దెయ్యాల ఆవాసంగా భాంగర్ కోట.. సాధువు, తాంత్రికుడు ఎవరి శాపం కారణం..

by Disha Web Desk 20 |
దెయ్యాల ఆవాసంగా భాంగర్ కోట.. సాధువు, తాంత్రికుడు ఎవరి శాపం కారణం..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో అనేక అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాల్లో అంతుచిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి కట్టడాల్లో కొన్ని యునెస్కో గుర్తింపును పొంది పర్యాటకులను ఆకర్షిస్తే, మరికొన్ని కట్టడాలు మాత్రం దయ్యాలకు ఆవాసంగా మారుతున్నాయి. అలాంటి ఒక కట్టడమే భాంగర్ కోట.

ఈ భంగర్ కోట రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని పచ్చని కొండల మధ్యలో ఉంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట పరిసరాల్లోని అందం పర్యాటకులని ఇట్టే ఆకర్షిస్తుంది. అంతే కాదు అద్భుతమైన వాస్తుశిల్పానికి ఇది ప్రసిద్ధి చెందింది. అయితే ప్రస్తుతం ఈ కోట హంటెడ్ కోటగా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పగటిపూట కోటను సందర్శించేందుకు వచ్చే వారికి ఇక్కడ ఒక తాంత్రికుడి అరుపులు, ఒక మహిళ సహాయం కోసం వేడుకోమనే ఆర్తనాదాలు, గాజుల శబ్ధాలు వినిపిస్తూ ఉంటాయట.

భంగర్ కోటను 17వ శతాబ్దంలో రాజా మధో సింగ్ నిర్మించారు. ఈ మాధో సింగ్.. అంబర్ మొఘల్ కమాండర్ మాన్ సింగ్ కు తమ్ముడు. ఈ భాంగర్ లో రాజభవనం కాకుండా 1720 నాటికి 9,000 కంటే ఎక్కువ ఇళ్లు ఉండేవి. ఆ తర్వాత జనాభా క్రమంగా క్షీణించింది. కోట ప్రాంతంలో ఎన్నో భవనాలు, దేవాలయాలు, ఎడారి మార్కెట్ల అవశేషాలు చూడవచ్చు. ఇది కోట సంపన్న రోజులను సూచిస్తుంది. నేడు ఈ కోట దెయ్యాల కోటగా పరిగణిస్తారు.

సాధువు శాపం కారణంగా నాశనమైన నగరం..

కోటలో కనిపించే అందమైన సహజ దృశ్యాలు మాత్రమే కాకుండా హాంటెడ్ కథనాలు కూడా పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. దెయ్యాల కారణంగా ఇక్కడికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పర్యాటకులకు అనుమతించరట. కోట గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కథలలో రెండిటిని రాజస్థాన్ పర్యాటక వెబ్‌సైట్‌లో ప్రస్తావించారు. ఇవి స్థానిక జనాభాలో బాగా ప్రాచుర్యం పొందాయి.

మొదటి కథ బాబా బలౌ నాథ్ అనే సాధువుకి సంబంధించినది. ఈ కథనం ప్రకారం రాజా మధో సింగ్ భంగర్ కోటను నిర్మించడానికి చాలా కాలం ముందు బాబా బలౌ నాథ్ సమీపంలో ధ్యానం చేసేవారు. కోటను నిర్మించాలని నిర్ణయించినప్పుడు, ఋషి రాజు ముందు ఒక షరతు పెట్టాడు. భాంగర్ కోట లేదా దాని లోపల ఉన్న ఏదైనా భవనం తన ఇంటి కంటే ఎత్తుగా ఉండకూడదనే షరతుపై బాబా బాలౌ భంగర్‌లో కోటను నిర్మించడానికి అనుమతి ఇచ్చారు. దీంతో పాటు ఏదైనా నిర్మాణం నీడ సన్యాసి ఇంటి పై పడితే కోటలో ఉన్న నగరం మొత్తం నాశనం చేస్తానని చెప్పాడట. మధో సింగ్ మనవడు అజబ్ సింగ్ ఈ హెచ్చరికను పట్టించుకోకుండా కోట ఎత్తును బాగా పెంచాడని చెబుతారు. ఫలితంగా ఋషి ఇంటి పై కోట నీడ పడి నగరం మొత్తం నాశనం అయ్యిందని చెబుతారు.

అందమైన యువరాణి పై తాంత్రికుడికి కన్ను..

భాంగర్ దెయ్యాల కోట కథల్లో మరొకటి యువరాణి రత్నావతికి సంబంధించినది. యువరాణి రత్నావతి చాలా అందంగా ఉండేదట. ఆమెకు దేశంలోని రాజ కుటుంబాల నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారట. చేతబడి, తాంత్రిక విద్యచేసే ఓ మాంత్రికుడు యువరాణి ప్రేమించడం మొదలు పెట్టాడట. ఒకరోజు యువరాణి తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి పరిమళాన్ని కొనుక్కోవడం తాంత్రికుడు చూశాడు. యువరాణి ఖరీదు చేసే పరిమళంలో తాంత్రికుడు ప్రేమ కషాయంతో భర్తీ చేశాడు. ప్రేమ కషాయం అనే మాయా ద్రవంతో ఎదుటివారి పై ప్రేమ భావనను పెంపొందుతుందని చెబుతారు.

అయితే తాంత్రికుని ఉపాయాలను ముందే తెలుసుకున్న యువరాణికి ఆ పరిమళాన్ని దగ్గర్లోని ఒక పెద్ద రాయి పై విసిరేసింది. ద్రవం మాయాజాలం కారణంగా పెద్ద రాయి మాంత్రికుడి వైపునకు వెళ్లడం మొదలుపెట్టిందట. తర్వాత ఆ తాంత్రికుడు రాయి కింద పడి నలిగి చనిపోయాడని చెబుతారు. చనిపోయే ముందు తాంత్రికుడు నగరాన్ని శపించాడని, నగరం నాశనమై అక్కడ ఎవరూ జీవించరని అన్నాడట. ఆ తరువాత కొంత కాలానికి మొఘల్ సైన్యం రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని యువరాణి రత్నావతితో సహా కోట నివాసులందరినీ చంపింది. హత్యకు గురైన వ్యక్తుల ఆత్మలు ఇప్పటికీ రాత్రిపూట భంగర్ కోటలో సంచరిస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. చాలా మంది కోటలో వస్తున్న వింత శబ్దాలను వింటారని పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed