స్పర్శ కోసం తహ తహ.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న ఫిజికల్ టచ్

by Dishanational4 |
స్పర్శ కోసం తహ తహ.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న ఫిజికల్ టచ్
X

దిశ, ఫీచర్స్: శారీరక స్పర్శకు తహతహలాడటమే 'టచ్ స్టార్వేషన్(Touch starvation)'. దీన్ని 'స్కిన్ హంగర్' అని కూడా పిలుస్తారు. పార్ట్‌నర్స్, ఇతర వ్యక్తులతో ఫిజికల్ కాంటాక్ట్ లేనప్పుడు తలెత్తే ఈ పరిస్థితి వ్యక్తుల సంబంధాలు, ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇదేం రోగమని నవ్వుకున్నా.. స్కిన్ హంగర్ తీవ్రంగా కలిగిన వ్యక్తులు అధిక ఒత్తిడికి గురవడం, మాదకద్రవ్యాలకు అలవాటు పడటంతో పాటు నిరాశకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు హార్ట్ రేట్, రక్తపోటు పెరగడం నుంచి కండరాల్లో ఉద్రిక్తత, జీర్ణ & నిద్ర సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. కాగా ఈ వింత అనుభవం గురించి బాధితులు ఏం చెప్తున్నారు? బయటపడేందుకు నిపుణుల సలహాలేంటి?

మానవులు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్/ఫిజికల్ టచ్‌ కోసం పరితపించడం సహజమే. అయితే హగ్స్, షేక్ హ్యాండ్స్, హై-ఫైవ్స్, చేతితో పట్టుకోవడం, ముద్దులు, ఇంద్రియ స్పర్శ తదితర రూపాల్లో ఈ భౌతిక స్పర్శను అందుకోనప్పుడు 'టచ్ స్టార్వింగ్' అనుభూతి చెందుతారని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, Gen-Z థెరపిస్ట్‌ల ఫౌండర్ కృతికా గుప్తా తెలిపారు. ఇది తీవ్రతరమైతే అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఇక కోల్‌కతాకు చెందిన స్వాతి ఘోషల్ అనే కౌన్సెలింగ్ సైకాలజిస్ట్.. స్పర్శ ఆకలి గురించిన జీవసంబంధమైన కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. తల్లితో లేదా ఎవరైనా ప్రాథమిక సంరక్షకుడితో శిశువు బాండింగ్ ప్రాసెస్‌లో టచ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పెరిగే దశలో తగినంత శారీరక, భావోద్వేగ ఉద్దీపన పొందని శిశువులు బిహేవియరల్, ఎమోషనల్, సామాజిక సమస్యలను ఎదుర్కొనే అవకాశముందని గతంలో పరిశోధకులు సూచించిన విషయాన్ని ఘోషల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

నిజానికి శారీరక 'స్పర్శ' శృంగార సంబంధాల్లో అంతర్గతంగా ఉంటుంది కానీ ఇది సెక్స్‌కు మించినది. ఎందుకంటే 'ట్రెజర్' అనే యూకే ప్రొఫెషనల్ కడ్లర్ అందిస్తు్న్న హగ్గింగ్ సర్వీసుల గురించి వినే ఉంటారు. అతను ఒక గంట కౌగిలింతల సెషన్‌కు 75 పౌండ్లు వసూలు చేస్తున్నాడు. ఇది వింతగా అనిపించినప్పటికీ.. ప్రజలు స్పర్శ పట్ల ఆకలితో ఉన్నారని, దాన్ని తీవ్రంగా కోరుకుంటారనేందుకు ఇది స్పష్టమైన సాక్ష్యంగా నిలిచింది.

టచ్ స్టార్వేషన్ పరిష్కారానికి కొన్ని మార్గాలు :

* కమ్యూనికేషన్ : భాగస్వాములు ఒకరికొకరు స్పర్శను ఎలా కోరుకుంటున్నారో ఓపెన్‌గా చర్చించడం ద్వారా తమ రిలేషన్‌షిప్ మెరుగుపరుచుకోవచ్చు. వివిధ మార్గాల్లో శారీరక స్పర్శను అనుభవించిన తర్వాత.. ఉత్తమ అనుభూతిని కలిగించి, బంధాన్ని మరింత బలపరిచే మార్గాన్ని ఎంచుకోవచ్చు.

* సమయాన్ని కలిసి షెడ్యూల్ చేసుకోవాలి : ఊపిరి సలపని పనులు, ఇతరత్రా పరిమితుల కారణంగా శారీరకంగా ఒకేదగ్గర ఉండలేని జంటలు రోజుకోసారి కనీసం వీడియో కాల్‌లో మాట్లాడుకునేందుకు ప్రయత్నించాలి. దృష్టిని ప్రభావితం చేసే ఈ చర్యలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. భాగస్వామితో కనెక్ట్ అయ్యేందుకు ఇది సాయపడవచ్చు. ఇలాంటివారు వీలైతే నెలకొకసారి కలుసుకునేందుకు షెడ్యూల్ చేసుకోవాలి.

* పెట్‌ను దత్తత తీసుకోవాలి : టచ్ స్టార్వేషన్ అనుభవిస్తున్న వ్యక్తులు పెంపుడు జంతువును దత్తత తీసుకోవచ్చు. ఎందుకంటే పెంపుడు జంతువును తాకడం వల్ల స్పర్శకు సంబంధించిన ప్రేరణ లభిస్తుంది. ఇది మంచి అనుభూతిని ఇస్తుంది.

* మూవ్‌మెంట్ : వ్యాయామం చేస్తున్నపుడు తమకు ప్రియమైనవారితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే స్పర్శ ప్రయోజనం చర్మం కదలికతో సంబంధం కలిగి ఉంటుంది. లేదా వ్యాయామం చేస్తూ పార్ట్‌నర్ లేదా ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడితే డీప్ కనెక్షన్‌ రూపొందించడంలో సహాయపడుతుంది.

* అటానమస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్(ASMR): ఇది కొంతమంది వ్యక్తులు ASMR వీడియోలను చూడటం ద్వారా పొందే ఆహ్లాదకరమైన అనుభూతిని సూచిస్తుంది. ఈ శబ్దాలు స్పర్శను ప్రాసెస్ చేసే మెదడులోని భాగాన్ని ప్రేరేపించడం ద్వారా ప్రశాంత, విశ్రాంతి భావాలను ప్రోత్సహిస్తాయి.

* గత స్పర్శ అనుభవాలు గుర్తుచేసుకోవాలి : పరిశోధన ప్రకారం జ్ఞాపకశక్తికి టచ్ ముఖ్యం. అందువల్ల ప్రజలు శారీరక సంబంధాన్ని కలిగి ఉన్న సమయాన్ని తిరిగి ఆలోచించగలరు. ఆ విధంగా ఇంద్రియాలపై దృష్టి పెట్టడం ద్వారా మునుపటి అనుభవాన్ని రీక్రియేట్ చేయొచ్చు.

Also Read : ప్రేమ చెరిపిన బంధాలు.. బిడ్డ కోసం తల్లిదండ్రుల ప్రయత్నాలు



Next Story

Most Viewed