వైజాగ్‌కు కృష్ణా బోర్డు తరలింపు

by  |
వైజాగ్‌కు కృష్ణా బోర్డు తరలింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం హైదరాబాద్‌లోని జలసౌధ భవన సముదాయంలో ఉన్న కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించే ప్రతిపాదనలో భాగంగా సరైన భవనాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందం ఏప్రిల్ మొదటివారంలో వెళ్ళనుంది. ఇప్పటికే ఒక దపా అక్కడకు వెళ్ళి కొన్ని భవనాలను పరిశీలించింది. వాటిలో సరైన సౌకర్యాలున్న భవనాలను ఎంపిక చేసే ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో పూర్తికానుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించాలన్న ప్రతిపాదనను గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చర్చించి ఆమోదం తెలిపాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో బోర్డు హెడ్ క్వార్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు యాజమాన్యానికి స్పష్టం చేసింది.

దాదాపు రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్నా.. ఇప్పటికీ భవనాల ఎంపిక కొలిక్కి రాలేదు. ఈ విషయమై మంగళవారం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన బోర్డు సభ్యుడు హరీకేశ్ మీనా .. ఏప్రిల్ మొదటి వారంకల్లా భవనాలను ఖరారు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఒకవేళ ఏ భవనం వీలుకాని పక్షంలో అక్కడ ఉన్న ప్రభుత్వరంగ సంస్థలతో సంప్రదింపులు జరిపి కృష్ణా బోర్డుకు తెలియజేసి సరైన భవనాలను రెడీ చేయాలని ఆ లేఖలో సూచించారు. బోర్డు ఏర్పాటుకు అవసరమైన జనరేటర్, పార్కింగ్, ఆఫీసు ఫర్నీచర్, సౌకర్యాలు, లిఫ్టులు, సరైన రోడ్లు… లాంట అన్ని వసతులూ ఉండాలని లేఖలో నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భవనాలను ఉచితంగా సమకూర్చాలని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వమే జల సౌధలో ఈ ఏర్పాట్లు చేసిందని గుర్తుచేశారు.

ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కృష్ణా బోర్డు తరలింపు ప్రక్రియ గురించి ఆరా తీసిందని, వీలైనంత త్వరగా బదిలీ కావాలంటూ సూచనలు చేసిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం జరగకుండా వెంటనే మార్చే ప్రక్రియ పూర్తికావాలని ఏపీ అధికారులకు బోర్డు సభ్యులు మీనా స్పష్టం చేశారు.

నలుగురు చీఫ్ ఇంజినీర్ల బదిలీ

తెలంగాణ సాగునీటిపారుదల శాఖలో ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న నలుగురిని బదిలీ చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్‌కర్నూల్ ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను అదే హోదాలో మహబూబ్‌నగర్‌కు, అక్కడ ఉన్న టి.శ్రీనివాసగౌడ్‌ను హైదరాబాద్‌లోని సీడీఓకు బదిలీ చేశారు. ఈ విభాగం ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న వి.మోహన్‌మార్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తదుపరి ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఉంటుంది. హైదరాబాద్‌లోని సాగునీటిపారుదల శాఖలో ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎంఏ హమీద్‌ను నాగర్‌కర్నూలుకు బదిలీ చేశారు.

Next Story

Most Viewed