యువరాజుకు కలిసొచ్చిన ‘సెంటిమెంట్’

by  |
yuvaraju
X

‘ఆ ఎన్నికలో కేకే మహేందర్‌రెడ్డి మీద కేవలం 171 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ గెలుపొందారు. పార్టీ కోసం పనిచేసిన మహేందర్‌రెడ్డి బలిపశువు కాగా, కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అలా జరిగింది. కేటీఆర్ పక్కా గెలుపు కోసం కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ లేదా హరీశ్‌రావును నిలబెట్టిన సిద్దిపేట కేటాయిస్తే న్యాయంగా ఉండేది. మహేందర్ రెడ్డి అంత ఆశ పెట్టుకున్న నియోజకవర్గానికి ఆయనకు హక్కు ఉన్న స్థానానికి ఆయనకు మాట మాత్రమైనా చెప్పకుండా నామినేషన్ వేయడం పట్ల కేటీఆర్ అయినా అప్పుడు అభ్యంతరం చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎంత గొప్పగా మాట్లాడినా అది వ్యక్తిత్వ హననమూ, ద్రోహబుద్ధి కిందికే వస్తుంది. నేతగా మంత్రిగా కేటీఆర్ ఒకరి ఆశలను తొక్కుకుంటూ వచ్చిన బాటను చరిత్ర గుర్తుంచుకుంటుంది. జన్మదిన వేడుకలలో నేతల హంగామా తప్ప ప్రజల ప్రమేయం కనబడలేదు. టీడీపీలో ఉన్నప్పుడు ‘ఉరికిస్తాం బిడ్డా’ అని తెగనాడిన నోరే ఇప్పుడు ‘కేసీఆర్ బీరప్పకు ప్రతిరూపం’ అంటోంది. ఇక ఆ నోటి నుంచి వచ్చే అభినందనలకు విలువ ఏమి ఉంటుంది.’

యువనేత జన్మదిన వేడుకలలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చిన్నా పెద్ద నేతలు తలమునకలయ్యారు పోటాపోటీగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తన పుట్టిన రోజున బొకేలు ఫ్లెక్సీలు కట్టి డబ్బులు ఖర్చు పెట్టే బదులు అదే సొమ్ముతో పేదలకు సహాయపడాలని చినబాబు తన అభిమానులకు ముందే సందేశం ఇచ్చారు. అయినా, లక్షలాది రూపాయలు వెచ్చించి పత్రికలలో శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన పేజీల కొద్దీ రంగురంగుల ప్రకటనలను కాదనలేకపోయారు ఎన్ని సహాయ కార్యక్రమాలు చేసినా పత్రికలు, టీవీ యాడ్స్ వల్ల వచ్చే ప్రచారం కిక్కే వేరు. అందరికీ నయనానందకరమే. పెద్ద పెద్ద అక్షరాలతో, ఘనమైన పదాలతో కీర్తించే అవకాశము ఇందులో ఉంటుంది. ‘కేటీఆర్ కింగ్ టు రూల్’ అని ఓ మంత్రి మురిసిపోయారు. పుట్టినరోజు జేజేలతోపాటు పాలకపార్టీ వర్గాలు భిన్న కార్యక్రమాలు నిర్వహించాయి. ఓ మంత్రి లక్ష మంది విద్యార్థులకు డిక్షనరీలు పంచారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా ఒక డాక్యుమెంటరీని నిర్మించారు. వరంగల్‌లో కేటీఆర్‌పై రాసిన పాటల సీడీ విడుదలైంది ‘గిఫ్ట్ ఏ స్మైల్’పేరిట అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ, స్కూలు పిల్లలకు బట్టలు, సహాయ కార్యక్రమాలు చేశారు. కేటీఆర్ పేరిట అశ్వరావుపేటలో రెండు వందల వాహనాలకు రూపాయికి లీటరు చొప్పున పెట్రోల్ పోశారు. దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ ప్రధాన కార్యక్రమంగా ఉన్నప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. అయినా, కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి. కేటీఆర్‌కు తన పుట్టిన రోజున ట్రై సైకిళ్లు పంపిణీ చేయాలనే ఆలోచన రాగానే నేతలందరికీ తమ నియోజకవర్గంలోని దివ్యాంగులు గుర్తుకువచ్చారు.

అప్పుడు ధ్వంసం చేయకపోతే..

అన్నిటికన్నా గొప్పగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ముక్కోటి వృక్షార్చన జరిగినట్లుగా తెలుస్తోంది. అడవిని ధ్వంసం చేయకపోతే ప్రకృతి ద్వారానే మొక్కల పంపకం జరుగుతుంది. అటవీశాఖ అవినీతికి దాసోహం కాకపోతే ఇన్ని మైదానాలు ఏర్పడక పోయేవి. ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా వెలిగిపోతున్నవాళ్లలో కొందరి మీద అడవిని నరికిన కేసులు ఉన్నాయి. సాధారణ పౌరుడికన్నా అడవిని దోచేది పలుకుబడి గల పెద్దలే. ఇవే చేతులతో ఇప్పుడు చెట్లు నాటడం ఫ్యాషన్ అయింది. నాటిన చేతులు వాటిని పెంచి పెద్ద చేస్తే చేసిన పాపం కొంతయినా తగ్గుతుంది. జన్మదినం పేరిట ఏ కార్యక్రమం చేపట్టినా దాని లక్ష్యం యువరాజు దృష్టిలో పడడానికి, ప్రస్తుత రాజకీయ జీవితం భవిష్యత్తు పదిలంగా ఉంచుకోనే ప్రయత్నమే కనబడుతోంది. అందరిలో ఆయనను సంతృప్తిపరిచే ఆత్రుత మాత్రమే ఉంది. పిల్లలకు డిక్షనరీలు అవసరమే. రక్తదానం అవసరమే. ఇలా అవసరాలన్నీ పుట్టినరోజు కోసం పుట్టినవి కావు. ఆ రోజే తీరాలని ఎదురుచూస్తున్నవి కావు. ఇది నిత్య సమస్యలు. నేడు చేసి రేపు మరిచిపోయే పక్కనపెట్టేవి కావు. ఒక ప్రణాళికగా కొనసాగించవలసినవే. ఒక వ్యక్తి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలంటే, తెలంగాణకు మరెంతో మంది త్యాగధనులు ఉన్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన జయశంకర్ సారుకు ఈ విషయంలో ప్రథమ గౌరవం దక్కుతుంది. సారు పట్టువదలని ఆకాంక్ష కేసీఆర్‌ను రంగంలోకి దింపింది. ఆయన జన్మదినం గుర్తున్నవారు పార్టీలో ఎందరున్నారు?

నాడు సింహగర్జన సభలో..

ఈ సందర్భంగా మరికొన్ని విషయాల ప్రస్తావన అవసరం ఉంది. కరీంనగర్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా జరిగిన సింహగర్జన సభలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులు ఎవరు పార్టీలోకి, రాజకీయాలలోకి రారు అని అన్నారు. తన పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారని, తామిద్దరమే ఉన్నామని, తెలంగాణ సాధన తన కుటుంబం కోసం కానేకాదని ఘంటాపథంగా ప్రకటించారు. అయితే, పార్టీ పట్ల తెలంగాణ ప్రజల ఆదరణ, ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు ఆశాజనకంగా ఉండటంతో ఆయన ఆలోచన మారినట్టుగా ఉంది. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కన్నా ఈ ఉద్యోగం పెద్దది కాదు. అమెరికాలో ఒకరి కింద పని చేసే కన్నా ప్రవర్ధమానమవుతున్న ఇంటి పార్టీ పని తేలికయింది, బహుళ ప్రయోజనకారి అని ఎవరైనా అనుకుంటారు. 2001లో ఉనికిలోకి వచ్చిన టీఆర్ఎస్‌లో 2009లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేటీఆర్ క్రియాశీలకమైనారు. ‘‘తెలంగాణ సెంటిమెంట్’’ బలంగా ఉన్న నియోజకవర్గం నుంచి నిలబెట్టి గెలిపించుకుని పుత్రుని తిరుగులేని నాయకుడిగా రూపొందించాలని కేసీఆర్ ఆలోచన. అందుకోసం ప్రత్యేకంగా సిరిసిల్లను ఎంచుకోవడం జరిగింది. దానినే ఎంపిక చేయడానికి ఒక కారణం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా పర్వం కొనసాగుతున్న తరుణంలో 2008లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఊహించని రీతిలో టీఆర్‌ఎస్‌కు ఈ ఉప ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలింది.. రాజీనామా చేసిన సీట్లు అన్నింటిని తిరిగి సాధించలేకపోయింది. గెలుపు మెజార్టీ తగ్గిపోయింది. అంతకు క్రితం ఎన్నికలలో 16 అసెంబ్లీ స్థానాలు గెలవగా తొమ్మిది చేతులలోంచి జారిపోయి. ఏడు మాత్రమే కైవసం అయ్యాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య సైతం నాలుగు నుంచి సంఖ్య రెండుకు దిగజారింది. కేసీఆర్ గెలుపే కష్టంగా సాధ్యమైంది. అదే కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని 2004 ఎన్నికలలో కేసీఆర్ రెండు లక్షల మెజార్టీతో గెలిస్తే ఈ ఎన్నికలో కేవలం 16 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై గెలుపొందారు.

సిరిసిల్ల పాత్ర కీలకం..

ఈ గెలుపు వెనుక సిరిసిల్ల సెగ్మెంట్ కీలక పాత్ర ఉంది. కరీంనగర్‌లోని చాలా సెగ్మెంట్లలో కేసీఆర్‌ కన్నా జీవన్ రెడ్డి ముందున్నప్పటికీ, చివరకు సిరిసిల్ల ఓటర్ల బలంతో కేసీఆర్ గట్టెక్కారు. అప్పటి నుండి సిరిసిల్ల ఆయన దృష్టిలో పార్టీకి బలమైన పట్టుకొమ్మలా నిలిచిపోయింది. నిజానికి అక్కడి ప్రజలలో పార్టీ పట్ల ప్రేమను కోల్పోయినవాడు కేకే మహేందర్‌రెడ్డి. ఆయన అక్కడి ప్రజలలో కాపాడిన తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఎన్నికలలో బయటపడింది. ఇంతలో 2009 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. సిరిసిల్ల నుంచి మహేందర్‌రెడ్డి పోటీకి కేసీఆర్ మాట ఇచ్చారు. అయితే, బి. ఫారం తీసుకోవడానికి వచ్చిన మహేందర్‌రెడ్డికి అధినేత దర్శనం దుర్లభం అయ్యింది. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్ నామినేషన్ వేసినట్లు మహేందర్ రెడ్డికి సమాచారం వచ్చింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో కేకే మహేందర్‌రెడ్డి మీద కేవలం 171 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ గెలుపొందారు. పార్టీ కోసం పనిచేసిన మహేందర్‌రెడ్డి బలిపశువు కాగా, కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అలా జరిగింది. కేటీఆర్ పక్కా గెలుపు కోసం కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ లేదా హరీశ్‌రావును నిలబెట్టిన సిద్దిపేట కేటాయిస్తే న్యాయంగా ఉండేది. మహేందర్ రెడ్డి అంత ఆశ పెట్టుకున్న నియోజకవర్గానికి ఆయనకు హక్కు ఉన్న స్థానానికి ఆయనకు మాట మాత్రమైనా చెప్పకుండా నామినేషన్ వేయడం పట్ల కేటీఆర్ అయినా అప్పుడు అభ్యంతరం చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎంత గొప్పగా మాట్లాడినా అది వ్యక్తిత్వ హననమూ, ద్రోహబుద్ధి కిందికే వస్తుంది. నేతగా మంత్రిగా కేటీఆర్ ఒకరి ఆశలను తొక్కుకుంటూ వచ్చిన బాటను చరిత్ర గుర్తుంచుకుంటుంది. జన్మదిన వేడుకలలో నేతల హంగామా తప్ప ప్రజల ప్రమేయం కనబడలేదు. టీడీపీలో ఉన్నప్పుడు ‘ఉరికిస్తాం బిడ్డా’ అని తెగనాడిన నోరే ఇప్పుడు ‘కేసీఆర్ బీరప్పకు ప్రతిరూపం’ అంటోంది. ఇక ఆ నోటి నుంచి వచ్చే అభినందనలకు విలువ ఏమి ఉంటుంది.

-బి.నర్సన్

Next Story

Most Viewed