రేపట్నుంచి గెజిట్​.. కేఆర్​ఎంబీ కీలక ప్రకటన

by  |
రేపట్నుంచి గెజిట్​.. కేఆర్​ఎంబీ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులపై కీలకమైన అడుగుకు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి తొలుతగా ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 అవుట్​లెట్​ కేంద్రాలు బోర్డుల ఆధీనంలోకి రానున్నాయి. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కానుంది. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) మంగళవారం ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది. శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అవుట్‌లెట్లను అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ సూచించింది. అయితే కేంద్రం విడుదల చేసిన గెజిట్​లో ప్రాజెక్టులను టేకప్​ చేసే ప్రస్తావన లేదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినా.. కేఆర్​ఎంబీ మాత్రం బోర్డుల పరిధి ఖరారు చేస్తామని వెల్లడించింది.

ముందుగా ఐదు ప్రాజెక్టులు

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు నేపథ్యంలో మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలుండటం వల్ల ప్రస్తుతానికి వీలు కాదని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా ముసాయిదా తయారు చేసినట్లు వెల్లడించింది. కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై రెండు బోర్డులూ రెండు ఉపసంఘాలను నియమించామని, కమిటీలో రెండు రాష్ట్రాల నుంచి నీటిపారుదల, జెన్‌కోలకు చెందిన నలుగురు చీఫ్‌ ఇంజినీర్లతో పాటు, కృష్ణా బోర్డు నుంచి ఐదుగురు ఉన్న విషయాన్ని మరోసారి వివరించారు.

అధికారాలు కట్​..?

ముందు నుంచీ జల వివాదాలను పరిష్కరించుకోలేని తెలుగు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాజెక్టులపై అధికారాలు కోల్పోనున్నాయి. ఇప్పటికే జారీ అయిన గెజిట్ నోట్ ప్రకారం రేపట్నుంచి ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ డెడ్ లైన్​కు ఇంకా కొద్దిగంటలే మిగిలి ఉంది. ఇప్పటికే రెండు బోర్డులూ తెలుగు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో తెలంగాణ తరుపున అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఒక్కటి కూడా రికార్డుకెక్కలేదు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల్లోని కీలకమైన ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకునేందుకు దాదాపుగా సమాయత్తమైంది. కృష్ణా నది జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గొడవలు తారాస్థాయికి చేరి, ఎన్జీటీ నుంచి సుప్రీంకోర్టు దాకా ఫిర్యాదులు చేసుకోవడం, గోదావరి జలాలపైనా గొడవలు పడుతోన్న క్రమంలో పరిష్కారమార్గంగా కేంద్రమే పెత్తనాన్ని స్వీకరిస్తానని చెప్పడం, ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం తెలిసిందే. ఈ నెల 14 నుంచి కేంద్ర గెజిట్‌ అమలు కానున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ నేతృత్వంలోని నదీ యాజమాన్య బోర్డులు.. రెండు తెలుగు రాష్ట్రాలతో కీలక సమావేశాలు నిర్వహించింది. అయితే, అటు ఏపీ వాదనను, ఇటు తెలంగాణ వాదనను బోర్డులు పట్టించుకోకపోవడంతో మీటింగ్స్ నామమాత్రంగా మమ అన్నట్లు ముగించాయి. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించిన అన్ని కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ కేఆర్ఎంబీ చేసిన తీర్మానానికి ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపి, బోర్డు ప్రతిపాదనలను ప్రభుత్వ ఉత్తర్వులుగానూ ప్రకటించింది. అయితే మంగళవారం మీటింగ్ లో మాత్రం ఏపీ తరఫున ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే విషయమై తెలంగాణ ఇప్పటిదాకా ఉత్తర్వులివ్వలేదని, ఆ విషయాన్ని బోర్డే చూసుకోవాలని, గెజిట్ అమల్లోకి వచ్చినా రెండు మూడు నెలలు సంధికాలం ఉంటుందని వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో ఏపీ అంగీకారం తెలిపినా, తెలంగాణ మాత్రం నో చెప్పింది. ముందుగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను బోర్డు తేల్చాలని, నీటి వాటా తేలేదాకా నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయాలని వాదించారు.

కొత్త నిర్ణయాలేమీ లేవు : రజత్​ కుమార్​

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ నేతృత్వంలో ఫుల్​ బోర్డు సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇరిగేషన్​ ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఏపీ అడుగుతోందని, ఈ నెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామన్నారు. తమ నిర్ణయాన్ని కేంద్రానికి, ఏపీకి త్వరలో చెబుతామని, ప్రాజెక్టులకు రుణాల గురించి ఏమీ చర్చించలేదని రజత్​ కుమార్​ వివరించారు. అయితే ప్రాజెక్టుల్లో విద్యుత్‌ ఉత్పత్తి అధికారం ఇవ్వాలని కోరామని, ప్రొటోకాల్‌ ప్రకారం అనధికారికంగా విద్యుదుత్పత్తి చేయకూడదని చెప్పామన్నారు. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసి వాటాలు కేటాయించే వరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఆపాలని కేఆర్‌ఎంబీని కోరామన్నారు. కృష్ణా పరిధిలో 65 కేంద్రాలు గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఉన్నాయని వివరించారు. నాగార్జున సాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలివ్వాలని బోర్డు ప్రతిపాదించిందని చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కోరిందని, దీనిపై తాము అభ్యంతరం తెలిపామన్నారు. తమకు విద్యుత్‌ ఉత్పత్తి చాలా అవసరమని చెప్పామని పేర్కొన్నారు. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయ సలహా అడిగామన్నారు. అనంతరం ఏపీ ఇరిగేషన్​ శాఖ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ సాగర్‌, శ్రీశైలం విద్యుత్‌ ప్రాజెక్టుల గురించి బోర్డ్‌ ఛైర్మన్‌ చర్చించారన్నారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఏపీ సిద్ధమని శ్యామలరావు అన్నారు.

బోర్డు పరిధికి రానున్న ప్రాజెక్టుల కింద 29 కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌
*శ్రీశైలం స్పిల్‌వే
* కుడి విద్యుత్తు కేంద్రం
* పోతిరెడ్డిపాడు
* హంద్రీనీవా ఎత్తిపోతలకు నీటిని తీసుకొనే పంపుహౌస్
* ముచ్చుమర్రి పంపుహౌస్‌

తెలంగాణ
* ఎడమ విద్యుత్తు కేంద్రం
* కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌
* నాగార్జునసాగర్‌ కింద అత్యధికంగా 15 పాయింట్లున్నాయి. హెడ్‌వర్క్స్‌, కుడి, ఎడమ కాలువలతోపాటు, ప్రధాన విద్యుత్తు హౌస్‌, ఎడమ కాలువ కింద అనేక పాయింట్లు ఉన్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎ.ఎం.ఆర్‌.పి) లిప్టును కూడా మొదటి దశలో చేర్చారు.
* నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌
* పులిచింతల కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌
* కేసీకాలువ కింద సుంకేశుల బీ ఆర్డీఎస్‌ కింద క్రాస్‌ రెగ్యులేటర్‌
* తుమ్మిళ్ల ఎత్తిపోతల



Next Story

Most Viewed