దోచుకున్నోడినే.. దోచేశారు? షేర్ మార్కెట్ దందాలో కొత్త కోణం

by  |
Sheikh Mahaboob Subhani
X

దిశ, మక్తల్ : షేర్ మార్కెట్ పేరుతో జనం నుండి కోట్ల రూపాయలు కాజేసిన షేక్ మహబూబ్ సుభానిని స్థానికులు దోచుకున్నట్లు తెలుస్తోంది. ‘‘జనం నుంచి అక్రమంగా డబ్బులు గుంజుతున్నావ్.. ఇది ఇన్ లీగల్ వ్యాపారం. నీ బండారం బయటపెడతాం’’ అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడి సుభాని నుంచి భారీగా నెలవారి మామూళ్లు తీసుకున్నట్లు సమాచారం. సుభానిని బ్లాక్ మెయిల్ చేసిన వారిలో రాజకీయ నాయకులు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నట్లు మక్తల్‌లో ప్రచారం జరుగుతోంది.

షేర్ మార్కెట్ పేరిట ప్రజలను దోచుకోవాడానికి ప్లాన్ వేసిన షేక్ మహబూబ్ సుభాని.. ముందుగా మక్తల్‌లో పలుకుబడి ఉన్న నేతలను మందు, విందు పార్టీలతో మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత ఏజెంట్లను నియమించుకుని దోపిడీకి తెర లేపాడు. అధిక వడ్డీ వస్తుండడంతో ప్రజలు సైతం ఎగబడ్డారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు వచ్చిపడడంతో స్థానికులు కొందరు అతడి నుంచి డబ్బులు వసూలు చేయడానికి బెదిరింపులకు పాల్పడ్డారు. వారి బారి నుంచి కాపాడుకోవడానికి సుభాని స్థానిక వ్యాపారులు, పలుకుబడి ఉన్న నాయకులు, పోలీసులు, జర్నలిస్టులను మచ్చిక చేసుకున్నాడు. వారితో అంటకాగుతూ.. తనకు ఎదురు లేకుండా చూసుకున్నాడు. అదే అతడి కొంప ముంచినట్లు తెలుస్తోంది.

Sheikh Mahaboob Subhani2

కోట్ల రూపాయాలు సంపాదించిన సుభాని.. మక్తల్, మాగనూరు, కృష్ణ, ఉట్కూర్ మండలాల్లో సుమారు 100 ఎకరాల భూమిని, మక్తల్‌లో రూ.40 లక్షల ఇల్లును కొనుగోలు చేశాడు.అయితే వీటన్నీటికి కోట్ల రూపాయలు అడ్వాన్స్‌లు ఇచ్చి స్టాంప్ బాండ్ పేపర్లు రాయించుకున్నాడు. కరోనా కారణంగా వీటన్నీటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఏడాదిన్నరలోనే కోట్లకు పడగలెత్తిన సుభానిపై ఆయన పెంచి పోషించిన వారి కన్నుపడ్డట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనను బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు గుంజినట్లు తెలుస్తోంది.

అక్రమ వ్యాపారం చేస్తున్నావు.. మాకు డబ్బులు ఇవ్వకపోతే నీకు కష్టాలు తప్పవు. రూ.లక్షకు రూ20 వేల వడ్డీ ఎలా ఇస్తావు. లక్షకే రెండు తులాల బంగారం, 4 వేలు ఎలా ఇస్తావు అంటూ ఏజెంట్ల సహా.. నాయకులు, పోలీసులు వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు సుభాని వద్ద నెల వారి మాముళ్లు తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల వారి వేధింపులు ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది. మామూళ్లు అందడం ఏమాత్రం ఆలస్యం అయినా.. ఫోన్లు చేయడం, దుకాణానికి వెళ్లి బెదిరింపులకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో డిపాజిట్ దారులకు వడ్డీలు, రెండు తులాల బంగారం ఇచ్చే గడువు దగ్గర పడుతుండడంతో సుభాని ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. కొంతమంది డిపాజిట్ దారులకు మూడు నెలలుగా వడ్డీ వాయిదా వేసినట్లు తెలిసింది. మరోవైపు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన భూములు, ఇల్లు తన పేరున రిజిస్ట్రేషన్ కాకపోవడం, లక్షల్లో మూముళ్ల ఇవ్వాల్సి రావడంతోనే సుభాని పరారీ అయినట్లు తెలుస్తోంది. తాను పెంచి పోషించిన సామ్రాజ్యమే.. అతడిని కాటు వేయడానికి ప్రయత్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. కాగా సుభాని ఆచూకీ కోసం మక్తల్ పోలీసులు కాకినాడ వెళ్లారు. నిన్న కొంత మంది బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.

Next Story

Most Viewed