అధికార పార్టీ అండతో కార్పొరేటర్ భర్త భూ దందా.. కోట్ల విలువైన ల్యాండ్ స్వాహా..

by  |
అధికార పార్టీ అండతో కార్పొరేటర్ భర్త భూ దందా.. కోట్ల విలువైన ల్యాండ్ స్వాహా..
X

దిశ, జవహర్ నగర్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో సరికొత్త భూదందా వెలుగులోకి వచ్చింది. పేకాట కేసు మరవక ముందే భూ ఆక్రమణ కేసులో అధికార పార్టీ నేతలపై కేసులు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్పొరేషన్ పరిధిలో 3వ డివిజన్ కార్పొరేటర్ బల్లి రోజా, పార్టీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడి అండదండల కోసం అధికార పార్టీ లోకి వచ్చినా తప్పించుకోలేక, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. మరో కార్పొరేటర్, బల్లి శ్రీనివాస్ మరి కొందరితో కలిసి మాజీ సైనికుల భూములను కొల్లగొట్టేందుకు కుట్ర పన్ని భూఅక్రమాలకు పాల్పడ్డారని, తమకు న్యాయం చేయాలని బాధితులు మేడ్చల్ జిల్లా కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల మేరకు 12 మంది నిందితులపై కేసు నమోదైన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలం, ఏంఈఎస్ లో నివాసం ఉంటున్న మాజీ జవాన్ మోతీ సింగ్ కు 1974లో జవహర్ నగర్ ల్యాండ్ కొలనైజేషన్ సొసైటీ ద్వారా సర్వే నంబర్ 266, 267, 268 లలోని సుమారు 10 ఎకరాల భూమిని కేటాయించింది.

అప్పటినుంచే భూములకు చట్టబద్దత కల్పించాలని, రెగ్యులరైజ్ చేసి, పట్టాలను ఇప్పించాలని హై కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగా మోతీ సింగ్ 2016 ఆగస్టు 22 లోనే మృతి చెందగా.. అతని కుమారులు లాల్ సింగ్, తేజేందర్ పాల్ అప్పటికే ఆ భూమిపై విద్యుత్ సదుపాయం, వరి పంట, ఎరువులు, విత్తనాలు భద్రపరిచేందుకు షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అక్కడి కొంత భూమిలో తాము యజమానులమంటూ మోసపూరితంగా నరేందర్ పాల్ సింగ్, అమర్ జిత్ సింగ్ లతో పాటు స్థానికంగా ఉండే ఆర్కే బాబు, బల్లి శ్రీనివాస్, రోకలి బండ రాములు, శివాజీ, గోలి లక్ష్మణ్ , కృష్ణా రెడ్డి, రఘురాములు, సాయి కృష్ణ, రాజేష్, యాదగిరిలు దౌర్జన్యాలకు పాల్పడుతూ.. భూ ఆక్రమణకు పాల్పడ్డారు. ఇదే అదునుగా భావించిన వీరు 2021 అక్టోబర్ 28 న ఆ భూమిలో ఉన్న వ్యవసాయ షెడ్ల తాళాలను, కరెంట్ మీటర్, 8 సీసీటీవీలతో పాటు వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంటూ.. 2021 నవంబర్ 5న కొత్త కరెంట్ మీటర్ అమర్చడానికి వచ్చిన విద్యుత్ సిబ్బందిని సైతం బెదిరింపులకు దిగడంతో మీటర్ ఫిక్స్ చెయ్యకుండా అడ్డుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 12 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed