మంత్రి నేనే… రాజు నేనే..!

by  |
మంత్రి నేనే… రాజు నేనే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పనున్నట్లు వస్తున్న వార్తలపై స్వయంగా కేసీఆరే గతంలో క్లారిటీ ఇచ్చారు. అయినా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి తగినట్లుగా ఆయన కార్యాచరణ కూడా కనిపిస్తోంది. కరోనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్‌లో ఉండగా, అన్ని శాఖల మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో కేటీఆర్ అధ్యక్షత వహించి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి కేబినెట్ సమావేశం అని పేరు పెట్టకపోయినా అదే తరహాలో జరిగింది. అప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోయే సమయం ఆసన్నమైంది అనే చర్చలు టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మొదలయ్యాయి.

దానికి కొనసాగింపుగా ఇటీవల వివిధ శాఖలతో కేటీఆర్ వరుస సమీక్షలు జరుపున్నారు. తనకు సంబంధం లేని శాఖలు అయినప్పటికీ మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్న విద్యాశాఖపైన, ఆ తర్వాత సీసీ కెమెరాలకు సంబంధించి పట్టణాభివృద్ధితో ముడిపెడుతూ పోలీసు శాఖలపైనా, తాజాగా బుధవారం ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ అంశాలపైనా కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరుసగా సమీక్షలు నిర్వహించే కార్యాచరణ మున్ముందు ఆయన పోషించబోయే పాత్ర ఏంటో చెప్పకనే చెప్తోంది. ప్రభుత్వంలో సైతం సీఎం తర్వాతి స్థానం కేటీఆర్‌దే అనే అభిప్రాయాన్ని బలపర్చే దిశగా మంత్రులు సైతం తొలుత కేటీఆర్‌ను, తర్వాత కేసీఆర్‌ను కలవడం సంప్రదాయంగానే మారిపోయింది.

బహిరంగంగా ఏ మంత్రీ చెప్పుకోకపోయినప్పటికీ కేటీఆర్ దగ్గర తొలుత ‘ఎస్’ అనిపించుకుంటే ఆ తర్వాత కేసీఆర్ దగ్గర ఫైనల్ అయినట్లేనన్న అభిప్రాయంతో ఉన్నారు. చాలా మంది యువ మంత్రులు కేటీఆర్‌తో ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటే రాజకీయ భవిష్యత్తు అంత పదిలంగా ఉంటుందనే భావనతో ఉన్నారు. చాలా మంది అధికారుల స్థాయిలోనూ అలాంటి అభిప్రాయమే ఉంది. అటు పార్టీ కార్యకలాపాల్లోనూ, ఇటు పరిపాలనలోనూ కేటీఆర్ తనదైన శైలిలో కార్యాచరణ కొనసాగిస్తున్నారు. కేటీఆర్ నజర్‌లో పడితే చాలు అనే తాపత్రయం చాలా మంది లీడర్లలో కనిపిస్తోంది. ఎంతైనా కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటి నుంచే వివిధ శాఖల సమీక్షలు, మినీ కేబినెట్ సమావేశాల్లాంటివి నిర్వహిస్తే ఆ అనుభవం లాంఛన ప్రకటన తర్వాత ఉపయోగపడుతుందనే మాటలూ వినిపిస్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు జరిగే సమావేశాలన్నీ భవిష్యత్తులో సీఎం కావడానికి జరుగుతున్న రిహార్సల్స్ అనే మాట కూడా వినిపిస్తోంది.

Next Story

Most Viewed