‘పురపాలక చట్టం స్ఫూర్తిగా కొత్త జీహెచ్ఎంసీ’

by  |

దిశ, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అమల్లోకి తీసుకొచ్చిన పురపాలక చట్టంలోని కీలకాంశాలన్నింటినీ జీహెచ్ఎంసీ కొత్త చట్టంలోనూ పొందుపర్చనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులోని నిబంధనలను యథాతథంగా జీహెచ్ఎంసీ చట్టంలోకి తీసుకురావాలని అధికారులను అదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జీహెచ్ఎంసీ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర పౌరులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పురపాలన అందించేందుకే జీహెచ్ఎంసీ చట్టాన్ని మార్చనున్నట్టు స్పష్టం చేశారు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని ఆమోదం కోసం పంపుతామన్నారు. ఇందులో పొందుపర్చాల్సిన అంశాలపైన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ లోకేశ్ కూమార్‌లకు పలు అదేశాలు జారీ చేశారు.
ఈ చట్టం ద్వారా భవన నిర్మాణ అనుమతులు, పౌరసేవల వేగవంతం, ప్రజా ప్రతినిధులపై భాద్యత పెంచడం వంటి కీలకాంశాలను పొందుపర్చాలని సూచించారు. ప్రస్తుతం నడుస్తున్న రోడ్ల నిర్వహణ, డబుల్ బెడ్రూం నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలతోపాటు పారిశుద్ధ నిర్వహణ వంటి కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రధ్ద వహించాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణం, పార్కుల నిర్వహణ, జంక్షన్ల అభివృద్ధి, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి ప్రాథమిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వీటి కోసం ప్రత్యేక ఐటి డ్యాష్ బోర్డు ఎర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read also..

రూ.85కోట్ల మెడిసిన్స్ తిన్నారు..

Next Story

Most Viewed