యూట్యూబ్ టీవీ యాప్.. మొబైల్ టు బిగ్‌స్క్రీన్!

by Disha Web Desk 2 |
యూట్యూబ్ టీవీ యాప్.. మొబైల్ టు బిగ్‌స్క్రీన్!
X

దిశ, ఫీచర్స్ : యూట్యూబ్ తమ వినియోగదారుల కోసం 'యూట్యూబ్ టీవీ' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది ఐవోఎస్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌ నుంచి టీవీ స్క్రీన్‌‌కు వీడియోలను ప్రసారం చేసే విధానాన్ని మరింత సులభతరం చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా బిగ్‌ స్క్రీన్‌కు యూట్యూబ్‌ను కనెక్ట్ చేసి లైక్స్, షేర్స్ లేదా కామెంట్స్ చేసే అవకాశంతో పాటు షార్ట్ క్లిప్స్‌ను కూడా మెరుగైన క్వాలిటీతో వీక్షించే అనుభవాన్ని పొందవచ్చని యూట్యూబ్ పేర్కొంది.

సాధారణంగా స్మార్ట్ టీవీ లేదా ఫోన్‌లో యూట్యూబ్ వీక్షించగలిగినప్పటికీ కొంతమంది యూజర్లు తమ ఫోన్‌ల నుంచి టీవీ స్క్రీన్‌కు కంటెంట్‌ను ప్రసారం చేసేందుకు కాస్ట్ ఫీచర్‌ ఉపయోగిస్తుంటారు. అయితే ప్రసార సమయంలో వీక్షకులు యూట్యూబ్ వీడియోలకు ప్రతిస్పందించేందుకు, లింక్‌లను భాగస్వామ్యం చేసేందుకు లేదా సభ్యత్వం పొందేందుకు వారి ఫోన్‌లను ఉపయోగిస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు ప్రతిరోజూ టీవీలో 700 మిలియన్ గంటలకు పైగా YouTube కంటెంట్‌ చూస్తున్నారని తెలిసింది. కాగా ఆ ఇన్‌పుట్స్ అన్నీ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యూట్యూబ్‌ను ప్రేరేపించాయి. ఇకపై మొబైల్ పరికరంలో ఉన్న అనుభవాన్ని వినియోగదారులు తమ టీవీలో పొందగలరని ఈ ఫీచర్ నిర్ధారిస్తుంది.

ఈ మేరకు యూజర్లు వారి ఫోన్‌ నుంచే టీవీలో చూసే వీడియోతో నేరుగా ఇంటరాక్ట్ కావచ్చు. వీడియో డిస్క్రిప్షన్ చదవడం, కామెంట్‌ చేయడం, వీడియోను ఎవరికైనా షేర్ చేయడం లేదా ఇష్టమైన క్రియేటర్స్‌కు సూపర్ చాట్ పంపడం లేదా మెంబర్‌గా ఉండటం ద్వారా సపోర్ట్ చేయడం సులభమని యూట్యూబ్ చెబుతోంది. అంతేకాదు ఈ టీవీ యాప్‌కు మరిన్ని ఫీచర్లను జోడించాలని కూడా యోచిస్తున్న యూట్యూబ్.. వీడియో వ్యూయింగ్ పేజీ కోసం 'కొత్త డిజైన్స్' పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ ఫీచర్‌ ఉపయోగించేందుకు మీరు టీవీ, ఫోన్‌లోని YouTube యాప్‌కు లాగిన్ చేయాలి. మీ టీవీలో యాప్‌ను తెరిచి, ఆపై మీ ఫోన్‌లో యూట్యూబ్ యాప్‌ తెరవాలి. అక్కడ మీరు కనెక్ట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు.

Next Story

Most Viewed