సాగర్‌‌లో మునుగుతున్న ‘కామ్రేడ్స్’ సిద్ధాంతాలు

by  |
సాగర్‌‌లో మునుగుతున్న ‘కామ్రేడ్స్’ సిద్ధాంతాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎక్కడ ఏ కష్టమొచ్చినా.. ఎవరికి ఏ నష్టమొచ్చినా.. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదురించాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎర్రజెండాలే.. కానీ అధికార పార్టీలతో అదే జెండాలు అంటకాగితే.. అభాగ్యులు, అన్నార్థులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి. పార్లమెంటరీ వ్యవస్థలో ముందు వరుసలో ఉన్న సీపీఐ, సీపీఎంలు నాగర్జున సాగర్‌ ఎన్నికలతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అధికార టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపేందుకు తెగించిన నాయకత్వం తమ శ్రేణులకు ఏకంగా కేంద్ర, రాష్ట్ర కమిటీల బూచీని చూపెట్టడం మరో విశేషం.. ప్రజల పక్షాన మద్దతు ఉండాలనుకునే వామపక్షాలు మద్దతు ఇవ్వాలంటే ఇక్కడ ఎంసీపీఐ అభ్యర్థి ఉండనే ఉన్నారు. ఎవరికో ఎందుకు మద్దతునివ్వాలనుకున్నా.. సీపీఎం నుంచి పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు వచ్చిన ప్రతిపాదనలు కూడా వంకలు చెప్పి పక్కకు నెట్టిన అగ్రనాయకత్వం పార్టీ సిద్ధాంతాలను, తీర్మాణాలను నాగర్జున సాగర్‌ ఎన్నికలతో పూర్తిగా తిలోదకాలు ఇచ్చే స్థాయికి చేరుకుందనే విమర్శలు వ్యక్తమవున్నాయి.

ప్రజల పక్షంలో ఉండి పోరాడే పార్టీలుగా ఉన్న సీపీఐ, సీపీఎం ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు తమ మద్దతును ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి కొన్ని రోజుల క్రితం ఆయా పార్టీల నాయకులు తమ పార్టీ శ్రేణులతో కలిపి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులోనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులుగా బూర్జువా టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడమేంటని ప్రశ్నించిన కొందరు నాయకుల నోర్లను సైతం కేంద్ర, రాష్ట్ర కమిటీల నిర్ణయమని చెప్పి నోర్లు మూయించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతునివ్వడం ఖాయమని, అయితే ఇది అధికారికంగా ప్రకటించడం కుదరదంటూ చివరలో ఓ కునుకు తీశారు. దీంతో ఆ నోట, ఈ నోట విషయం బయటకు రావడంతో చివరకు కామ్రేడ్స్‌కు అధికారికంగా ప్రకటించక తప్పలేదు.

తాము మద్దనిచ్చే విషయాన్ని కేంద్ర కమిటీల అనుమతితో రాష్ట్ర కమిటీలు రాతపూర్వకంగా ప్రకటించడం ఆ పార్టీల్లో ఆనవాయితీ. అయితే నాగర్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా జిల్లా నాయకులతో ప్రకటనలు ఇప్పించడం ద్వారా అగ్ర నాయకత్వం తప్పించునే ధోరణిని ప్రదర్శించడం నిరూపితమవుతోంది. ఇందుకు నిదర్శనమేంటంటే.. పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీల కేంద్ర, జిల్లా స్థాయి నాయకులు చెప్పినట్టు రాష్ట్ర, కేంద్ర పార్టీ కమిటీల నిర్ణయమేదీ జరగలేదు. ముఖ్యంగా సీపీఎం తరపున జాతీయ స్థాయి నాయకుడొకరు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ పార్టీ 2018 ఏప్రిల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి మహాసభల రాజకీయ తీర్మానం ప్రకారం.. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల సమీకరణను చేసే సందర్భంలో తప్ప ప్రాంతీయ బూర్జువా పార్టీలతో పొత్తు నెరపకూడదు.

ముఖ్యంగా బీజేపీతో అంటకాగే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. ఈ నిర్ణయాలను మార్చాలంటే మళ్లీ మహాసభలు నిర్వహించడం లేదా ప్రత్యేక కేంద్ర మహాసభలు ఏర్పాటు చేసి విధానాన్ని రాతపూర్వకంగా మార్చాల్సి ఉంటుంది. ఆ పార్టీ రూల్స్ ప్రకారం ఇలాంటివేమీ జరగలేదు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం టీఆర్ఎస్ కామ్రేడ్స్‌ మద్దునిచ్చే జాబితాలకి రావడం లేదు. అయినా ఉన్నత కమిటీల పేర్లు చెప్పి నాయకత్వం కింది స్థాయి కార్యకర్తల నోర్లను మూసి వేసింది.

వంకలు చెప్పి తప్పించుకున్న నాయకత్వం..

నాగర్జున సాగర్‌లో మరో వామపక్ష అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీల కూటమి ఉద్దేశపూర్వకంగానే కప్పదాటు ఎత్తుగడలు వేసింది. గతంలో బీఎల్‌ఎఫ్ కూటమిగా సీపీఎం ముందుండి నడిచిన సందర్భంలోనూ ఎంసీపీఐ అందులో కలిసి పనిచేసింది. అయినా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి సీపీఎం మద్దతునివ్వడం లేదు. ఇక సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహసభలో తీర్మానించిన పార్టీ వ్యూహం ప్రకారం అధికారంలో ఉండే పార్టీలకు మద్దతునిస్తే ప్రజల్లో పార్టీ విశ్వసనీయతను కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల స్వతంత్రంగా పని చేస్తే బూర్జువా పార్టీలకంటే ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని కూడా అగ్ర నాయకత్వం ఆదమరిచినట్టుంది.

ఈ స్థానంలో గిరిజన ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే బరిలోకి దించింది. సీపీఎం నుంచి తాను కూడా పోటీలో ఉంటానని గిరిజన సంఘం నాయకుడు శంకర్ నాయక్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి లేఖ రాశారు. ఆయనతో పాటు సీపీఎం సీనియర్ నాయకుడు కొండేటి శ్రీను కూడా తాను పోటీ చేస్తానని రాష్ట్ర కమిటీలో కీలక సభ్యుడిని సంప్రదించగా.. కనీసం ఐదు వేల ఓట్లకు తగ్గకుండా వస్తాయన్న హామీనివ్వాలని బెదిరింపు ధోరణితో మాట్లాడారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఇలాంటి నిబంధన లేదని, మూడు వేల ఓట్లు కూడా రాని అభ్యర్థులు ఉన్నారని తిరిగి సమాధానమిచ్చిన స్థానిక నాయకత్వం హిత వ్యాక్యాలను ఆ పార్టీ పరిగణలోకి కూడా తీసుకోలేదు.

గిరిజనల పక్షాన పోడు భూముల కోసం పాదయాత్ర చేసి ఆ ప్రజల ప్రేమను పొందిన కె.నాగిరెడ్డి సైతం పోటీలో నిలిచేందుకు ఆసక్తి కనబరిచినా.. అగ్ర నాయకత్వం తొక్కి పెట్టింది. టీఆర్ఎస్ మద్దతుపై స్థానిక నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పార్టీ శ్రేణులు నేరుగా ప్రశ్నలు సంధించడం కూడా అక్కడికొచ్చిన నాయకత్వానికి కంటగింపుగా మారింది. ప్రజలకు దశల వారీగా దూరమవుతున్న కమ్యూనిస్టు పార్టీలు.. టీఆర్ఎస్‌కు మద్దతునివ్వడం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తిని రగిలిస్తోంది.

Next Story

Most Viewed