3.5 అడుగులు ఉన్న మహిళ.. IAS అధికారిణిగా..

by Disha Web Desk 2 |
3.5 అడుగులు ఉన్న మహిళ.. IAS అధికారిణిగా..
X

దిశ, ఫీచర్స్ : కృషి ఉంటే మనుషులు బుుషులవుతారు అని పెద్దలు అంటుంటారు. అయితే మనం కలలు గనే జీవితం కోసం ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ఆ కలలను సహకారం చేసుకోవడంలో ప్రయత్నించే వారికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదని IAS అధికారి ఆర్తీ డోగ్రా మరోసారి నిరూపించారు. మనం ఇప్పటివరకు చాలామంది విజయాగాథలను వినే ఉంటాం. కానీ శారీరకంగా వికలాంగురాలైనప్పటికీ .. సమాజం తనను వెక్కిరించినా, పట్టించుకోకుండా.. కలలను నేరవేర్చుకోవడమే లక్ష్యంగా ఐఏఎస్ అధికారిణి ఆర్తి డోగ్రా చేసిన సాహసాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం.

* ఆర్తీ డోగ్రా ఎవరు?

ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌లో జన్మించిన ఆర్తీ డోగ్రా కేవలం 3.5 అడుగుల ఎత్తు మాత్రమే. కాగా ఆమె.. కల్నల్ రాజేంద్ర, పాఠశాల ప్రిన్సిపాల్ అయిన కుంకుమ్ డోగ్రాల కుమార్తె. అయితే ఆమె తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ.. తనకు మద్దతుగా నిలిచారు. ఆర్తి పుట్టినప్పుడు.. వైద్యులు ఆమెను సాధారణ పాఠశాలలో చేర్చవద్దని చెప్పారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా వాటిని అధిగమించి, డోగ్రా డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక బాలికల పాఠశాలలో చేరింది. అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని.. లేడీ శ్రీ రామ్ కాలేజ్, ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా సంపాదించింది.

* ఆర్తీ డోగ్రా IAS అధికారి కావడానికి అన్ని అవకాశాలను అధిగమించింది

బాల్యం నుండి శారీరక వివక్షను ఎదుర్కొన్న ఆర్తీ డోగ్రా.. ఎప్పుడు లో గా ఫీల్ కాకుండా.. 2005లో AIR-56తో తన మొట్ట మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించింది. అయితే 3 అడుగుల, 5-అంగుళాల పొడవున్న మహిళ భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష UPSCలో ఉత్తీర్ణురాలుగా నిలవడం ఇదే మొదటిసారి. కాగా ఆమె రాజస్థాన్ కేడర్ 2006 బ్యాచ్‌కి చెందినది. ఇక అక్కడి నుంచి అంకితమైన ప్రజాసేవకురాలిగా ఆమె ప్రయాణం మొదలైంది. ఇక అప్పటి నుంచి వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు.. డిస్కామ్ (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) జోధ్‌పూర్-జోధ్‌పూర్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా పనిచేసిన మొట్టమొదటి మహిళా IAS అధికారిణి నిలిచింది.

* విభిన్న వ్యక్తుల-కేంద్రీకృత కార్యక్రమాలలో భాగం

పరిపాలనలో తన కెరీర్ ప్రారంభం నుంచి, బికనీర్ జిల్లా కలెక్టర్‌గా ఆర్తి బహిరంగ మలవిసర్జన రహిత సమాజాన్ని రూపొందించడానికి 'బ్యాంకో బికానో' ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛత మిషన్.. ప్రజలలో ప్రవర్తన, ఆలోచనా విధానంపై దృష్టి సారించారు. ఇక అనంతరం ఆమె పనిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ప్రధాని మోదీ ప్రశంసలు కూడా పొందింది. కాగా ఆమె రక్తహీనతకు వ్యతిరేకంగా 'మా' వంటి ఇతర పథకాలను కూడా ప్రారంభించారు. దీంతోపాటు బికనీర్ DMగా ఉన్నప్పుడు.. డాటర్స్ ఫర్ డాటర్స్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఆసుపత్రుల్లో జన్మించిన అనాథ, పేద, నిస్సహాయ ఆడపిల్లలను దత్తత తీసుకోవాలని వైద్యులను ప్రోత్సహించింది.

* IAS ఆర్తీ డోగ్రా అవార్డులు, గుర్తింపులు

ఆర్తీ డోగ్రా 2018లో జరిగిన అజ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల అధికారిగా అందించిన సేవలకు గాను, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి 2019లో జాతీయ అవార్డును అందుకుంది.

* లక్షలాది మందికి స్ఫూర్తి

ఆర్తీ డోగ్రా తన పదవీ కాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. ఇక ప్రస్తుతం ఆర్తి రాజస్థాన్‌లోని అజ్మీర్ కలెక్టర్‌గా ఉన్నారు. అయితే 3.5 అడుగుల ఎత్తు ఉన్నందుకు వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆర్తీ డోగ్రా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచింది. మనం ఎలా జన్మించామన్నది ముఖ్యం కాదు.. జన్మించాక ఏం సాధించామన్నది ముఖ్యం అని చాటి చెప్తోంది.



Next Story

Most Viewed