మనిషిలో క్రూరత్వం మితిమీరిపోతుంది!

by Disha edit |
మనిషిలో క్రూరత్వం మితిమీరిపోతుంది!
X

నిషిని చూస్తే మాట్లాడుతూ, నవ్వుతూ, నడుస్తూ, ఏదో పనిలో లీనమై కన్పిస్తాడు. కానీ మనిషిలో క్రూరత్వం కూడా భయంకరంగా కన్పిస్తుంది. ఇటీవల వార్తలొస్తున్న సంఘటనలు చూస్తుంటే ఎంత క్రూరత్వం అంటే సాటి మనిషిని కలిసి ప్రయాణం చేసిన మనుషులను కసకస నరికి చంపి ముక్కలు ముక్కలు చేయడం ఇలా రాస్తుంటేనే ఎంతో ఇదనిపిస్తుంది. ఇట్లాంటిది మనుషులను నరికి కుక్కర్‌లో పెట్టడం, ఫ్రిజ్‌లో పెట్టడం, సంచీలో పెట్టడం, చివరకు నీళ్ళలో కలపడం చాలా సులువుగా చేస్తున్నారు. ఎక్కువగా మనుషుల మధ్య కోపాలు, తాపాలు, వ్యతిరేకతలు ఆస్తుల నుంచి పుట్టుతాయి. లేదంటే వివాహేతర లైంగిక సంబంధాలు ప్రేమ తిరస్కరణలు మధ్య జరుగుతాయి. మిత్రుల వ్యాపారాల మధ్య పైసల వ్యవహారం కూడా ఇలా హత్యాకాండ దాకా పోతుంది. అప్పటిదాకా మాట్లాడుకున్న కల్సి స్నేహం చేసిన కుటుంబంలో కల్సి మెల్సి ఉన్న... చివరకు హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ క్షణిక ఆవేశంలో జరుగుతున్నాయా? లేదు వ్యూహాత్మకంగానే జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రేయసితో కల్సి భర్తను, మొదటి ప్రియునితో కలిసి రెండో ప్రియున్ని ప్రేమ పేరుతో కల్సిపోయి పెళ్ళి అనగానే హత్యాకాండ... ఇంత దారుణంగా సమాజం దిగజారిపోయింది. పూర్వకాలంలో ఇంత తీవ్రంగా ఉంటే ఎవరినో రౌడీలతో పని కానించేవారు. ఇప్పుడు స్వయంగా చేస్తు నాలుగు రోజులు జైల్లో ఉండి బెయిలుపై వచ్చి దర్జాగా తిరుగుతున్నారు.

హత్యలకు ప్రేరణ ఎక్కడ

దేశంలో జరుగుతున్న సకల అనర్థాలకు దౌర్జన్యాలకు ప్రధానంగా సినిమాలే కారణం సినిమా ప్రభావం సమాజం మీద ఎక్కువ. సినిమాల్లో ఫైటింగ్ ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం చాలా సహజంగా చేస్తుంటారు. నిజజీవితంలో సమాజంలో ఒక మనిషిని ఇంకో మనిషి కొడితే భారతీయ శిక్షా స్మృతి కింద శిక్షలు ఉంటాయి. కొట్టడం నేరం. అట్లాంటది ఒక్క హీరో వందమందిని ఎగిరెగిరి కొడుతాడు, చంపుతాడు. వానికి ఏ శిక్షలు ఉండవు. ((అసలు సినిమా సమాజాన్ని ప్రతిఘటించి కానీ సినిమాల్లోని హింస, నేరం, కృతత్వం అత్యాచారం దొంగతనాలు, దౌర్జన్యాలు అన్ని సమాజం అనుకరిస్తుంది.)) ఎందుకంటే ఇవన్నీ చేసిన పాత్రలకు ఆ సినిమాల్లో ఏ శిక్షలు ఉండవు. కనీసం ఇది నేర ప్రవృత్తి అని బోధన కూడా ఉండరు. పైగా ఒక్కడు వంద మందిని కొడుతుంటే హాల్లో ఈలలు హర్షధ్వానాలు చేస్తుంటారు. ఈ హింస కల్చర్ సమాజం మీద పడ్డది. ఇందులోంచే వివాహేతర లైంగిక సంబంధాలు వికృతుల ప్రేమలు, అర్ద నగ్న దృశ్యాలు కూడా సమాజంలో చేరుతున్నాయి. హింస వ్యాపనకు సినిమానే కారణం.

ఇంటర్నెట్‌లో లెక్కలేనన్ని..

మనిషిని చంపడం ఎలా అని ఇటీవల ఒక దుర్మార్గుడు సెర్చ్ చేసి చంపేసిన సంఘటన చూసాం. అతడు అందరూ గౌరవించే వృత్తి సాధువులాగా కన్పిస్తాడు. అతనిలో మనిషిని ఎలా చంపాలి అనుకొని చంపిన క్రూరమైన తనం ఉన్నది. ఎవరినీ నమ్మడం కష్టం. ఇంటర్నెట్ ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తే ప్రతి విషయం వస్తుంది. దాంతో దాన్ని అనుకరించి ఇలా క్రూరమైన దారుణాలు చేస్తున్నారు. మళ్ళీ అందులోనే తప్పించుకోవడం ఎలా అనేది ఉండనే ఉంటది. మంచితోపాటు చెడునూ తెల్సికునే అంతర్జాలం ఉండటం వల్ల కూడా ఈ దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి.

చట్టాలు న్యాయాల పట్ల భయం లేకపోవడం

నేరం చేస్తే శిక్షకు గురిఅవుతాం, జీవితం... కుటుంబం నాశనం అవుతుందనే భయం లేకపోవడం ఒక కారణం. చట్టాన్ని మేనేజ్ చేసికోవచ్చు. అధికార రాజకీయాలతో డబ్బుతో దేన్నైనా నడిపించవచ్చుననే ఒక తెంపరితనం ఎక్కువైపోయింది. పోలీసు వ్యవస్థ మీద మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల వాళ్లు అసలు ఆ చట్టాన్ని పట్టించుకోవడం కన్నా పై నుంచి వచ్చే ఆదేశాలే శిరోధార్యం అవుతున్నాయి. నేర నిరూపణతో జాప్యం వల్ల న్యాయస్థానాల్లోనూ అన్యాయం జరుగుతుంది. తప్పు చేస్తున్నం, అన్యాయం చేస్తున్నం, హంతకులం అవుతున్నం, చంపడం ఎంత జుగుప్సాకరమైన అమానవీయ సంఘటన అనే సోయి పూర్తిగా కోల్పోయిన ప్రపంచం తయారవుతుంది. కావాల్సింది సాధించుకోవడం వ్యక్తిగత ఆనందం వ్యక్తిగత ఆస్తి, ప్రేమరాహిత్యం వల్ల మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి.

అన్నవరం దేవేందర్

94407 63479

Next Story

Most Viewed