పదేళ్లకు కనిపించిన అరుదైన హమ్మింగ్ బర్డ్

by Disha Web Desk 16 |
పదేళ్లకు కనిపించిన అరుదైన హమ్మింగ్ బర్డ్
X

దిశ, ఫీచర్స్ : కొలంబియాలోని సియెర్రా నెవాడా డి శాంటా మార్టా పర్వతాల్లో సంచరించే పెద్ద హమ్మింగ్‌బర్డ్ 'శాంటా మార్టా సాబ్రూవింగ్' చివరిసారిగా 2010లో కనిపించింది. ఇవి నివసించే ఉష్ణమండల అడవులను సాగు కోసం వాడుకోవడంతో ఆవాసం కోల్పోయిన ఈ పక్షులు ఎటో వెళ్లిపోయాయి. దశాబ్ద కాలంగా కనిపించకపోయేసరికి ఈ జాతి అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు ఆందోళనచెందారు. అయితే ఈ అరుదైన హమ్మింగ్‌బర్డ్‌ను తాజాగా కొలంబియాలోని పక్షి పరిశీలకుడు గుర్తించడం విశేషం.

సియెర్రా నెవాడా డి శాంటా మార్టాలో స్థానిక పక్షులపై సర్వే కోసం పలు పరిరక్షణ సంస్థలతో కలిసి పనిచేస్తున్న శాస్త్రవేత్త 'యుర్గెన్ వేగా' తొలిసారిగా హమ్మింగ్‌ బర్డ్‌ను గుర్తించినపుడు దాన్ని కెమెరాలో బంధించి సంబరాలు చేసుకున్నట్లు వెల్లడించాడు. నిజానికి ఈ జాతి పక్షులను 1946, 2010లో మాత్రమే డాక్యుమెంట్ చేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు క్యాప్చర్ చేయగలిగారు. ఇది మిగతా ఆవాసాలను రక్షించడంలో సాయపడుతుందని, అక్కడ కనిపించే అనేక విభిన్న జాతులకు ప్రయోజనం చేకూరుస్తుందని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా వన్యప్రాణులకు నిలయమైన ఈ ప్రాంతంలోని 24 పక్షి జాతులు మరెక్కడా కనిపించవు.

'IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పైసెస్'.. శాంటా మార్టా సాబ్రూవింగ్‌ను అంతరించిపోతున్న టాప్ 10 పక్షుల 'మోస్ట్ వాంటెడ్' జాబితాలో చేర్చింది. నిజానికి ఈ పక్షి అత్యంత అరుదైనదే కాదు, అంతుచిక్కనిది కూడా. పచ్చని ఈకలు, ప్రకాశవంతమైన నీలిరంగు దేహం గల ఈ పక్షి మగది. వీటిని బాగా అర్థం చేసుకునేందుకు మరింత పరిశోధన అవసరం. ఎందుకంటే మనకు అర్థం కాని జీవులను సంరక్షించడం సాధ్యం కాదు. అందువల్ల తదుపరి దశలో ఈ జాతి పక్షుల జనాభా గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం తప్పనిసరిగా స్థానిక సంఘాలు, ప్రాంతీయ పర్యావరణ అధికారులు మాకు సహకరించాలి. కలిసి పరిశోధించినపుడే నిజమైన ప్రభావాన్ని చూపగలుగుతాం. తద్వారా పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు.

- యుర్గెన్ వేగా

Next Story

Most Viewed