ఆదివాసీల ఆత్మఘోష ఇది

by Disha edit |
ఆదివాసీల ఆత్మఘోష ఇది
X

ప్రపంచంలోని చాలా ప్రజా సమూహాలు తమ అస్థిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టుకోవడం కోసం తమ చరిత్రను తామే పరిశోధించుకుంటున్న చారిత్రక సందర్భాలు తారసపడుతున్నాయి. మానవాళి ప్రాకృతిక వ్యవస్థ నుంచి నేటి నాగరిక దశకు చేరుకోవడానికి తొలి అడుగులు నేర్పిన ఆదివాసీ సమాజం నేడు ఎన్నో సమాజాలకు మూరెడు, బారెడు కాదు, మైళ్ల దూరం వెనుకబడి ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు, నడక నేర్పిన చేతులనే విరిచిచేసినట్టు, దారి చూపిన కండ్లనే పొడిచివేసినట్టు, నాగరికతకు నడక నేర్పిన ఆదివాసీల బతుకులను అడవి సరిహద్దులకు లోపలనే బంధించి ఉంచింది మన పాలక సమాజం. అడవి చరిత్రను అడవి గుప్పెటనే దాచి ఉంచింది. ఆ బంధనాన్ని తెంచుకొని, ఆ గుప్పిటిని విప్పుకొని తమ కాంతి రేఖలను తామే ప్రపంచానికి ప్రసరింపచేయటం కోసం కొన్ని కలాలు, గళాలు, గొంతుకలు సవరించుకొని ముందుకొస్తున్నాయి. అలాంటి గొంతుకలలో గుమ్మడి లక్ష్మీనారాయణ చెప్పుకోదగిన ఆదివాసీ స్వరం. ఆదివాసీ సమాజానికి ఆయన చరిత్రకారుడు.

జీవితాల విశ్లేషణ

లక్ష్మీనారాయణ మరుగున పడిన ఆదివాసీ, గిరిజన చరిత్రను పూనికతో తవ్వి మన ముందు వ్యాసాల రూపంలో రాశిగా పోస్తున్నాడు. ఆ వ్యాసాలలోంచి కొన్నింటిని ఏర్చి కూర్చిన పుస్తకమే 'ఆదియోధులు- అజరామరులు' ఈ పుస్తకం నిండా ఆదివాసీల చరిత్రతోపాటు వారి ఆత్మఘోష కనిపిస్తుంది. విన్పిస్తుంది. ఆధిపత్యవర్గాల ప్రభావంతో చరిత్ర రచనలో నిరాదరణకు గురై మరుగున పడిపోయిన మాణిక్యాలు ఎన్నెన్నో! వాటిని బహిర్గతం చేయడమే కాక, ఆదివాసీ చైతన్య కిరణాలను బాహ్య ప్రపంచంలోకీ ప్రసరింపజేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఆ ప్రయత్నం ఈ వ్యాసాలలో స్పష్టంగా కన్పిస్తుంది. యావత్ భారతదేశ చరిత్రను చూసినప్పుడు వాస్తవిక విషయాలెన్నో మనకు తెలియడం లేదు. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర తెలిసినంతగా మనకు వీరనారి దుర్గావతి గురించి తెలియదు. రాణిమా గైడిన్ల్యూ‌ను గురించి తెలియదు. గోండ్వానా మహారాణి 'కమలాపతి' గురించి తెలియదు. జగల్పూర్ పాలకుడు కున్వర్ సింగ్ గురించి తెలిసినంతగా మేఘాలయ ఖాసీ తెగకు చెందిన గిరిజన వీరుడు తీరద్‌సింగ్ గురించి తెలియదు. తాంతియా తోపే గురించి తెలిసినంతగా తాంతియా భీల్, భగత్‌సింగ్ గురించి తెలిసినంతగా బుధు బగత్ వంటి గిరిజన యోధుల గురించి తెలియదు. ఆ లోటును తీరుస్తున్న పుస్తకమే ఇది.

నాలుగు భాగాలుగా

ఈ పుస్తకంలో నాలుగు ప్రధాన భాగాలతోపాటు అనుబంధం కూడా ఉంది. కాకతీయుల కాలం నాటి ధీర వనితలు సమ్మక్క సారలమ్మ మొదలుకొని నక్సల్బరీ పోరాట దివిటీ శాంతి ముండా వరకు పరిశోధనాత్మక వ్యాసాలున్నాయి. ఆదివాసీల ఆత్మబంధువు హైమండార్ఫ్ మొదలుకొని అణగారినవర్గాల ఆత్మబంధువు అంబేద్కర్, సవరల అక్షర బ్రహ్మ గిడుగు రామమూర్తి, బియ్యాల జనార్దనరావు, బాలగోపాల్, మహాశ్వేతా దేవి, ఎస్ఆర్ శంకరన్, కన్నాభీరన్ తదితరులు ఆదివాసీల అభ్యున్నతికి చేసిన కృషిని తెలియజెప్పిన వ్యాసాలున్నాయి. అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళోద్యమంలో సత్యం మాష్టారు చూపిన విప్లవ పంథా, ఏజెన్సీలో ఎర్రజెండా ఎగరేసిన ఈసం బాటన్న, సుందరయ్య, మానవతను పంచిన మారూ మాష్టారు, జ్ఞానజ్యోతి జంగుబాయి, ఆదివాసీల సంక్షేమ సారథి ఎన్‌టీ‌ఆర్, మౌఖిక సాహిత్యకారుడు సకిన రామచంద్రయ్య గురించిన వ్యాసాలున్నాయి. వాల్మీకి, శూర్పణఖ, తాటకీ, ఏకలవ్యుడు, శబరి, హిడింబి, హోలిక, రావణబ్రహ్మ, నరకుడు వంటివారిని మన కండ్ల ముందుంచి, పురాణాలలో ఆదివాసీలను రాక్షసులుగా చిత్రించిన తీరును దుయ్యబట్టాడు రచయిత. అనుబంధంలో గిరిజనోద్యమాలు, వాటి వెనుక కారణాలు, అంతరించిపోతున్న గిరిజన తెగల జనాభా వివరాలు, గిరిజనుల రాజ్యాంగ రక్షణలు వంటి ఆదివాసీ ఘట్టాలను వివరించారు. ఆదివాసీలు పౌరాణికంగా, చారిత్రకంగా ఎటువంటి చైతన్యాన్ని కలిగి ఉన్నారో, నేడు ఎంత వెనుకకు నెట్టివేయబడినారో తెలిపే ప్రయత్నం చేశారు రచయిత. అస్థిత్వ ఉద్యమాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ఇందులో పోటీ పరీక్షలకు ఉపయోగపడే గిరిజన చారిత్రక అంశాలు కూడా ఉన్నాయి.

ప్రతులకు:

రుద్రాణి ప్రచురణలు

ఇంటి నెంబర్: 2-280

పాఖాల కొత్తగూడెం-506135

మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ

9491318409

పేజీలు : 166 వెల: 199/-


సమీక్షకులు:

డా. మద్దెర్ల రమేశ్

99851 35771



Next Story

Most Viewed