దండం పెడుతాం, కానీ…

by  |
దండం పెడుతాం, కానీ…
X

దిశ,న్యూస్‌బ్యురో: తిండితిప్పలు లేవు.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు.. ఏం జరుగుతుందో మాకు ఏం అర్థంకావడంలేదు సార్.. మీకు దండం పెడుతాం.. మా ఊళ్లకు మమ్మల్ని పంపండి సారూ అంటూ వాళ్లందరూ ఆవేదనతో సర్కారుకు మొర పెట్టుకుంటున్నారు. అదేంటో ప్రత్యేక కథనంలో చూడండి.

‘వారం రోజుల నుంచి తినడానికి తిండి లేదు. తాగాడానికి మంచి నీళ్లు సుత దొరకడం లేవు. చీకటి పడితే ఎక్కడ తలదాచుకోవాలో తెలియడం లేదు. సర్కారు ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉండలేక పోతున్నం. చిన్న షెల్టర్లలో వందల మందిని గుంపులు గుంపులుగా గొర్రెల మందల తోలుతున్నారు. అక్కడ ఎవరికి ఏమీ వ్యాధి ఉందో తెలియని పరిస్థితి. ఇంటికి పోదామంటే రవాణ సౌకర్యం లేదు. ఇంటి దగ్గర మా కోసం భార్యాబిడ్డలు ఎదురిచూస్తున్నారు. మాపై దయచూపి సర్కారు మమ్ముల్ని మా ఊర్లకు చేర్చాలి. లేకపోతే కరోనా వ్యాధి సోకే కంటే ముందే ఆకలితో సచ్చిపోయేలా ఉన్నం’ ఇది పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి లాక్‌డౌన్‌తో రవాణా సౌకర్యం లేక ఇక్కడే చిక్కిపోయిన వలస కూలీల ఆవేదన.

సచ్చేలా ఉన్నాం..

కరోనా వైరస్ వ్యాధి సోకుడేమో గానీ… లాక్‌డౌన్ కారణంగా ఆకలితో సచ్చేలా ఉన్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాన్ని హైదరాబాద్ మహానగరంలో వేలాదిమంది వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి ఇక్కడ దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కరోనా వీరి బతుకులను కాటు వేసింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంలో 21 రోజులు ఏప్రిల్ 14 అర్థరాత్రి వరకు లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రం మొత్తం ఎక్కడిక్కడా స్తంభించిపోయింది. హోట్ కార్మికులు, క్యాంటీన్ కార్మికులు, దినసరి కూలీలుగా పనిచేస్తున్న కార్మికులంతా తమ తమ యాజమాన్యాలు వెళ్లగొట్టడంతో రోడ్లపైకి వచ్చారు. ఇంటికి పోదామంటే రవాణా సౌకర్యం లేక దిక్కుతోచని స్థితిలో రోడ్ల మీద తిరుగుతూ.. తిండి తిప్పలు లేక వారం రోజులుగా నరకయాతన పడుతున్నారు.

కాలినడకన ఇతర రాష్ట్రాలకు..

ఇప్పటికే కొంతమంది కార్మికులు మహారాష్ట్ర , ఆంధ్ర , ఉత్తరప్రదేశ్‌కు కాలినడకన మూటలు నెత్తినపెట్టుకొని బయలుదేరారు. ఇక, కొంతమంది కార్మికులు కాలినడక తమ ఊర్లకు వెళ్లలేక.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. మమ్మల్ని మా ఇళ్లకు చేర్చండి సార్ అని సీఎం కేసీఆర్‌ను ప్రాదేయపడుతున్నారు. ఇంటి దగ్గర మా భార్యాబిడ్డలు మా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ఉండలేకపోతున్నాం.. తిండి తిప్పలులేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన షెల్టర్లలో వందలాది మంది గుంపులుగుంపులుగా ఉండడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి ఏ రోగం ఉందోనని ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉండలేని పరిస్థితుల్లో రోడ్ల పైన పోలీసులు లేని చోట ఉంటున్నారు. చాదర్‌ఘట్ చౌరస్తా, అసెంబ్లీ ప్రాంగణంలో, ఆంధ్ర సచివాలయం ఎదుట, వివిధ ప్రాంతాల్లో వందలాది మంది వలస కార్మికులు తలదాచుకుంటున్నారు. మమ్ముల్ని మా ఇళ్లకు చేర్చితే సర్కారుకు రుణపడి ఉంటమంటున్నారు కార్మికులు.

కేటీఆర్ సార్ మమ్ముల్ని ఇంటికి పంపించండి..

‘గత ఐదేండ్ల నుంచి ఇక్కడ ఉంటూ వంట పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాను. వారం రోజుల నుంచి లాక్‌డౌన్ అమలులో ఉండడంలో పనిదొరికే పరిస్థితి లేదు. పనిచేసిన రోజుల్లో ఎక్కడా పనిచేస్తే అక్కడే తలదాచుకునే వాడిని. ఇప్పుడు ఎక్కడ ఉండాలే అర్థం కావాడంలేదు. జీహెచ్ఎంసీ వారు ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉండలేకపోతున్నాం. మాకు ఏ షెల్లర్లు వద్దు.. మమ్మల్ని ఊర్లకు చేర్చితే చాలు’ అని ఏపీ రాష్ట్రానికి చెందిన నాగేశ్వర్ రావు అనే దినసరి కూలీ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాడు.

Tags: Lockdown, migrant workers, shelters, hungry, kcr, Government


Next Story

Most Viewed