ఫిజికల్ యాక్టివిటీస్‌కు సమయం లేదా?.. అయితే ఇలా చేయండి

by Disha Web Desk 10 |
ఫిజికల్ యాక్టివిటీస్‌కు సమయం లేదా?.. అయితే ఇలా చేయండి
X

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో అనేక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాల్లో ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం ఒకటి. బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామం చేసే సమయం లేదని కొందరు చెప్తుంటారు. ముందురోజు వర్క్‌లోడ్ ఎఫెక్ట్‌తో మరుసటి రోజు పొద్దున్న లేవడం కుదరడం లేదని మరికొందరు చెప్తుంటారు. ఇలా చెప్పడానికి కారణాలు, సాకులు ఎన్ని ఉన్నా శారీరక శ్రమలేని జీవన శైలి మాత్రం ప్రమాదకరమని ఫిట్‌నెస్ నిపుణులు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు ఇంట్రెస్ట్ ఉంటే ఫిజికల్ యాక్టివిటీస్ కోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, రోజువారీ పనులవల్ల కూడా సాధ్యమేనని నిపుణులు అంటున్నారు. అలాంటి ప్రత్యామ్నాయ శారీర శ్రమ కలిగి ఉండే మార్గాలేవో సూచిస్తున్నారు.

ఇంటి పనులు చేసుకోవచ్చు

ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి మనం తిన్న ఆహారాన్ని శక్తిగా, రక్తంగా మార్చడంలో దోహదపడతాయి. శారీరక శ్రమకు దూరంగా ఉండేవారిలో ఇటువంటి పరిస్థితి మందగిస్తుంది. ఈ కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలకు దారితీయడం జరుగుతూ ఉంటాయి. అందుకే ఏ రూపంలోనైనా సరే మీరు కచ్చితంగా శారీరక శ్రమను కలిగి ఉండాలని వైద్య నిపుణులు చెప్తుంటారు. తీరిక లేదనుకునేవారు తమకు తీరి ఉన్నసమయంలోనే ఇంటిలోని వివిధ పనులు చేసుకోవడం ద్వారా ఫలితం పొందవచ్చు. ఉదాహరణకు ఇల్లు తుడవడం, బూజు దులపడం, బట్టలు ఉతకడం, పాత్రలు కడగటం, గార్డెన్‌లో చెట్లకు నీరు పోయడం, కలుపు మొక్కలు తీసివేయడం వంటివి చేయవచ్చు.

మ్యూజిక్ వింటూనే చేయొచ్చు

కొందరికి ఎక్సర్ సైజ్ చేయడం, బయట రన్నింగ్ లేదా వాకింగ్‌కు వెళ్లడం ఇష్టంలేకపోవచ్చు. మరి కొందరు అదొక శ్రమగా, ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అలాంటివారు ఇంట్లోనే తగిన వ్యాయామాలు ఎంచుకోవచ్చు. బోర్ కొట్టకుండా మ్యూజిక్ వింటూనో, టీవీ చూస్తూనే నిలబడ్డదగ్గరే పరుగెత్తినట్లు చేయవచ్చు. నచ్చిన విధంగా డ్యాన్స్ చేయొచ్చు. దీనివల్ల కూడా గొప్ప శారీక శ్రమ లభిస్తుంది.

ప్రతీ సందర్భంలో వెహికల్ వాడకండి

ఇంటి చుట్టు పక్కల ఉన్న కిరణా కొట్టులకు వెళ్లాలన్నా కొందరు స్కూటీ వేసుకొని బయటకు వెళ్తుంటారు. నడిచి వెళ్లడం బద్దకంగా భావిస్తుంటారు. పాల ప్యాకెట్, వాటర్ బాటిల్, కూరగాయలు ఇలా ఏ వస్తువులు తేవడానికైనా సరే నడిచే వెళ్లండి. మీరు అపార్టుమెంట్స్‌లో నివసిస్తున్నట్లయితే లిఫ్టును వాడకండి. మెట్లపై నుంచి నడిచి వెళ్లడం, రావడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మంచి ఫిజికల్ యాక్టివిటీకి మీరు దగ్గరైనట్లే.

యోగా చేయండి

బయటకు వెళ్లి ఎక్సర్ సైజ్ చేసే సమయం, ఆసక్తి లేదనుకునేవారు ఇంటి పనులు, గార్డెనింగ్ వంటి పనులను కూడా ఇష్టపడని వారు కనీసం యోగా అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల మీలోని బద్దకం, మానసిక ఒత్తిడి దూరం అవుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అధిక బరువు సమస్యలు దూరం అవుతాయి.

Next Story

Most Viewed