‘కోమటిరెడ్డి’ కోల్డ్ వార్..!

by  |
‘కోమటిరెడ్డి’ కోల్డ్ వార్..!
X

వారిద్దరూ సొంత అన్నదమ్ములు. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వారిది. పార్టీపరంగానే కాకుండా సొంతంగానూ మంచి క్యాడర్ వారి సొంతం. వారే కోమటిరెడ్డి బ్రదర్స్. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఆ బ్రదర్స్ రాజకీయాలకు ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వారి మార్క్ క్యాడర్‌ను సంపాదించుకోవడం విశేషం. వారే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, గత ఎన్నికల్లో ఎంపీగానూ విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని త‌ృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయానికొస్తే.. తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో రాజకీయాల్లో వచ్చిందే తడవుగా భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం ఎమ్మెల్సీగా, గత ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వారిద్దరూ పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ వారి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలకు ప్రతిపక్షాలు దాదాపుగా చిత్తయ్యాయనే చెప్పాలి. రాజకీయంగా వారి వర్గానికి టికెట్లు దక్కించుకోవడంలో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు గుప్పుమంటున్నాయా.. అంటే పరిస్థితులను చూస్తే అదే స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితులు కాస్త పార్టీ క్యాడర్‌ను గందరగోళంలో పడేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ‘దిశ’ ప్రత్యేక కథనం.

దిశ ప్రతినిధి, నల్లగొండ:

కాంగ్రెస్‌లో ఎప్పుడూ వర్గపోరే..

వాస్తవానికి కాంగ్రెస్‌లో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ వర్గ పోరుతో అధిష్టానం సైతం ఇబ్బందులు పడుతోంది. నల్లగొండ జిల్లా రాజకీయాల వల్ల జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గానికి ఆ పార్టీ క్యాడర్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇద్దరూ మాస్ లీడర్లే. రాష్ట్ర స్థాయిలో కూడా కొంత కేడర్‌ను మెయింటెన్ చేస్తుంటారు. మీడియా దృష్టిలో పడేందుకు ఎప్పుడు ఏం మాట్లాడితే హాట్ టాపిక్ అవుతుందో తెలుసుకొని.. అధికార పార్టీతో పాటు సొంత పార్టీ నేతలపై కామెంట్స్ చేయడం వారికే చెల్లుతుంది. ఇదంతా పాత సంగతీ. తాజా ఈ ఇద్దరు బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ పీఠం విషయంలోనే బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది.

బెడిసికొట్టిన దూకుడు..

నిజానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆ ఒక్క నియోజకవర్గ పరిధిలో ఎంపీగా వెంకట్‌రెడ్డి ‌పర్యటించకపోవడం వెనుక కారణం అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడమే అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్ రెడ్డి ఓటమి పాలుకావడం, రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించడంతో పీసీసీ రేసులోకి రాజగోపాల్‌రెడ్డి ముందుకొచ్చారు. కానీ వెంకట్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో పీసీసీ రేసులో రాజగోపాల్‌రెడ్డి పూర్తిగా వెనకబడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతానని బహిరంగంగా చెప్పారు. బీజేపీలోకి వెళ్లనున్నట్టు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో సొంత తమ్ముడిని కంట్రోల్ చేయడంలో అన్న విఫలమయ్యారని కొంతమంది పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ఈ కార ణాలే పీసీసీ పీఠాన్ని దూరం చేసే అవకాశాలున్నట్లు వెంకట్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.

మొదటి నుంచి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీ సీ అధ్యక్షు డు కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఎప్పుడూ అన్న కి బహిరంగంగా మద్దతు పలికిన సందర్భం ఒక్కటీ లేదు. కొన్నిసార్లు మాత్రం ఇద్దరిలో ఎవరికైనా పీసీసీ ఇచ్చినా ఓకే అని చెప్పిన బ్రదర్స్.. ఇప్పుడు మళ్లీ నోరు మెదపడం లేదు. పీసీసీ పీఠం విషయంలో ఇద్దరు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తునట్లు చెప్పుకుంటున్నారు. కానీ రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారతానంటూ చేసుకు న్న ప్రచారం ఆయనకే బెడిసికొట్టినట్టు తెలు స్తోంది. పార్టీ మారే విషయంలో రాజగోపాల్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడం.. మొదటికే మోసాన్ని తెచ్చిపెట్టిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ మారడంపై ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా.. రాజగోపాల్‌రెడ్డి నేడు బీజేపీలో కీలకంగా వ్యవహరించి ఉండేవారని రాజగోపాల్‌రెడ్డి సొంత వర్గీయులు చెబుతున్నారు.

ఒక్క ప్రోగ్రామ్‌లో కలవలే..

టీపీసీసీ పీఠం రేసు సంగతి ఏలా ఉన్నా.. ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్.. ఎవరికి వారు అన్న చందంగా మారిపోయారు. ఇద్దరు కలిసి ఏ ఒక్క ప్రోగ్రాములో కలిసి పాల్గొన్నది లేదు. వెంకటరెడ్డి ఎంపీగా ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. ఎంపీ వెంకటరెడ్డి మిగిలిన అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చురుగ్గా కార్యక్రమాలు చేస్తున్నా.. మునుగోడులో మాత్రం అడుగుపెట్టడం లేదు. దీనంతటికి అంతర్గత విభేదాల కారణంగా తెలుస్తోంది. కానీ కొంతమంది అనుచరులు.. తమ పార్టీ ఎలాగో అధికారంలో లేదని, ఇప్పుడు అనవసర దూకుడు ఎందుకని, అందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ సైలెంట్ గా ఉన్నారని వాదిస్తున్నారు. పీసీసీ మార్పు అంశం హైకమాండ్ పరిశీలిస్తున్నందున ఇప్పుడు తొందరపడొద్దనే భావనలో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారన్న ప్రచారాన్ని పార్టీ శ్రేణులు ముమ్మరంగా చేస్తున్నారు. దీనికితోడు ఇప్పటికే బీజేపీ గూటికి వెళ్తారనే ప్రచారంతో డ్యామేజ్‌ అయిన తన ఇమేజ్‌ను ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి కాపాడుకోవాలని చూస్తున్నారన్న ప్రచారం లేకపోలేదు.

పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం..

ఇటు పార్టీ పరంగా.. అటు వ్యక్తిగతంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపట్ల పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా వీస్తున్న.. కోమటిరెడ్డి బ్రదర్స్ విజయం సాధించడంలో పార్టీ క్యాడరే కాదు.. సొంత అభిమానం కలిసొచ్చింది. కానీ పార్టీ మారడంపై రాజగోపాల్‌రెడ్డి దూకుడు వ్యవహా రం.. వెంకటరెడ్డి మౌనం కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు. చివరకు కరోనా సమయంలో తమ తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో రాజగోపా ల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో చేనేత కార్మికులకు రూ.70 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశారు. చేనేత కార్మికుల నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాకపోవడంతో వారి మధ్య సఖ్యత లేదనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ మునుగోడులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన నిరాహార దీక్షలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్పించలేదు. నిజానికి అన్నను తమ్ముడు ఆహ్వానించడం లేదా? ఆహ్వానించినా అన్న రావడం లేదా అనే చర్చ సాగుతోంది. వీరిద్దరూ కలసి కార్యక్రమాల్లో పాల్గొనకపోడంతో ఇటు క్యాడర్.. అటు అనుచర గణం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇకనైనా బ్రదర్స్ పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇస్తారా.. లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed