డబ్బు ఖర్చు పెట్టడం వారికి తెలియదా?.. ఇప్పటికీ కొనసాగుతున్న మూసధోరణులు

by Disha Web Desk 10 |
డబ్బు ఖర్చు పెట్టడం వారికి తెలియదా?.. ఇప్పటికీ కొనసాగుతున్న మూసధోరణులు
X

దిశ, ఫీచర్స్: ‘‘వాళ్ల చేతికిస్తే డబ్బులిస్తే వృథా చేస్తారు. ఎలా ఖర్చు పెట్టాలో అస్సలు తెలియదు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే తెలివి వారికెక్కడిది. అయినా డబ్బు, సంపాదన, ఖర్చుల గొడవ వాళ్లకెందుకు ఇంటిపని, వంటపని సరిగ్గా చూసుకుంటే చాలు’’ భారతీయ కుటుంబాల్లో ఇప్పటికీ వినిపిస్తున్న మాటలివి. పితృస్వామ్య భావజాలానికి, మహిళలను ఇంటికే పరిమితం చేసే పురుషాధిక్యతకు ఈ ధోరణి నిలువెత్తు నిదర్శనమని స్త్రీ వాదులు అంటున్నారు. కిరణ్ మజుందార్-షా, సుధా మూర్తి, ఇంద్రా నూయి, ఫల్గుణి నాయర్ వంటి మహిళలు సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నా.. వర్కింగ్ ఉమెన్ గొప్ప నైపుణ్యాన్ని కనబరుస్తున్నా.. మహిళలకు ఆర్థిక లావాదేవీలు చేతకాదని, డబ్బును హాండిల్ చేసేంత సమర్థులు కాదనే సంప్రదాయ మనస్తత్వం కొనసాగడం బాధాకరం. కాగా ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇండిపెండెంట్‌గా ఉంటున్నారా?

వర్కింగ్ ఉమెన్ అందరూ ఆర్థిక విషయాల్లో ఇండిపెండెంట్‌గా ఉంటున్నారని చాలామంది అనుకుంటారు. కానీ ఇదొక సాధారణ అపోహ మాత్రమే అంటున్నారు స్త్రీ వాదులు. మహిళలు సొంతంగా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ ఖర్చులు, లావాదేవీలు మాత్రం భర్త, తండ్రి లేదా కుటుంబ సభ్యుల్లోని పురుషుల్లో ఎవరో ఒకరు చూస్తుండటం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్తున్నారు. సొంత బ్యాంక్ ఎకౌంట్స్, సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కలిగి ఉన్న మహిళలు తమ డబ్బుతో తాము ఏం చేయాలనేది సొంతంగా నిర్ణయించుకున్నప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నట్లు లెక్క. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతోందని సామాజిక వేత్త నీరజ కిరణ్ అంటున్నారు. మెజారిటీ ఇండ్లల్లో స్త్రీలు ఆర్థికంగా వ్యవహారాలు నిర్వహించగల సమర్థులు కాదని పురుషులు, సమాజం భావించగల మూసధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. దీనివల్ల ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని తమ కుటుంబాల్లోని స్త్రీలకు ఇవ్వకుండా పురుషులే పెత్తనం చలాయిస్తుంటారు.

ఫైనాన్షియల్ డెసిషన్స్

రీసెంట్ సర్వే ప్రకారం.. ఆల్‌మోస్ట్ 67% శ్రామిక మహిళలు ఫైనాన్షియల్ డెసిషన్ కోసం తమ కుటుంబ సభ్యులపైనే డిపెండ్ అవుతున్నారు. సగానికంటే ఎక్కువమంది స్త్రీలు కేవలం తమ వ్యక్తిగత లేదా సొంత ఖర్చులకు సంబంధించిన విషయంలోనే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా అరుదుగా 1/4 వంతు వర్కింగ్ ఉమెన్స్ మాత్రమే స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే అత్యధిక మంది తమ కుటుంబాల్లోని పురుషులపైనే ఆధారపడి ఉంటున్నారు. కుటుంబాన్ని చూసుకునే బాధ్యత స్త్రీలది, ఆర్థిక వ్యవహారాల బాధ్యత పురుషులది అనే మూస ధోరణి మాత్రమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

అలుసిస్తే అంతేమరి!

స్త్రీలకు ఆర్థిక విషయాల్లో అలుసిస్తే వారు చెడిపోతారు లేదా కుటుంబం రోడ్డున పడుతుందనే వెటకారాలు, మూసధోరణలు మనం అనేక సినిమాల్లోనూ చూస్తున్నాం. బయట వింటున్నాం. సోషల్ మీడియా మీమ్స్ కూడా ఇటువంటి అపోహలను మరింత పెంచుతున్నాయి. మహిళలు అనుకోకుండా ఏదో ఒక దుబార ఖర్చు చేస్తారనే విషయాలు మాత్రమే ఎక్కుమంది నమ్మేలా ప్రచారంలో ఉంటున్నాయి. కానీ చారిత్రాత్మకంగా ఈ ధోరణి తప్పు అని నిరూపించబడిందని మహిళా నిపుణులు, ఆర్థిక వేత్తలు చెప్తున్నారు. ‘‘నిజానికి భారతీయ మహిళలకు ఎప్పటినుంచో డబ్బు ఆదా చేసే అలవాటు ఉంది. క్వాలిటీ ప్రొడక్ట్స్‌ను ఉత్తమ ధరకు ఎలా పొందాలో, తమవద్ద ఉన్న వాటితో మంచి జీవితాన్ని ఎలా గడపాలో వారికి పురుషులకంటే బాగా తెలుసు’’ అంటున్నారు ఎకనామిక్స్ ఫ్రొఫెసర్ సరయూ భట్. మనలో చాలా మంది భారతీయ మహిళలు పోపు డబ్బాల్లో , బియ్యం లేదా గోధుమ పాత్రల్లో డబ్బు ఆదా చేయడం చూడలేదా? కానీ ఇటువంటి విషయాలను పురుషాధిక్య సమాజం అంగీకరించకుండా మహిళలను బలహీనులుగా చేసే మూస ధోరణులకే ప్రాధాన్యం ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు మోడర్న్ మహిళలు.

సోషల్ కండిషనింగ్

స్త్రీలు ఇంటి పనితోపాటు ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడంలో సమర్థవంతంగా ఉంటున్నప్పటికీ, భారీ పెట్టుబడుల విషయంలో లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ అంతసీన్ ఉండదని పురుషులు విశ్వసిస్తుంటారు. అంటే ఇక్కడ మూస ధోరణితో కూడిన సోషల్ కండిషనింగ్, జెండర్‌ రోల్ కీలకపాత్ర పోషిస్తుందన్నమాట. సంప్రదాయ లేదా పితృస్వామిక ధోరణి ప్రకారం.. స్త్రీలు ఉద్యోగం చేసినా, సంపాదించినా కేవలం ఇంటి ఖర్చులకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే పరిమితం కావాలి. ఇలా ఎంత కాలం అనేది ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు సామాజికవేత్తలు. ఆర్థిక విషయాల్లో మహిళలకు తెలివి ఉండదనే పురుషహంకార భావజాలం పితృస్వామ్య నిబంధనల నుంచి వచ్చిందని ఆధునిక మహిళలు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి స్త్రీలు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా ఉంటారని చెప్తున్నారు. ‘‘ఇంటిపని చేయడం, కుటుంబాన్ని చూసుకోవడం, పిల్లల్ని కనడం ఒకప్పుడు అవసరం అయ్యుండవచ్చు లేదా అణచివేత భావజాలంలోంచి ఆ విధమైన నిబంధనలు పుట్టుకొచ్చి ఉండవచ్చు. మరి 2023లోనూ అవే ఎందుకు కొనసాగాలి?’’ అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ స్త్రీవాది ప్రొఫెసర్ సంహిత. సమాజంలో నాటుకుపోయిన పాతకాలపు ధోరణులను విడనాడాలని, ఆర్థిక వ్యవహారాల్లో స్త్రీల బాధ్యతలు పెరిగినప్పుడే అన్ని విషయాల్లో సమానత్వం సాధ్యం అవుతుందని చెప్తున్నారు.

Also Read: పేరెంట్స్‌కు దూరంగా పెరిగే పిల్లల్లో ఆత్మ విశ్వాసం తక్కువ.. అధ్యయనంలో వెల్లడి

Next Story

Most Viewed