ప్రజల నోట్లో మట్టి.. అధికార పార్టీ నాయకుడి భూదందా

by  |
Land grab, ruling party leader
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికారాన్ని అడ్డుపెట్టుకున్న ఓ రూలింగ్ పార్టీ నాయకుడు భూదందాకు తెరలేపాడు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దళితుల భూమిని అక్రమంగా ఆక్రమించడంతోపాటు ఎంచక్కా రైతుబంధు సాయాన్ని కూడా జేబులేసుకుంటున్నాడు. ఎక్కడో విదేశాల్లో ఉండే తన సోదరుడి కుమారుడి పేరుపై ఈ అక్రమాలకు తెర లేపాడు. ఇది చాలదన్నట్లు పక్కన ఉన్న పెద్దగుట్టపై ఏ ఒక్క శాఖ అనుమతి లేకుండా స్టోన్ క్రషర్ పెట్టి మూడు గ్రామాల ప్రజల నోట్లో మట్టికొట్టాడు. ప్రశ్నించిన వారిని తన అర్థ, అంగబలంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇంత జరుగుతున్నా.. స్థానిక అధికారుల నుంచి కలెక్టర్ వరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, ప్రజాప్రతినిధిపై భూ ఆక్రమణ ఆరోపణలు వస్తున్నాయి. ఆయన అక్రమాలు, అవినీతిపై పోరాటం చేయడానికి ఓ అఖిలపక్షమే ఏర్పడింది. వారి కథనం ప్రకారం.. ఆత్మకూర్ గ్రామంలో సర్వే నంబర్ 797లో నెమ్మికల్ గ్రామానికి చెందిన గంపల చెన్నయ్య, పురం వెంకట్రాములుకు 1980 ముందే 4.18 ఎకరాలకు ప్రభుత్వం లావణ్య పట్టాను అందజేసింది. అప్పటి నుంచి వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మారే ఆ ప్రజాప్రతినిధి ఆ భూమి పక్కనే ఉన్న పెద్దగుట్టపై స్టోన్ క్రషర్ ఏర్పాటు చేశాడు. గుట్ట పక్కనే ఉన్న 4.18 ఎకరాలపై కన్నేసిన ఆయన.. రైతులకు తెలియకుండానే తన సోదరుడి కుమారుడైన ఎన్ఆర్ఐ పేరుపై అప్పటి అధికారుల సహకారంతో అక్రమంగా పట్టా చేయించుకున్నారు. ఈ భూమికి 2018 నుంచి 2020 వరకు రైతుబంధు పథకం కింది రూ.10,6800లను సాయంగా పొందారు. అంతేకాకుండా సర్వే నెంంబర్ 798లో స్టోన్ క్రషర్ భూమికి కూడా సదరు ప్రజాప్రతినిధి రైతు బంధు సాయం పొందుతున్నాడు.

ఆ మూడు గ్రామాలు.. వంద ఎకరాలు నాశనమేనా..?

ఆత్మకూరు(ఎస్) పెద్దగుట్ట పై సర్వే నెంబర్ 758లో మైనింగ్, రెవెన్యూ అనుమతులు లేకుండనే స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి.. నిబంధనలకు విరుద్ధంగా భారీఎత్తున జిలెటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో క్రషర్ చుట్టూ పక్కల 100 ఎకరాల్లో వ్యవసాయ భూముల్లో రాళ్లు పడడంతోపాటు దుమ్ము పడి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ దాటికి భూమి కంపించి బోర్లులో మోటార్లు కురుకుపోవడంతోపాటు కొన్ని ఎండిపోతున్నాయని వాపోతున్నారు. పెద్ద చెరువులో నీరు కలుషితం కావడంతోపాటు నెమ్మికల్, నంద్యాలగూడెం గ్రామాల్లోని ఇండ్లు ధ్వంసమవుతున్నాయని, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నాయని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద గుట్టపై ఉన్న ఔషధ మొక్కలు, సీతాఫలం, జాతీయ పక్షులు నెమళ్లు, వన్య ప్రాణులు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కళ్లు మూసుకున్న అధికారులు

స్టోన్ క్రషర్ ఏర్పాటుకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అఖిలపక్షం ప్రధాన ఆరోపణ. గ్రామపంచాయతీ కూడా 2007 నుండి 2021 వరకు ఎలాంటి పన్ను చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. స్టోన్ క్రషర్ పై అఖిల పక్షం నాయకులతోపాటు గ్రామస్తులు, రైతులు ఆత్మకూర్ తహసీల్దార్‌తో పాటు పోలీస్, ఆర్డీఓ, కలెక్టర్, పర్యావరణం, మైనింగ్ అధికారులకు అనుమతులు లేవని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోదని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద చెరువు ఎఫ్ టీఎల్ పూడ్చి రోడ్డు నిర్మాణం చేపట్టారని, చెరువు హద్దు రాళ్లను మార్చినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. బ్లాస్టింగ్ వల్ల ఇళ్లతోపాటు గౌడ కులస్తుల కంఠమహేశ్వర స్వామి, యాదవులు కుల దైవమైన సౌనమ్మ, లింగమంతుల స్వామి ఆలయాలు, ఇండేన్ గ్యాస్ గోదాము ధ్వంసం అవుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు పందిరి రాంరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు తంగేళ్ల పెద్ద వీరారెడ్డి, సీపీఎంల్ న్యూడెమోక్రసీ నాయకుడు డేగల వెంకట కృష్ణ, రైతులు పందిరి మాధవరెడ్డి, పందిరి శ్రీనివాస్ రెడ్డి, గిలకత్తుల ఎల్లయ్య, విసవరం రాంరెడ్డి, విసవరం వెంకట్ నర్సింహరెడ్డి, పందిరి రవీందర్ రెడ్డి,పందిరి కృష్ణారెడ్డి, విసవరం విజయేంద్ర రెడ్డి ఆరోపించారు.

మంత్రి జగదీశ్ రెడ్డి సీరియస్

సదరు ప్రజాప్రతినిధి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు రావడం.. ఆయనపై గ్రామస్తులు, రైతులతోపాటు అఖిలపక్షం ఏర్పాటుకావడంతో మంత్రి జగదీశ్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. స్టోన్ క్రషర్ నడుస్తున్న భూమికి రైతుబంధు సాయం ఎలా పొందాడని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అమ్మకం, కొనుగోలు చేయడానికి వీలు లేని భూమిని ఎలా పట్టా చేయించుకున్నాడు అనే విషయంపై అధికారులను వివరణ కోరినట్లు వినికిడి. మంత్రి పేరు చెప్పుకుని ఆయన అధికారులను సైతం బెదిరిస్తూ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడినట్లు మంత్రికి ఆ పార్టీ నాయకులే కొందరు వివరించినట్లు గుసగుసలు వినిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు ఆ ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా, సదరు ప్రజాప్రతినిధిపై అఖిల పక్ష నాయకులు మంత్రికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. నేడో, రేపో మంత్రిని కలిసి ఆయన అక్రమాల చిట్టాను అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.



Next Story

Most Viewed