సమీక్ష: కాలం విలువ నేర్పిన కరోనా నానీలు

by Disha edit |
సమీక్ష: కాలం విలువ నేర్పిన కరోనా నానీలు
X

2020 దశాబ్దం కోసం చాలామంది గొప్ప గొప్ప ప్రణాళికలు సిద్ధం చేసుకుని విజన్ 2020గా నామకరణం చేశారు. అంకెల రూపంలో అయితేనేమి, ఆధునిక మార్పుల వల్ల అయితేనేమి ఈ 2020 కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ చేసుకొని మరి ఎదురు చూశారు. కానీ, అందరి అంచనాలను ఆవిరి చేస్తూ వచ్చి పడ్డ కరోనా అనే 'అనారోగ్య ప్రళయం' ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం వదిలి వెళ్లింది. సందర్భం ఏదైనా స్పందించడం సృజనకారుల సహజ లక్షణం. భావితరాల జాగ్రత్త కోసం భద్రపరచాల్సిన బాధ్యత కూడా. అందులో భాగంగానే కవి, రచయిత, సంపాదకుడు, రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా బహుళ బాధ్యతలు నిర్వహిస్తున్న చలపాక ప్రకాష్ వెలువరించిన 'కరోనా నానీలు' పుస్తకం. రచనకు కారణభూతమైన వస్తువు కన్నదో, విన్నదో, అయితే ఉండే ఘాడత కన్నా స్వీయ అనుభవం ద్వారా పొందిన అనుభూతి వల్ల వచ్చే రచనలలో ఘాడతస్థాయి అధికంగా ఉంటుంది, ఆకోకు చెందిందే ఈ నానీల సంపుటి. కరోనా ప్రపంచం మీద ముప్పేట దాడి చేయగా, రెండవ దాడిలో మరణాల సంఖ్య అధికంగా ఉంది.

బహుళ ప్రయోజనకారి

రచయిత సొంత పెదనాన్న బ్రహ్మశ్రీ చలపాక సాధు సత్యనారాయణ కూడా అందులో చేరడం ఒక విషాదం. ఆ గాఢమైన ఆవేదనలో నుంచి అక్షరీకరించబడి ఆ దివంగతునికే అంకితం ఇచ్చిన ఈ నానీల సంపుటి రచయిత లాగే బహుముఖ ప్రయోజనకారిగా నిలిచింది. నానీల నాన్న డా. ఎన్. గోపి అన్నట్లు ఈ 80 నానీలు ఒక్కొక్కటి ఒక్కో ధైర్య శకలమే. దీనిలో అనుబంధంగా కరోనా కాలంలో తెలుగు సాహిత్య సీమలో కరోనాతోను, సాధారణ కారణాలతోను కన్నుమూసిన కలం యోధుల వివరాల లెక్కలు పొందుపరిచారు. కరోనా వస్తువుగా వెలువడిన 15 పుస్తకాల వివరాలు కూడా చేర్చారు.

ఇక కరోనా నానీలు కూడా వాటి కొలతల ప్రకారమే తీర్చిదిద్దబడి ఒకపక్క గుండె తడిచేసే ఆర్థత, కరుణరసాత్మకంగా ఉంటే, మరోపక్క మానవ సంబంధాలు డొల్లతనాన్ని మరోమారు బయటపెట్టి, బతుకు విలువ నేర్పి, ఆరోగ్య సూత్రాలు కాపాడుకోకపోతే ఎలాంటి విపత్తులు వస్తాయో కూడా హెచ్చరించిన వైనం కనిపిస్తుంది.

ఆవేదనాభరితంగా

'బంధుమిత్రులు / ఎందరుంటేనేం!? / కరోనా రానంతవరకే / అందరూనూ/' అన్న నానీలో కరోనా సోకి కన్నుమూసినవారి అంతిమ సంస్కారాలకు కూడా ముందుకు రాని ఆత్మబంధువుల వైనాన్ని ఎద్దేవా చేసారు. 'కరోనా వల్ల / కరువే కాదు / కరుణ కూడా / ఉవ్వెత్తున నిద్రలేస్తుంది' అంటూ కరోనా కాలంలో ప్రాణాలు సైతం లెక్కచేయక తమ ఉద్యోగ బాధ్యతలను సొంత పనిగా మార్చుకున్న మహనీయ ఉద్యోగ సేవకులను గుర్తు చేసుకున్నారు. శత శాతం పారదర్శకంగా తనదైన సొంత ఆవేదన తాలూకు స్పందనలతో రాయబడిన ఈ కరోనా నానీల సంపుటి. ప్రతి పాఠకుడికి మనసుదోచే మంచి పుస్తకం మాత్రమే కాదు. భావితరం పరిశోధకులకు చక్కటి మార్గదర్శి కూడా. నానీల ప్రేమికులంతా విధిగా సొంతం చేసుకోవలసిన విలువైన నానీల సంపుటి ఇది.

ప్రతులకు:

చలపాక ప్రకాష్

92474 75975

వెల రూ.40 : పేజీలు 72


సమీక్షకులు:

డా: అమ్మిన శ్రీనివాసరాజు

7729883223

Next Story

Most Viewed