శని గ్రహంపై అదృశ్యమవుతున్న వలయాలు.. కారణం ఏంటో తెలుసా?

by Disha Web Desk 10 |
శని గ్రహంపై అదృశ్యమవుతున్న వలయాలు.. కారణం ఏంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : శనిగ్రహంపై ఉండే అద్భుతమైన వలయాలు క్రమంగా అదృశ్యమవుతున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, కోతలకు గురవడం మూలంగా ఇవి కనుమరుగవుతున్నాయి. ఈ పరిస్థితి దాని విశ్వ గుర్తింపు సంక్షోభాన్ని మరింత తీవ్ర తరం చేసే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. అయితే అదృశ్యం అవుతున్న ఈ వలయాలు గ్రహశకలాలు, తోకచుక్కలు లేదా పగిలిపోయిన చంద్రుల ముక్కల నుంచి ఏర్పడి ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అవి గ్రహం యొక్క బలమైన గురుత్వాకర్షణతో నలిగిపోవడంతో గ్రహంలోకి చేరుకోవడానికి ముందు విడిపోయి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని వలయాల కణాలు చిన్నపాటి రేణువుల సైజు మొదలు ఒక ఇంటి నిర్మాణం అంత పెద్ద భాగాల వరకు ఉంటాయి. మరి కొన్ని కణాలు పర్వతాల లాగా పెద్దవిగానూ ఉంటాయని నాసా పేర్కొన్నది. అక్కడి పరిస్థితిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో నాసా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

భూమి నుంచి దాదాపు 1.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న శని గ్రహం(Saturn), ఖగోళ శాస్త్రజ్ఞులను ఎల్లప్పుడూ దాని అందమైన వలయాలతో మంత్రముగ్దులను చేస్తూ ఉంటుంది. భారీ పరిమాణంలో ఉండే ఈ గ్రహం భూమి కంటే 9 రెట్లు వెడల్పుగా ఉంటుంది. అయితే.. ప్రస్తుతం ఇక్కడి అద్భుతమైన వలయాలు ప్రమాదంలో ఉన్నాయని, నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. తరచుగా కురుస్తున్న భారీ వర్షంతో కోతలకు గురవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. అయితే వలయాలు ఎంత వేగంగా క్షీణిస్తున్నాయో గుర్తించడానికి తాము ప్రయత్నిస్తున్నామని పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ జేమ్స్ ఓ డోనోగ్ తెలిపారు. ఇక్కడి వలయాలు మొదటి నుంచి ఈ గ్రహానికి సంబంధించిన ఒక భాగమని అందరూ నమ్ముతూ వచ్చారు. కానీ ఇది వాస్తవం కాదని, అవి కేవలం 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవని సైంటిస్టులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed