ప్రపంచంలోనే అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ

by  |
LIC
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రపంచంలోనే బలమైన మూడో బీమా సంస్థ, పదో అత్యంత విలువైన బీమా బ్రాండ్‌గా నిలిచింది. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెలువరించిన ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్-100 అత్యంత విలువైన బీమా బ్రాండ్ల మొత్తం విలువ 2020లో రూ. 34.2 లక్షల కోట్ల నుంచి 6 శాతం తగ్గి 2021లో రూ. 32 లక్షల కోట్లకు చేరుకుంది. ‘ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా బీమా కంపెనీలు డీలాపడ్డాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, తక్కువ వడ్డీ రేట్ల ప్రభావంతో బీమా రంగం దెబ్బతిన్నది.

అయితే, ప్రపంచంలోని అగ్ర బీమా సంస్థలు స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ మహమ్మారిని ఎదుర్కొని కొనసాగుతున్నాయని’ బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ డెక్లాన్ అహెర్న్ చెప్పారు. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. ఎల్ఐసీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 6.8 శాతం పెరిగి రూ. 64 వేల కోట్లకు చేరుకుంది. కాగా, టాప్ 10 జాబితాలో ఎక్కువగా చైనాకు చెందిన బీమా కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అమెరికాకు చెందిన రెండు కంపెనీలు, ఫ్రాన్స్, జర్మనీ, భారత్ నుంచి ఒక్కో బీమా సంస్థ స్థానం సంపాదించాయి. ఇక అత్యంత విలువైన బీమా సంస్థల జాబితాలో మొదటిస్థానంలో చైనాకు చెందిన పింగ్అన్ ఇన్సూరెన్స్ 44 బిలియన్ డాలర్లను కలిగి ఉంది. అలాగే, చైనాకే చెందిన మరో సంస్థ చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 22 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జర్మనీ అలియాంజ్, ఫ్రాన్స్ నుంచి ఆక్సా సంస్థలు ఉన్నాయి.

ఇదే నివేదిక ప్రపంచంలోనే బలమైన బీమా సంస్థల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో మన ఎల్ఐసీ మూడో స్థానంలో ఉంది. తొలిస్థానంలో ఇటలీకి చెందిన పోస్టే ఇటీలియన్, తర్వాత స్పెయిన్ మ్యాప్‌ఫ్రే, చైనా పింగ్అన్ ఇన్సూరెన్స్, దక్షిణ కొరియా శామ్‌సంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇటలీ యూనిపోల్ సయి, యూఎస్ అఫ్లాక్, యూకే హిస్‌కాక్స్, దక్షిణాఫ్రికా ఓల్డ్ మ్యూచువల్, అమెరికా ప్రోగ్రెసివ్ కార్పొరేషన్ సంస్థలు ఉన్నాయి.



Next Story

Most Viewed