మందు బాబులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో లిక్కర్ ఫ్రీ

by  |
new liquor policy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుండడంతో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే బీర్ల ధరలపై పది రూపాయలను తగ్గించిన ఎక్సైజ్ శాఖ బార్లలో వ్యాపారం మందకోడిగా సాగుతున్నందున ఆఫర్లను ప్రకటించాలని యజామాన్యానికి సూచించింది. వారానికి ఒక రోజు ‘లిక్కర్ ఫ్రీ’ (మద్యం ఉచితం) ఆఫర్‌ను ప్రకటించాలని ప్రతిపాదించింది. కొన్ని వారాల పాటు దీన్ని అమలు చేసిన తర్వాత ‘ఒకటి కొంటే మరొకటి ఉచితం‘ లాంటి ఆఫర్‌ను కూడా ప్రకటించాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకండ్ క్వార్టర్‌కు అడ్వాన్స్ టాక్సు చెల్లించలేమని, దీన్ని మాఫీ చేయాలని కొన్ని బార్ల యజమానులు ఎక్సైజ్ శాఖకు సూచించడంతో ఆ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి చర్చలు జరిపి పై ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు.

కరోనా కారణంగా బార్లకు రావడానికి మందుబాబులు వెనుకంజ వేస్తున్నారని, ఫలితంగా వ్యాపారం బాగా దెబ్బతిన్నదని, నిర్వహణ ఖర్చులు కూడా భరించలేని స్థాయిలో ఉన్నాయని, సెకండ్ క్వార్టర్ అడ్వాన్స్ టాక్సు నుంచి మినహాయింపు ఇవ్వాలని యాజమాన్యం నుంచి ఎక్సైజ్ శాఖకు కొన్ని విజ్ఞప్తులు వచ్చాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఐదు బార్ల యజమానులను పిలిపించుకుని చర్చలు జరిపారని, ఆ సందర్భంగా వ్యాపారం పెంచుకోడానికి కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. కానీ టాక్సును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడం లేదా మినహాయించడం అనే ప్రసక్తే లేదని ఆ అధికారి తేల్చి చెప్పారు.

బార్ల యజమానులతో జరిగిన చర్చల సందర్భంగా వచ్చిన ఈ ప్రతిపాదనలపై ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరం. మందుబాబులను ఆకర్షించడానికి వారంలో ఒక రోజు నిర్దిష్ట సమయాన్ని ‘లిక్కర్ ఫ్రీ’ ఆఫర్ రూపంలో ప్రకటించడం ద్వారా వినియోగదారుల సంఖ్య పెరగడం, వ్యాపారం గణనీయంగా ఎక్కువ కావడం ఎలా ఉన్నా వచ్చే నష్టాన్ని ఎలా నివారించుకోగలం అనే అంశాన్ని యజమానులు ఆ అధికారి దగ్గర ప్రస్తావించారు. ఫుడ్ ఐటెమ్స్ తదితర రూపాల్లో దాన్ని సర్దుబాటు చేసుకోవాలని ఆ అధికారి వివరించినట్లు తెలిసింది. కొంతకాలం ఈ ఆఫర్ నడిచిన తర్వాత ‘ఒకటి కొంటే మరొకటి ఫ్రీ’ అనే ఆఫర్‌ను ప్రకటిస్తే వ్యాపారం మరింతగా పుంజుకుంటుందని కూడా ఆ అధికారి వారికి వివరించినట్లు తెలిసింది.

ప్రభుత్వానికి పన్నుల రూపేణా వస్తున్న ఆదాయానికి గండి పడకుండా ఉండేందుకు సదరు అధికారి ఇలాంటి ప్రతిపాదనను పెట్టారు. బార్లకు వ్యాపారం తగ్గిపోవడంతో చాలా మంది యజమానులు అద్దె, కరెంటు బిల్లు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించుకోలేని పరిస్థితుల్లో మూసివేయడానికే సిద్ధపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న సుమారు 850 బార్లకు తోడు కొత్తగా 159 బార్లకు అనుమతి ఇచ్చింది. ఉత్సాహంతో సుమారు 7,360 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రీఫండ్ కాని లక్ష రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ. 73 కోట్ల ఆదాయం సమకూరింది.

జనాభాకు అనుగుణంగా నాలుగు శ్లాబ్‌లలో బార్లకు అడ్వాన్స్ టాక్సు విధానాన్ని ఎక్సయిజ్ శాఖ రూపొందించింది. 50 వేలకు తక్కువ జనాభా ఉన్న చోట్ల ఒక్క బార్‌ సంవత్సరానికి రూ. 30 లక్షలు, ఆపైన ఐదు లక్షల జనాభా ఉన్నచోట రూ. 42 లక్షలు, ఇరవై లక్షలు ఉన్నట్లయితే రూ. 44 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్నచోట రూ. 49 లక్షల చొప్పున టాక్సు శ్లాబ్‌లను ఖరారు చేసింది. వ్యాపారం జరిగినా జరగకపోయినా యజమానులు ఎక్సైజ్ శాఖకు ఈ పన్ను అడ్వాన్సుగా చెల్లించాల్సిందే. కానీ కరోనా వల్ల బార్లు మూతపడి వ్యాపారం జరగకపోవడం, అన్‌లాక్ తర్వాత కూడా వైరస్ భయం కారణంగా మందుబాబులు ఆసక్తి చూపకపోవడంతో వాటిని మూసేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అడ్వాన్సు టాక్సుకు మినహాయింపు ఇవ్వాలని కోరిన బార్ల యజమానులకు అధికారి నుంచి వారానికి ఒక రోజు లిక్కర్ ఉచితం, ఒకటి కొంటే మరొకటి ఉచితం లాంటి ఆఫర్ల ప్రతిపాదనలు తెరపైకి రావడంతో ఆలోచనలో పడ్డారు. కొత్త బార్ల ద్వారా కనీసంగా రూ. 150 కోట్ల మేర టాక్సు ద్వారా ఆదాయం వస్తుందని ప్రభుత్వ అంచనా. ప్రభుత్వం ఆశించినట్లుగా బీర్ల అమ్మకాలు లేకపోవడంతో ఎక్సయిజ్ శాఖ ఒక్కో బాటిల్‌పై పది రూపాయలు తగ్గించింది. ఇప్పటికే డిస్టిల్లరీలలో తయారై సిద్ధంగా ఉన్న బీరు బాటిళ్ళపై స్టిక్కర్లను కొత్త ధరల ప్రకారం మార్చడానికి ఒక్కో దానికి దాదాపు మూడు రూపాయల వరకు ఖర్చవుతున్నది.

మద్యం ద్వారా ఆదాయం పెంచుకోడానికి ప్రభుత్వం వీలైనన్ని కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది. కరోనా పరిస్థితుల్లో ఆదాయం పడిపోయినా దాన్ని ఎక్సయిజ్ శాఖ ధ్వారా భర్తీ చేసుకోడానికి ఆ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే బార్ల యజమానులకు చేసిన తాజా ప్రతిపాదనలు. ఇవి ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి, ఏ తీరులో సక్సెస్ అవుతుంది, యజమానులు ఎంత మేరకు ఆసక్తి చూపుతారు, మందుబాబుల నుంచి ఎలాంటి ఆదరణ ఉంటుంది, ప్రభుత్వం ఆశించినట్లుగా ఆదాయం ఏ మేరకు పెరుగుతుంది.. ఇలాంటివన్నీ కాలక్రమంలో తేలిపోనుంది.


Next Story

Most Viewed