గురక‌తో పెరుగుతున్న రిస్క్ .. స్లీప్ అప్నియా దశలో గుండెపోటు వచ్చే చాన్స్!

by Dishafeatures2 |
గురక‌తో పెరుగుతున్న రిస్క్ .. స్లీప్ అప్నియా దశలో గుండెపోటు వచ్చే చాన్స్!
X

దిశ, ఫీచర్స్ : గురక.. వినడానికి ఇదొక సాధారణ సమస్యగానే అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఎందుకంటే దానితీవ్రమైన దశ ‘స్లీప్ అప్నియా’ బాధితుల్లో కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్ తలెత్తుతాయని, అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చే చాన్సెస్ ఉన్నాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలకు, గురకకు మధ్య గల సంబంధాన్ని నిపుణులు వెల్లడించారు.

బాధితుల్లో 10 శాతం యువతే

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా పలువురిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గురక కూడా ఉంది. 30 ఏండ్లలోపు వయస్సు యువతలో దాదాపు 10 శాతం మంది, అలాగే 60 ఏండ్ల వయస్సు దాటిన వారిలో 59 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. నిద్రపోయే సమయంలో శ్వాసలో ఇబ్బంది తలెత్తుతుంది. అందుకే ఊపిరి పీల్చుకోవడం, వదలడం వంటి ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఒక విధమైన సౌండ్ వస్తుంది. అయితే ఇది బాధితుల మెడ, తల భాగాలల్లోని మృదు కణజాలంలో వైబ్రేషన్స్ వల్ల తలెత్తుతుందని నిపుణులు చెప్తున్నారు. అలసటగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ గురకపెట్టే అలవాటు ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుందని, బాధితుల్లో స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని 46 శాతం పెంచుతుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇది మద్యపానం, ధూమపానం వంటి బ్యాడ్ హాబిట్స్ కంటే కూడా డేంజర్ అని నిపుణులు చెప్తున్నారు.

గుండె జబ్బులకు కారణం

దీర్ఘకాలంపాటు కొనసాగు గురక సమస్య స్లీప్ అప్నియా అనే రుగ్మతకు దారితీస్తుంది. దీనివల్ల బాధితుల్లో గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అంతేకాకుండా మిగతా వారితో పోల్చితే స్లీప్ అప్నియా బాధితుల్లో డయాబెటిస్ వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు హపర్ టెన్షన్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి, గుండెల్లో మంట వంటి రోజువారి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. కాబట్టి గురక సమస్య ఉన్నవారు మొదట్లోనే జాగ్రత్త పడాలి. ప్రతి రోజూ శారీక శ్రమ కలిగి ఉండటం, ఆరోగ్య కరమైన జీవన శైలిని అలవర్చుకోవడం, అధిక బరువు తగ్గడం వంటివి సమస్యను మొదటి దశలో నివారిస్తాయి. అయినా తగ్గకపోతే వైద్య నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.


Next Story

Most Viewed