వింటే.. ఇంత విచ్చిన్నం అయ్యేది కాదేమో!?

by Disha edit |
వింటే.. ఇంత విచ్చిన్నం అయ్యేది కాదేమో!?
X

పెద్ద పెద్ద బహుళ జాతి కంపెనీలు కూడా ఫీడ్ బ్యాక్ తెల్సుకుంటాయి. తమ ప్రాడెక్ట్ ఎట్లున్నది, ఇంక ఎట్ల మార్చుకోవాలి అనే ఆలోచన కోసం. అట్లనే రాజులు కూడా తమ రాజ్యం ఎట్లున్నదో తెల్సుకునేందుకు మారువేషంలో తిరిగి తెల్సుకునేవారని చదువుకున్నం. ఒక నిర్ణయం ఒక ఆలోచన సాధికారకంగా అమలవుతున్నప్పుడు జరుగుతున్న పర్యవసానాలు తెల్సుకుంటే మంచిది. ఇది ఏ వ్యవస్థ అయినా వ్యక్తి అయినా ప్రభుత్వాలైనా చేయాల్సింది ఇదే!

కానీ వినేందుకు చెవుల కిటికీలు మూసుకుంటే ఏం తెలుస్తది. ఏం తెలువది. అంతరంగ నిఘా యంత్రాంగం కూడా తను కోరుకుంటున్నట్లు గానే అల్లిన సమాచారం ఇస్తది బయట అల్లకల్లోలం అయితది. ఈ లోపల వ్యవస్థ పురా కరాబు అయితది. చిన్న కురుపుగా పుట్టిన వ్యతిరేకత పెద్ద గడ్డ లెక్క తయారై ఓటరు మీట నొక్కితే చీము బయటకు వస్తది.

అలోచనలు ప్రజాస్వామికంగ ఉండాలె!

ఎంత తెల్సిన వాల్లైనా అండ్లనే ఒగలు చెప్పిన ముచ్చట్లు విచారం చెయ్యాలి అసలు ఇంకొకలను చెప్పనిస్తే కదా అంటరు కొందరు. చెప్పే చాన్స్ ఉంటద అసలు కల్సుడే లేకపోయె. గిది గిట్ల గిది గట్ల గిరి గుర్రం గిది మైదానం అన్న ముచ్చట్లు మాట వరసకు లేకుంటే గిట్లయి పాయె. ఎంత పెద్ద సిపాయి అయినా తనకు తెల్సిందే వేదం కాదు గదా. ఆలోచనలు ప్రజాస్వామికంగ ఉండాలె, పరిపాలన పచ్చగా ఫరిఢవిల్లాలని అందరం అనుకుంటం. కానీ కాకపాయే ఇప్పుడు పుర గిట్లయిపాయె తర్వాత ఎన్ని సర్దిచెప్పినా ఎంత తిర్ర మర్ర వాదించినా పర్రెలు పాసిన బొర్రలు కనపడుతూనే ఉన్నాయి.

మొన్న ఒగలు మాట్లాడుకుంటే వినచ్చింది వింటె, తినచ్చు ఇయ్యాల రేపు తిననోల్లు ఎవలు పనన్న సక్కగ కావాలె గద, పూర అక్కరకు రాకుంట కూలిపోయేటట్టు తెర్లు తెర్లు అయిపాయె. ఇసొంటి ముచ్చట్లే ఈ మధ్య వినవస్తున్నాయి. జయజయహే తెలంగాణ గీతం తెలంగాణ ఉద్యమ కాలమంతా ఆకాశంలకు వినవచ్చేటట్టు అందరం పాడుకున్న కాలం. ఆ పాటలేని సభ లేదు, బడి లేదు, అంత మారుమోగిన పాటకు గౌరవం దక్కకపాయె. ఎందులకు అని ఎందరు మొత్తుకున్నా సమాధానం లేదు. సరే అది నచ్చలేదు కావచ్చు మల్లొక పాటన్నా రావాలె కద. అదీ లేదు.

వినడమే ప్రధానం!

అట్లనే తెలంగాణ అంటే టి.జి అని ఆంగ్ల పొడి అక్షరాల్లో ఉద్యమ కాలంలో బండ్ల మీద సంబురంగ రాసుకున్న కాలం ఆంధ్ర అని ఉన్న అన్ని బోర్డుల్ల TG అని తిరిగి రంగుతో మార్చిన ఉద్యమాలు ఆ అకాంక్షలన్ని ఆఖరుకు చెదిరిపోయి TSగా మారిపోయాయి. 'జి' పోయి 'ఎస్' ఎందుకు వచ్చింది అంటే ఆన్సర్ లేదు. తెలంగాణ తల్లి విగ్రహంలోనూ వాదనలు ఉన్నవి కానీ తెలంగాణ తల్లి విగ్రహం హుందాగా తెలంగాణ ఆత్మగానే ఉన్నది కానీ కొన్ని నచ్చకపోతే అన్ని చర్యలు అట్లనే ఉంటాయన్న చందంగా ఆలోచనలు నడుస్తాయి.

అందుకే ప్రగతి భవన్ ముందు ముళ్ల కంచె కూల్చివేస్తుంటే ప్రజాస్వామ్యపు స్వేచ్చ గాలి వీచినట్లు అయ్యిందని ఒక మేధావి వాఖ్యానం గుర్తించ తగ్గది. అందుకే ఎవరైనా ఎప్పడైనా ఎక్కడైనా వినడం అనేది ప్రధానం. చెప్పింది విని అమలు చేయాలని కాదు... ఆలోచించాలి. తర్జన భర్జన చేయాలి. ఏదన్న ఆపరేషన్ చేయించాలన్నా, రెండో ఒపీనియన్‌కు ఇంకో డాక్టర్ దగ్గరకు పోయినట్టు ఫీడ్ బ్యాక్ కంపల్సరీ లేకుంటే ఇచ్చుల్లారం అయితది. దాంతో మొత్తం వ్యవస్థనే సర్వనాశనం అయి మల్ల బండి వెనకకు నడుస్తది. ఇప్పుడు అదే నడుస్తుంది. నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ముందు చూపుతో పాటు చెవుల కిటీకీలు తెరిచి ఉంచితే మంచిది.

అన్నవరం దేవేందర్

94407 63479

Next Story