ఐడియా అదిరింది.. రిఫ్రిజిరేటర్‌లో పుస్తకాల లైబ్రరీ!

by  |
ఐడియా అదిరింది.. రిఫ్రిజిరేటర్‌లో పుస్తకాల లైబ్రరీ!
X

దిశ, ఫీచర్స్ : ‘పుస్తకంలేని గది ఆత్మలేని శరీరం వంటిది’ అనే మాటల్లో నిజం లేకపోలేదు. పుస్తకాలు ప్రపంచాన్ని మన ముందుంచడమే కాదు.. మనిషి మేధను, ఊహాశక్తిని కూడా పెంచుతాయి. అందుకే ప్రతీ గ్రామానికో గ్రంథాలయం ఉండే ఉంటుంది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో గ్రంథాలయాలన్నీ ఈ-లైబ్రరీలుగా రూపం దాల్చుకుంటుండగా, ఇప్పటికీ వాటికున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదన్నది వాస్తవం. ఈ క్రమంలోనే ‘స్ట్రీట్ లైబ్రరీ, లైబ్రరీ ఆన్ వీల్స్’ వంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా దక్షిణ కోల్‌కతా, పతులి గ్రామంలోని ఓ ఉపాధ్యాయుడు, అతని భార్య.. ‘రిఫ్రిజిరేటర్’‌ను పుస్తకాలతో నింపేసి మినీ లైబ్రరీగా మార్చేశారు.

కిరాణా దుకాణం వెలుపల ఒక ఫ్రిజ్ ఉండటం విశేషమేమీ కాదు కానీ, పతులి గ్రామంలోని ఫ్రిజ్ మాత్రం అన్నిటికంటే భిన్నం. ఎందుకంటే ఇది పాల ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ సీసాలతో నిండిపోలేదు. మొత్తం పుస్తకాలతో నిండిపోయి బుక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు బుక్ లవింగ్ కమ్యూనిటినీ (పుస్తక ప్రియమైన సమాజాన్ని సృష్టించడం) స్థాపనే లక్ష్యంగా స్థానిక ఉపాధ్యాయుడు, అతని భార్య.. దుకాణాదారుడితో కలిసి ఈ ‘లైబ్రరీ ఇన్ ఫ్రిజ్’‌ను ఏర్పాటు చేశారు. డిక్షనరీ, నవలలు, లిటరరీ మ్యాగజైన్స్(ఇంగ్లిష్, బెంగాలీ)తో పాటు మొత్తంగా 100 పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఆసక్తిగల పాఠకులు డైరీలో తమ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ఫిల్ చేసి పుస్తకాన్ని ఇంటికి తీసుకువెళ్లి, నెలరోజుల్లో తిరిగి ఇవ్వవచ్చు. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం పాఠకుడిదే.

‘కొవిడ్ మహమ్మారి వల్ల పిల్లల విద్యా వికాసంపై ప్రభావం చూపడంతో వారిని మళ్లీ పఠనం వైపు మళ్లించడానికి చేసిన ప్రయత్నమే ఇది. ఎక్కువ మంది రోజంతా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తెరల ముందే తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. వ్యాయామం మన శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తే, పఠనం మన మనసుకు వ్యాయామం లాంటిది. ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా కాలేజ్, పార్క్, మెయిన్ బజార్‌ అన్నింటికీ దగ్గరలో ఉన్న కిరాణా షాపును ఎంచుకున్నాను. అలా అందరి దృష్టి ఈ స్ట్రీట్ లైబ్రరీపై పడుతుందనుకున్నాను. పాత ప్రిజ్‌ను పుస్తకాలతో నింపేసి అక్కడ పెట్టాను. దాదాపు 45 వేల ఖర్చుతో అన్నిరకాల పుస్తకాలు కొనుగోలు చేశాను. నా భార్య, నా కొడుకు సైతం వారి వారి పాకెట్ మనీ అందించారు. చాలా మంది తమ దగ్గరున్న పుస్తకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం నా దగ్గర 1000 పుస్తకాలు ఉన్నాయి. రెస్సాన్స్ చాలా బాగుంది. ఇలాంటివి మరికొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నాను. నేను ఒక్కడినైనా సరే పుస్తకాన్ని చదవడానికి ప్రేరేపించగలిగితే, నా లక్ష్యం నెరవేరినట్లే’ అని హైస్కూల్ ఇంగ్లిష్ టీచర్ కాళిదాస్ హల్దార్ పేర్కొన్నాడు.



Next Story