టేప్‌కు మూడున్నర లక్షలా?.. ఎందుకంత కాస్ట్ ? (వీడియో)

by Dishafeatures2 |
టేప్‌కు మూడున్నర లక్షలా?.. ఎందుకంత కాస్ట్ ? (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : వివిధ సరుకులు, గిఫ్టులు ప్యాక్ చేసేటప్పుడు అతికించడానికి వాడే టేప్‌ను మీరు చూసే ఉంటారు. రౌండ్‌గా చుట్టబడి ఉండే ఒక్క టేప్ (రోల్) ధర మహా అయితే రూ. 30 నుంచి రూ.40 వరకు ఉంటుంది. కానీ ఒక ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ తయారు చేసిన ఒక్క టేప్ రోల్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే దాని ధర అక్షరాలా రూ. 3,34,949. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ లగ్జరీ బ్రాండ్ బాలెన్‌సియాగా (Balenciaga) మరో అద్భుతమైన క్రియేషన్‌తో ముందుకు వచ్చింది. 2024 పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా అది తన కస్టమర్లను, ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునే ఉద్దేశంతో ఒక సరికొత్త బ్రాస్‌లెట్‌ను ప్రారంభించింది. అయితే ఇది అచ్చం ప్యాకింగ్ టేప్ రోల్ మాదిరిగా ఉండటంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఐకానిక్ బాలెన్ సియాగా లోగోతో ఉన్న ఈ బ్రాస్‌లెట్ వీడియో ఇప్పుడు టిక్‌టాక్, ఇన్‌స్టా గ్రామ్, ఎక్స్(ట్విట్టర్) తదితర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.

బాలెన్‌సియాగా విడుదల చేసిన ఒక్క బ్రాస్‌లెట్ (టేప్) ధర రూ. $4,000 (సుమారు రూ. 3,34,949) ఉండటంతో ఒక్క టేప్ ధర ఇంత ఉంటుందా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతోపాటు ఈ బ్రాండ్‌ను ఎగతాళి చేస్తున్నారు. గృహోపకరణాలను, అధిక ధర కలిగిన ఫ్యాషన్‌స్టేట్ మెంట్స్‌గా మార్చడానికే ఈ కుట్ర చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే బాలెన్‌సియాగా ఇలాంటి సంప్రదాయేతర డిజైన్లతో ముందుకు రావడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. గతంలో 790 డాలర్లు పలికే పర్సును కూడా రూపొందించి అభిమానులకు షాక్ ఇచ్చింది.


Next Story

Most Viewed