గాలింపు చర్యలు ముమ్మరం చేయండి.. మంత్రి కేటీఆర్ ఆదేశం

by  |
గాలింపు చర్యలు ముమ్మరం చేయండి.. మంత్రి కేటీఆర్ ఆదేశం
X

దిశ, సిరిసిల్ల: ఈత సరదా ఆరుగురు పిల్లల తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని మానేరు నదిలో సోమవారం ఆరుగురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. రాజీవ్ నగర్ కు చెందిన తొమ్మిది మంది విద్యార్ధులు ఈత కొట్టేందుకు మానేరు నదిలోకి దిగగా.. చెక్ డ్యాం సమీపంలో ఆరుగురు గల్లంతయ్యారు. వీరిలో కొలిపాక గణేష్(15) అనే విద్యార్థి మృతదేహాన్ని నిన్న సాయంత్రం వెలికి తీయగా..మరో ఐదుగురు విద్యార్థుల ఆచూకీ కోసం అధికారులు నిన్నటి నుంచి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

కాగా మంగళవారం ఉదయం జడల వెంకటసాయి(14),తీగల అజయ్(14),కొంగ రాకేష్(15),శ్రీరాం క్రాంతి కుమార్(14) అనే విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. సింగం మనోజ్(14) అనే విద్యార్థి ఆచూకీ ఇంకా లభించలేదు. అతడి కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. తొమ్మిది మంది విద్యార్థుల్లో ఆరుగురు గల్లంతవ్వగా.. వాసాల కళ్యాణ్,కోట అరవింద్,దిడ్డి అఖిల్ అనే ముగ్గురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.

వెలికి తీసిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్పత్రి ఆవరణలో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరిని కలిచివేసింది.

దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

మానేరు నదిలో ఆరుగురు విద్యార్థులు గల్లంతు కావడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నియోజకవర్గంలోని వాటర్ సోర్సెస్ సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని కేటీఆర్ సూచించారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed