నిర్వాసితుల భూమి మింగేస్తున్నారు

by  |
నిర్వాసితుల భూమి మింగేస్తున్నారు
X

దిశ‌, ఖ‌మ్మం: క‌ండ్ల ముందే అన్యాయం జ‌రుగుతోంది. ఆపాల్సిన ఆఫీసర్లు, ద‌ళారులు, అక్ర‌మార్కుల‌కు అండ‌గా నిలుస్తున్నారు. అయ్యా అక్ర‌మార్కుల‌ను అడ్డుకోండ‌నీ, అర్హుల‌కు న్యాయం చేయండ‌ని ఆ గ్రామ‌స్తులు వీఆర్వో మొద‌లు క‌లెక్ట‌ర్ వ‌ర‌కు విన‌తులు స‌మ‌ర్పించినా ప‌ట్టించుకున్న నాథుడు లేదు. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి మండ‌లంలోని కొమ్మేప‌ల్లి గ్రామస్తుల‌కు అయ్య‌గారిపేట వ‌ద్ద‌ క‌ల్పిస్తున్న పున‌రావాసంలో జరుగుతున్న అక్రమాల తతంగం ఇది. బాధితుల‌కు అండ‌గా నిలిచి న్యాయం చేయాల్సిన పున‌రావాస క‌మిటీ స‌భ్యులే అన్యాయం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల స‌హ‌కారంతో అనర్హులకు నష్ట పరిహారం, ఇండ్ల స్థ‌లాలు ద‌క్కేలా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించాలనీ, అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.

ప్ర‌క్రియ ఇలా మొదైలైంది..!

కొమ్మేప‌ల్లి గ్రామాన్ని జ‌ల‌గం వెంగ‌ళ్‌రావు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప‌రిధిలోకి తీసుకొచ్చారు. దాంతో సింగ‌రేణి సంస్థ‌, ప్ర‌భుత్వం గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. 2013 భూ సేకరణ చ‌ట్టం ప్ర‌కారం కొమ్మేప‌ల్లి గ్రామ‌స్తుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డంతో పాటు అయ్యగారిపేట వ‌ద్ద‌ పున‌రావాసం క‌ల్పించేందుకు అర్హులను గుర్తించారు. 229 మంది అర్హులకు 2018లో 7,61,000 రూపాయల నష్ట పరిహారం‌తో పాటు 0-02గుంట‌ల భూమిని ఇచ్చేట్లుగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. బాధితుల‌కు న్యాయం జ‌రిగేందుకు వీలుగా ప‌ర్య‌వేక్షించేందుకు ఆర్అండ్ఆర్ క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో గ్రామంలోని వేర్వేరు సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం క‌ల్పిస్తు నలుగురిని కమిటీ సభ్యులను నియమించింది. ఆ తర్వాత సింగరేణి వారు భూ నిర్వాసితులకు 244 ఇండ్ల ప్లాట్లు కేటాయించారు. అందులో 229మంది అర్హుల‌కు ఇండ్ల స్థ‌లాల‌ను మంజూరు చేశారు. మిగ‌తా 15 ఇండ్ల ప్లాట్లుకు అర్హుల‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక్క‌డే ఆర్అండ్ఆర్ క‌మిటీ స‌భ్యులు అక్రమ లీలలు ప్రారంభించారు. 15 ఇండ్ల ప్లాట్లలో 13 ప్లాట్ల‌కు, గతంలో రెవెన్యూ అధికారులు అనర్హులు అని అధికారిక ప్రకటన చేసిన వ్య‌క్తుల‌కు జాబితాలో రహస్యంగా చోటు క‌ల్పించారు. అర్హుల‌ను కాద‌ని మ‌రీ అన‌ర్హుల‌కు అప్ప‌నంగా ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న భూమిని క‌ట్ట‌బెట్టేందుకు య‌త్నించారు. గ్రామంలోని కొంత‌మంది యువ‌కులు క‌మిటీగా ఏర్ప‌డి గతంలో ఆర్‌టీఐ ద్వారా లబ్ధిదారుల జాబితాను పొందారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

కేటాయింపులు లేకున్నా..నిర్మాణాలు

ప్ర‌భుత్వం మిగిలిన 15 ప్లాట్ల‌కు సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వ‌లేదు. అర్హుల ఎంపిక‌పై స్తబ్ధ‌త కొన‌సాగుతోంది. ఎలాంటి ఉత్త‌ర్వులు వెల‌వ‌డకున్నా..కొంత‌ మంది కేటాయింపు చేయ‌ని స్థ‌లాల్లో నిర్మాణాలు చేప‌డుతున్నారు. త‌క్ష‌ణ‌మే నిర్మాణాలు ఆపాల‌నీ, బాధితుల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ గ్రామ‌స్తులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జాతీయ క‌మిష‌న్‌ల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయా క‌మిష‌న్లు విచార‌ణకు ఆదేశించాయి. వెంటనే నిర్మాణాల‌ను ఆపాల‌ని క‌లెక్ట‌ర్‌కు ఉత్త‌ర్వులు జారీ చేశాయి. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ స్థానిక డీఆర్వోకు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌తల‌ను అప్ప‌గించారు. ఇటీవ‌ల డీఆర్వో అయ్య‌గారిపేట‌లోని కొమ్మేప‌ల్లి గ్రామ‌స్తుల‌కు కేటాయించిన ఇండ్ల స్థ‌లాల‌ను ప‌రిశీలించారు. కేటాయింపు జ‌ర‌గ‌క‌ముందే నిర్మాణాలు చేప‌డుతున్న వారిని మానుకోవాల‌ని హెచ్చ‌రించారు. అయితే, అప్ప‌టికే ప్ర‌హారీలు, ఇండ్ల పునాదుల నిర్మాణం చేప‌ట్ట‌గా, వాటిని కూల్చేందుకు ఆదేశాలు ఇవ్వ‌లేదు. అక్ర‌మార్కుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అధికారులు మెత‌క‌గా వ్య‌వ‌హ‌రించ‌డంపై గ్రామస్తులు అధికారుల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా అక్ర‌మ నిర్మాణాల‌పై గ్రామ‌స్తులు సింగ‌రేణి సంస్థ పీవోకు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో కొద్దిరోజుల క్రితం సంస్థ సిబ్బంది మిగిలిన కేటాయింపు చేయ‌ని 15ప్లాట్ల‌లో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్టొద‌ని బోర్డులు పాతారు. అయినా అక్ర‌మార్కులు నిర్మాణాలు ఆపడం లేదు. అర్హుల‌కు అన్యాయం చేస్తూ..అన‌ర్హుల‌కు స్థ‌లాలు ద‌క్కేలా చేయాల‌ని చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కొమ్మేప‌ల్లి గ్రామ‌స్తులు పేర్కొంటున్నారు.



Next Story