం ఇది.

ప్రతులకు:

డా. టి. శ్రీరంగస్వామి

99498 57955

పేజీలు : 64. వెల: రూ.60


సమీక్షకులు:

డా. అమ్మిన శ్రీనివాసరాజు

7729883223


పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.

Next Story

Most Viewed