సీఎం కేసీఆర్ సభకు లైన్ క్లియర్

by  |
CM KCR Haliya sabha
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ఈనెల 14న హాలియాలో సభ నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సభ రద్దు కోరుతూ రైతులతో పాటు పలు సంఘాలు వేసిన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. దీంతో సీఎం సభకు లైన్ క్లియర్ అయింది. సభ యథాతధంగా కొనసాగనుంది. సభకు లక్షమందిని తరలించి విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 14వ తేదీన హాలియాలో టీఆర్ఎస్ సభ నిర్వహించేందుకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను అనుమతుల్లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని దానికి అనుమతి ఇవ్వొద్దంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించగా కొట్టివేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లక్షమందితో సభకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రజారోగ్యం దృష్ట్యా రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్ కొలిశెట్టి శివ కుమార్ వినతిపత్రం అందజేశారు. కొవిడ్ దృష్ట్యా సభలు నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం 69 జీవోను జారీ చేసిందని, తిరిగి అధికారపార్టీయే హాలియాలో లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందని దానిని రద్దు చేయాలని కోరుతూ హెచ్చార్సీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీకి ఆదేశాలివ్వాలని కోరారు. అయితే 13న ఉగాది, 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవులు వచ్చాయి. దీంతో ఈ పిటిషన్‌పై ఎలాంటి విచారణ జరగలేదు.

ఏర్పాట్లలో టీఆర్ఎస్ శ్రేణులు

హాలియాలో ఈనెల 14న నిర్వహించే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం, తిరుమలగిరి, గుర్రంపోడ్, పెద్దవూర, నిడమనూరు, మాడ్గులపల్లి, హాలియా మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు ఇన్‌చార్జులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 600 మందికిపైగా తరలించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే ప్రజల తరలింపునకు వాహనాలకు అడ్వాన్సులు కూడా చెల్లించారు.

మాస్క్ మస్ట్…

కరోనా ఉధృతి నేపథ్యంలో సభకు వచ్చే ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించేలా చూడాలని సీఎం కేసీఆర్ ఈనెల 11న ఎన్నికల మండలాల ఇన్‌చార్జులకు సూచించారు. కరోనా నిబంధనలు పాటించకుండా సభ నిర్వహిస్తే అబాసు పాలవుతామని, ఇతరులు విమర్శించే అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. లక్ష మంది సభకు వస్తే లక్ష మంది మాస్కులు ధరించేలా చూడాలని, అవసరమైతే వారికి అందజేయాలని సీఎం ఆదేశించినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.



Next Story

Most Viewed